అప్పుల తిప్పలు

Coronavirus: People Faces Debt Burden In Nizamabad - Sakshi

సాక్షి, బీబీపేట(నిజామాబాద్‌): పేదలకు కరోనా మిగిల్చిన కష్టం అంతా ఇంతా కాదు. ఆరు నెలలుగా అనుభవించిన గడ్డు పరిస్థితుల నుంచి బయట పడడానికి వారికి కొన్నేళ్ల కాలం పడుతుంది. పనుల్లేక పూట గడవక విధిలేని పరిస్థితుల్లో అప్పుల బాట పట్టిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. కరోనా సమయంలో వడ్డీ మాఫియా సొమ్ము చేసుకుంటోంది. పేదల అవసరం వడ్డీ వ్యాపారులకు అవకాశంగా మారింది. గతంలో కన్నా ఇప్పుడు రెట్టింపు వడ్డీ వసూలు చేస్తున్నారు. అప్పు తీసుకుంటున్న మొత్తాన్ని బట్టి రూ. 10కి పైనే వడ్డీ వసూలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పేదలు తిరిగి చెల్లిస్తున్న మొత్తం వడ్డీకి  కూడా సరిపోకపోవడం బాధాకరం. ఈ జాబితాలో ఎక్కువగా రోజు వారీ కూలీలు చిరువ్యాపారులు ఉన్నారు. 

పనిచేస్తేనే నాలుగు వేళ్లు నోట్లోకి.. 
కరోనా చిరు వ్యాపారులు, కూలీలు, చిన్నచిన్న ఉద్యోగుల బతుకులను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. మార్చి 22న జనతా కర్ఫ్యూ మొదలైన తర్వాత రెండు నెలల పాటు ఇంట్లో నుంచి బయటకు కదల్లేని పరిస్థితి. అప్పటి వరకు దాచిపెట్టుకున్న డబ్బులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన రేషన్‌ వీరి కడుపును పూర్తిగా నింపలేకపోయాయి. ఇక రెండు నెలల తర్వాత దశలవారిగా లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎత్తివేస్తూ వస్తున్నప్పటికీ అన్ని రంగాలు తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయాయి. దీంతో కూలీలకు పనులు దొరకడం కష్టంగా మారింది. గ్రామాల్లో కొంత వరకు ఉపాధి హామీ పనులు ఆదుకుంటున్నా, పట్టణాల్లోని నిరుపేదల బతుకులు మరీ దారుణంగా మారాయి. ఇక వీధి వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నిత్యావసర వస్తువులు మినహా మిగిలిన వస్తువులు, తిను బండారాలను కొనేవారు లేకుండా పోయారు. దీంతో రోజూ వీధులు తిరుగుతూ రోడ్లపై బండ్లు, బుట్టలు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్న పేద వర్గాలకు పూట గడవడం కూడా కష్టంగా మారింది. ఇక విధి లేని పరిస్థితుల్లో అప్పులు తెచ్చుకొని బతుకు బండి లాగించాల్సిన దుస్థితి నెలకొంది. 

అవసరాన్ని ఆసరాగా తీసుకొని.. 
ఓ వైపు నిరుపేదల దుస్థితి ఇలా ఉంటే వడ్డీ మాఫియా మా త్రం దీన్ని అవకాశంగా మలుచుకుంటోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ. 2కు మించి వడ్డీకి ఇవ్వకూడదు. కానీ సాధారణ రోజుల్లోనూ రూ. 5 వరకు వడ్డీ వసూలు చేసేవా రు. అయితే ఇప్పుడు కష్టకాలంలో తగ్గించాల్సింది పోయి రె ట్టింపు చేశారు. వడ్డీ మాఫియా మానవత్వం మరిచి ప్రవర్తిస్తుండడంతో పేదలపై కరోనా భారం కన్నా వడ్డీ భారం ఎక్కువగా కనిపిస్తోంది. కూలీలు, వీధి వ్యాపారులు రూ. 10 వేలు నుంచి రూ. 50 వేల వరకు వడ్డీకి తీసుకుంటున్నారు. రోజువారీ, వారం వారీ పద్ధతిలో తిరిగి చెల్లించాల్సి ఉంది. వీ ధి వ్యాపారులు పెట్టుబడి కోసం ఉదయం తీసుకుంటే సా యంత్రానికి తిరిగి చెల్లించాలి. ఇప్పుడు రోజంతా వ్యాపారం చేసినా తిరిగి చెల్లించడానికి మొత్తం సరిపోతుంది తప్ప ఏమీ మిగలడం లేదని పలువురు వీధి వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరి నుంచి ప్రామిసరీ నోట్లు, వస్తువులు, వాహనాలు, ఇళ్లపట్టాలు తీసుకుంటూ వడ్డీకి డబ్బులిస్తున్నారు. పనులు దొరక్క ఒకటి రెండు రోజులు తిరిగి చెల్లించడంలో ఆలస్యమైతే బెదిరింపులు, దౌర్జన్యాలు చేస్తున్నారు. మరికొన్నాళ్లు ఇదే పరిస్థితి కొనసాగితే నిరుపేదల జీవితాలు మరింత దారుణంగా మారనుంది. 

భారంగా దుకాణాల కిరాయిలు 
జిల్లా వ్యాప్తంగా ఆయా దుకాణాలు నడిపే వ్యక్తులు చాలా వరకు కిరాయికి తీసుకున్న షాపులే. జిల్లా కేంద్రంలో ఒక్కో షాపు కిరాయి రూ. 20 వేల నుంచి రూ. 50 వేల వరకు కూడా ఉంది. మండల కేంద్రంలో రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు ఉన్నాయి. దీంతో ఆరు నెలలుగా దుకాణాలు సరిగ్గా నడవకపోవడంతో రూం అద్దెలు చెల్లించడానికి కూడా డబ్బులు లేకుండా పోయాయి. అటు అద్దె చెల్లించకపోవడంతో సదరు యజమానులు రూంలు ఖాళీ చేయించడంతో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చాలా వరకు షాపులు మూతబడ్డాయి. ఒక్కో షాపు యజమాని వడ్డీకి డబ్బులు తెచ్చి రూం అద్దెలు చెల్లిస్తున్నారు.  

కరోనా వల్ల చాలా నష్టాలు చూస్తున్నాం 
కరోనా వైరస్‌ వల్ల దుకాణాలు నడవక పోవడంతో కుటుంబం నడవడమే ఇబ్బందిగా ఉంది. గతంలో వచ్చిన గిరాకీ ఇప్పుడు లేకపోవడంతో తెచ్చిన సరుకులు సైతం వాలిడిటీ అయిపోయి పాడేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొనడానికి వచ్చే ప్రజలు కూడా భయంతో వణుకుతున్నారు. దుకాణాలు విడిచి వేరే పని చేసుకోవాలంటే ఇంత సరుకులు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ప్రభుత్వమే చిన్న వ్యాపారులను ఆదుకోవాలి. 
– వెంకటేశ్, జనరల్‌ స్టోర్‌ నిర్వాహకుడు, బీబీపేట

దుకాణాలు నడపడం భారంగా ఉంది 
కరోనా వల్ల దుకాణాలు నడవకపోవడంతో వాటి అద్దెలు కూడా చెల్లించడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తెచ్చిన సరుకులు అమ్ముడు పోతలేవు. దీంతో దుకాణాలు నడపడం భారంగా మారింది. అంతే కాకుండా గ్రామాల్లో సైతం లాక్‌డౌన్‌ విధించడంతో కూడా ఇబ్బందులు వస్తున్నాయి. కనీసం లాక్‌డౌన్‌ లేకుంటే అయిన కొద్దిగా గిరాకీ వస్తుండేది. కానీ లాక్‌డౌన్‌ పెట్టడంతో జనాలు బయటకు రావడం లేదు. దీంతో దుకాణాలు నడవడం కష్టంగా మారింది. 
– మహేశ్, మొబైల్‌ షాపు నిర్వాహకుడు, బీబీపేట

అధిక వడ్డీలు వసూలు చేసే వారి వివరాలు తెలపాలి 
పేదల నుంచి వడ్డీ వ్యాపారులు అప్పులకు సంబంధించి అధిక వడ్డీలు వసూలు చేసే వారి వివరాలు తెలపాలని, వారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడేది లేదు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకోం. ఇచ్చిన అప్పులను వసూలు చేసే క్రమంలో ఇళ్లపై దాడులు చేయడం, బెదిరింపులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఉంటాయి. ప్రజలు ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం.  
– యాలాద్రి, సీఐ, భిక్కనూరు  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top