కాల్పుల విరమణ దిశగా మావోలు?

Coronavirus: Twelve Senior Maoists Affected Covid Over Ceasefire - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అడవిలో కరోనా కలకలం పుట్టిస్తోంది. ఇంతకాలం ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో ఉండి పోరాడిన మావోయిస్టులను మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఓ వైపు తమ కోసం దండకారణ్యంలో భద్రతా బలగాల వేట కొనసాగుతుండగా, మరోవైపు కంటికి కనిపించని వైరస్‌ దళంలో ఒక్కొక్కరిని బలి తీసుకుంటోంది. ఈ వ్యాధి తీవ్రత నేపథ్యంలో కొంతకాలం కాల్పుల విరమణ చేయాలన్న అంశం మావోయిస్టు పార్టీలో చర్చకు వచ్చిందని, కరోనా బారినపడ్డ పలువురు మావోలు ఈ దిశగా ఆలోచిస్తున్నారని సమాచారం. అయితే, దీనిపై ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

మరోవైపు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు మాత్రం బేషరతుగా లొంగిపోతే మంచి వైద్యం అందిస్తామని ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన దండకారణ్య స్పెషల్‌ జోన్‌ డివిజినల్‌ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్‌ అలియాస్‌ మోహన్‌ అలియాస్‌ శోబ్రాయ్‌ పోస్ట్‌ కోవిడ్‌ లక్షణాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో మిగిలిన వారి ఆరోగ్యంపై ఆందోళన మొదలైంది.

కరోనా బారినపడ్డ మధుకర్‌ను జూన్‌ 2న ఛత్తీస్‌గఢ్‌ నుంచి హన్మకొండకు వస్తుండగా వరంగల్‌ పోలీసులు పట్టుకుని చికిత్స అందించారు. తీవ్రమైన డయేరియా, కరోనా కారణంగా ఆయన శరీరంలో అనేక మార్పులు వచ్చాయని వాటి కారణంగానే మరణించినట్లు వైద్యులు చెప్పారని వరంగల్‌ సీపీ తరుణ్‌జోషి ‘సాక్షి’కి వెల్లడించారు. తనతోపాటు కరోనాబారిన పడ్డ మరో 12 మంది సీనియర్ల పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉందని మధుకర్‌ పోలీసులకు చెప్పాడు. 

లోపల ఉండలేరు, బయటికి రాలేరు.. 
ఆందోళనకర పరిస్థితి ఉన్న ఆ 12 మంది మావోయిస్టులు పార్టీలో చాలా సీనియర్లు. వారంతా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ సమయంలో వారిని కోవిడ్‌ చుట్టుముట్టడంతో శారీరక సమస్యలు రెట్టింపయ్యాయి. కొరియర్ల సాయంతో తెలంగాణ నుంచి మందులు సేకరించినా, ఛత్తీస్‌గఢ్‌లో గ్రామస్తుల రూపంలో వ్యాక్సిన్‌ వేయించుకున్నా.. అది కింద కేడర్‌కే వీలవుతుంది. సీనియర్ల తలలపై రివార్డు ఉన్న నేపథ్యంలో వారు బయటికి వచ్చే పరిస్థితి లేదు. బయటికి వచ్చి చికిత్స చేయించుకుందామనుకున్నా.. మావోయిస్టు పార్టీ అనుమతించడం లేదు.

ఆందోళనకరంగా ఉన్న 12 మంది వీరే..  
1. కటకం సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్, 2. తిప్పరి తిరుతి ఆలియాస్‌ దేవుజీ, 3.యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్, 4. బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్, 5. కటకం రాజిరెడ్డి అలియాస్‌ ధర్మన్న, 6. కట్టా రాంచందర్‌ రెడ్డి అలియాస్‌ వికల్స్, 7. ములా దేవేందర్‌ రెడ్డి అలియాస్‌ మాస దడ, 8. కున్‌కటి వెంకటయ్య అలియాస్‌ వికాస్, 9. ముచ్చకి ఉజల్‌ అలి యాస్‌ రఘు, 10. కొడి మంజుల అలియాస్‌ నిర్మల, 11. పూసం పద్మ 12. కాకర్ల సునీత అలియాస్‌ బుర్రా. 

మరణాలకు కారణాలివే.. 

  • దండకారణ్యంలో సంచరించే మావోల్లో వ్యాపిస్తోన్న కరోనా స్ట్రెయిన్‌ చాలా ప్రమాదకరమైనదని సమాచారం. అయితే అది ఏంటన్నది ఇంతవరకూ గుర్తించలేదు. 
  • దళంలో ఆస్తమా, బీపీ, షుగర్, గుండె జబ్బులు తదితర దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వారిలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. 
  • మహారాష్ట్ర, తెలంగాణలో లాక్‌డౌన్‌ కారణంగా కొరియర్లు, సానుభూతిపరుల నుంచి మందులు సకాలంలో అందడం లేదు. 
  • దళంలో కరోనా పాజిటివ్‌ ఉన్నవారిలో కొందరికి మాత్రలతో వ్యాధి అదుపులోకి రావడంలేదు. అది తీవ్రరూపం దాల్చి ఆక్సిజన్‌ సిలిండర్లు, వెంటిలేటర్లు పెట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతోంది. 
  • వేసవి కావడంతో అడవుల్లో తాగునీటి కొరత ఏర్పడింది. డెంగీ, మలేరియా, డయేరియా లక్షణాలకు.. కరోనా లక్షణాలకు పెద్దగా తేడా లేకపోవడంతో వ్యాధి నిర్ధారణలో జాప్యం జరుగుతోంది. తాజాగా మధుకర్‌ కూడా డయేరియాతో బాధపడుతూ మరణించడం గమనార్హం.
    చదవండి: జూలై నుంచి కాళేశ్వరం ఎత్తిపోత!
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top