ఆందోళనలో పత్తి రైతులు

Cotton Prices Are Decreasing in Telangana - Sakshi

తగ్గుతున్న ధరలు.. మార్కెట్లో రోజుకో రేటు పలుకుతున్న వైనం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పత్తి ధరలు తగ్గుతు న్నాయి. గత నెల క్వింటాలుకు రూ.8 వేలకు పైగా పలికిన ధర.. ఇప్పుడు మార్కెట్లో రూ.7 వేల వరకు పడిపోయింది. దళారులు రోజుకో రేటు ఖరారు చేస్తూ అన్నదాతలను ఆగం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. పత్తి భారీగా మార్కెట్లోకి వస్తున్న సమయంలో దళారులు ధరల జిమ్మిక్కులు చేస్తు న్నారు.

ఈ ఏడాది పత్తికి కాలం కలసి రాక, ఆశించిన దిగుబడి వచ్చే పరిస్థితి లేని సమయంలో కనీ సం మంచి ధర వచ్చినా పెట్టుబడి దక్కుతుందని రైతులు భావిస్తున్నారు. కానీ దళారులు, వ్యాపా రులు పత్తి ధరలను ఇష్టారీతిగా ఖరారు చేస్తున్నా రన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే అంతర్జాతీ యంగా ఇంకా ధర పెరిగే అవకాశం ఉందని, రైతు లు తొందరపడి పత్తిని విక్రయించొద్దని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది దేశవ్యాప్తంగా పత్తి దిగుబడులు తగ్గే అవకాశం ఉన్నందున మున్ము ందు మంచి ధరలు వస్తాయని చెబుతున్నారు. ఈ విషయంలో రైతులు మార్కెట్‌ సరళిని ఎప్పటికప్పుడు గమనించాలని కోరుతున్నారు. 

తగ్గిన పత్తి దిగుబడులు..
ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో 1.40 కోట్ల ఎకరా ల్లో అన్ని పంటలు కలిపి సాగు చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేపట్టాలని నిర్దేశించింది. అయితే జూలై నెల నుంచి కురిసిన తీవ్రమైన వర్షాల కారణంగా అనేకచోట్ల వేసిన పత్తి పంట మునిగిపోయింది. దీంతో పత్తి సాగు కేవలం 50 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అధిక వర్షాల కార ణంగా ఆశించిన స్థాయిలో పూత, కాత రాలేదు. కీల కమైన పూత, కాత దశలోనూ వర్షాలు కురవడంతో పత్తి రంగు మారింది. దీంతో పత్తి దిగుబడులు తగ్గు తున్నాయి.

గతేడాది పత్తి పంటను 46.25 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, 69.46 లక్షల బేళ్ల ఉత్పత్తి వస్తుందని అంచనా వేశారు. కానీ ఈసారి 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, కేవలం 53.28 లక్షల బేళ్ల ఉత్పత్తి జరుగుతుందని రాష్ట్ర అర్థగణాంకశాఖ అంచనా వేసింది. దిగుబడులు తగ్గడం వల్ల రైతులు భారీగా నష్టపోయే పరిస్థితి నెలకొంది. అయితే ధరలు గతేడాది మాదిరిగా క్వింటాలకు రూ.10 వేలకు పైగా ఉంటే, దిగుబడి తగ్గినా ఎంతోకొంత నష్టాలను పూడ్చుకోవచ్చని రైతులు భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.6,380 ఉంది.

కానీ ఈ ఏడాది మద్దతు ధర కంటే పత్తికి బహిరంగ విపణిలో ధర ఎక్కువే ఉన్నా, గతేడాది కంటే ధర తగ్గుతుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం పత్తి సీజన్‌ ప్రారంభానికి ముందు క్వింటాలుకు రూ.8 వేలకు పైగా పలికిన ధర, రైతులు పెద్ద ఎత్తున విక్రయానికి తీసు కువచ్చే సమయానికి తగ్గిపోవడం కలవరపరుస్తోంది. ఆదిలాబాద్‌ మార్కెట్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభించిన రోజు క్వింటాలు పత్తి ధర రూ.8,300 ఉంది. తర్వాత రోజురోజుకూ తగ్గుతూ గత నెల 29నాటికి క్వింటాలుకు రూ.7,330 పడిపోయింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top