ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పీఎఫ్ చెల్లింపులో ఏజెన్సీల ఇష్టారాజ్యం
రాష్ట్రవ్యాప్తంగా 70 శాతం మందికి నెలవారీగా చెల్లింపుల్లో తీవ్ర జాప్యం
ఉద్యోగుల వేతనంలో వారి వాటా మినహాయించుకుంటున్న వైనం
తమ చందా కలిపి చెల్లించాల్సి ఉండగా తీవ్ర నిర్లక్ష్యం
చెల్లింపులు క్రమం తప్పుతుండటంతో ఉద్యోగుల కీలక ప్రయోజనాలకు గండి
ఏటా వచ్చే వడ్డీ జమలో అవరోధాలు..పింఛను, బీమా పథకాలకు దూరం
ఈఎస్‌ఐ చందా చెల్లింపులోనూ ఇదే తీరు
అధికారుల పర్యవేక్షణ లోపంపై ఉద్యోగుల సంఘం ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో 73 మంది పనిచేస్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ అటెండర్, ఎల్రక్టీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, సబ్ స్టాఫ్ కేటగిరీలో 2023 ఆగస్టు నుంచి పనిచేస్తున్నారు. ఈ ఉద్యోగులకు సంబంధించి 2024 జనవరి నుంచి 2025 జూన్ వరకు ఏజెన్సీ ఈపీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లించలేదు. దీంతో ఉద్యోగులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ఆ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీని బ్లాక్ లిస్టులో చేర్చారు. ఆ తర్వాత మరో ఏజెన్సీని ఎంపిక చేశారు. ప్రస్తుత ఏజెన్సీ కూడా ఈ రెండు కేటగిరీల్లోని బకాయిలు, చందా చెల్లింపును నిలిపివేసింది. దీంతో వారి ఈఎస్‌ఐ, పీఎఫ్ పరిస్థితి గందరగోళంగా మారింది.
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల భవిష్య నిధి సంకటంలో పడింది. ఉద్యోగుల వేతనం నుంచి నెలవారీగా కొంత మొత్తాన్ని పొదుపు చేసుకునేందుకు వీలు కల్పించే పీఎఫ్ ఖాతా లెక్కలు గాడి తప్పుతున్నాయి. పీఎఫ్ చందా చెల్లించడంలో ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల నిర్లక్ష్య వైఖరి, తీవ్రమైన జాప్యం, పర్యవేక్షించాల్సిన అధికారుల ఉదాసీనత.. వెరసి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్ అవసరాల ఆసరాగా నిలిచే పీఎఫ్ పరిస్థితి ఆగమాగంగా మారింది.
ఉద్యోగుల వాటా కింద క్రమం తప్పకుండా నగదు మినహాయించుకుంటున్న ఏజెన్సీలు ఈ మొత్తానికి సమానంగా తమ వాటా కలిపి ఈపీఎఫ్‌ఓకు చెల్లించాల్సి ఉండగా నెలల తరబడి ఎగనామం పెడుతున్నాయి. ఈపీఎఫ్ ఖాతా నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ఉద్యోగులు.. ఈపీఎఫ్ వడ్డీ, సర్వీసు ఆధారిత పెన్షన్‌కు అర్హత, బీమా వంటి కీలక ప్రయోజనాలకు దూరం అవుతున్నారు.
ఏజెన్సీల ఇష్టారాజ్యం
రాష్ట్ర ప్రభుత్వంలోని 31 విభాగాల్లో 4,93,820 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులున్నారు. వీరిని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కాకుండా, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా నియమించుకుంటోంది. అయితే ఉద్యోగులకు వేతనాలను నేరుగా వారి వ్యక్తిగత ఖాతాలకు కాకుండా ఏజెన్సీకి చెల్లించడం.. ఏజెన్సీ తిరిగి ఉద్యోగుల ఖాతాలో డబ్బు జమ చేయడం జరుగుతోంది. ఈ మధ్యవర్తిత్వ వ్యవహారాన్ని ఆసరాగా చేసుకుంటున్న ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.
ఉద్యోగులకు వేతనాల చెల్లింపుల్లో జాప్యం చేయడంతో పాటు వారికి నెలవారీగా చెల్లించాల్సిన పీఎఫ్ అలాగే ఈఎస్‌ఐ పథకాల చందాను కూడా సకాలంలో చెల్లించడం లేదు. పట్టించుకునేవారు లేకపోవడంతో ఆ మొత్తాన్ని ఏజెన్సీలు ఇష్టానుసారంగా వినియోగించుకుంటున్నాయని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎంత నష్టమో..!
ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో నెలవారీగా చందా తప్పనిసరిగా జమ చేయాల్సిన బాధ్యత ఏజెన్సీపై ఉంది. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల్లో దాదాపు 70 శాతం మందికి నెలవారీగా చెల్లింపులు జరగడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. దీనివల్ల ఏటా ఈపీఎఫ్‌ఓ మంజూరు చేసే వడ్డీ జమ కావడంలో అవరోధాలు ఏర్పడతాయి.
⇒ పీఎఫ్ ఖాతాలో నగదు జమకు సంబంధించిన లెక్కింపు ప్రక్రియ క్రమం తప్పుతుండడంతో వాస్తవ వడ్డీ అందే పరిస్థితి ఉండదు.
⇒ జాతీయ బ్యాంకులు, ఇతర ప్రైవేటు బ్యాంకులతో పోలిస్తే అత్యధిక వడ్డీ ఇస్తున్న సంస్థ ఈపీఎఫ్‌ఓ. దీంతో ఉద్యోగికి ఆర్థికంగా నష్టం తీవ్రంగానే ఉంటుంది.
⇒ ఈపీఎఫ్‌ఓ అమలు చేసే మరో పథకం పెన్షన్. సర్వీసు పూర్తయిన తర్వాత ఈ పథకం అమలు కానున్నప్పటికీ... నెలవారీ చందా ఆధారంగానే సర్వీసును పరిగణనలోకి తీసుకుంటారు. చందా చెల్లింపు క్రమం తప్పకుండా జర గకపోతే సర్వీసు పరిగణనలో ఇబ్బందులెదురవుతాయి.
⇒ సర్వీసులో ఉన్న ఈపీఎఫ్ ఉద్యోగి మరణిస్తే అతని కుటుంబానికి రూ.7.5 లక్షల గరిష్ట బీమా నగదు అందుతుంది. కానీ చందా చెల్లించకపోవడం, చెల్లింపుల్లో జాప్యం నెలకొంటుండడంతో బీమా పథకానికి అర్హత ప్రశ్నార్థకంగా మారుతుంది.
⇒ ఈఎస్‌ఐ పరిధిలోని ఉద్యోగికి కేంద్ర కారి్మక శాఖ ద్వారా ప్రత్యేక ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తారు. ఈఎస్‌ఐ ద్వారా అమలయ్యే ఈ పథకానికి ప్రతి నెలా క్రమం తప్పకుండా చందా జమ చేస్తేనే అర్హత సాధిస్తారు. ఎలాంటి జాప్యం నెలకొన్నా అర్హత కోల్పోతారు.
అధికారుల నిర్లక్ష్యమే శాపం
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన వేతన నిధులు సదరు శాఖాధిపతుల ద్వారా ఏజెన్సీకి విడుదల అవుతున్నప్పటికీ..అవి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సరైన విధంగా అందుతున్నాయో? లేదో? అనే పర్యవేక్షణ మాత్రం కనిపించడం లేదు. కేవలం నిధుల విడుదలకే పరిమితమవుతున్న అధికారులు.. ఆ తర్వాత ఏజెన్సీ ద్వారా జరగాల్సిన ప్రక్రియపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడైనా ఉద్యోగులు లిఖితపూర్వక ఫిర్యాదు చేస్తే తప్ప అడుగు ముందుకు పడటం లేదు.
ఏజెన్సీల ఎంపిక జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీంతో శాఖాధిపతికి ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు ఉండడంతో ఫిర్యాదుల పరిష్కరానికి సుదీర్ఘ సమయం పడుతోంది. ఇక ఈపీఎఫ్ పథకం అమలుకు సంబంధించిన ఫిర్యాదులను నేరుగా ఈపీఎఫ్‌ఓలో ఫిర్యాదు చేయాలి. కానీ ఉద్యోగులకు దీనిపై సరైన అవగాహన ఉండటం లేదు. లిఖితపూర్వక ఫిర్యాదులపై తప్పకుండా స్పందిస్తామని ప్రావిడెంట్ ఫండ్ అధికారులు చెబుతున్నారు.
⇒ ఎం.లలిత 2022 సంవత్సరం నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా డిగ్రీ కాలేజీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ (ఔట్ సోర్సింగ్)గా పనిచేస్తున్నారు. అంతకు ముందు ఆమె నల్లగొండ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పని చేసేవారు. దాదాపు నాలుగేళ్లు కావస్తున్నా ఆమె ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాలో పైసా నిధి జమ కాలేదు. బదిలీ క్రమంలో ఆమె సర్వీసు ఒక ఏజెన్సీ నుంచి మరో ఏజెన్సీకి ట్రాన్స్‌ఫర్ అయ్యింది. దీంతో పీఎఫ్ బకాయిలు ఎవరు చెల్లిస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. లలిత ఎన్నోసార్లు ఏజెన్సీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదు. పీఎఫ్ చెల్లించకపోవడంతో తన నాలుగేళ్ల సర్వీసు కోల్పోతాననే ఆందోళనకు గురవుతున్నారు.
⇒ కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రెండేళ్ల పాటు వార్డు బాయ్‌గా పనిచేసిన కోలా అనుదీప్ అనారోగ్య కారణాలతో ఈ ఏడాది ఫిబ్రవరిలో మరణించాడు. అతని ఈపీఎఫ్‌తో పాటు ఈఎస్‌ఐ చందా ఏజెన్సీ చెల్లించకపోవడంతో ఇన్సూరెన్స్‌కు అర్హత లేకుండా పోయింది. దీంతో అతని కుటుంబం పెన్షన్ పథకానికి దూరమైంది. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు.
ఏజెన్సీల దోపిడీపై ప్రత్యేక విచారణ చేయించాలి
రాష్ట్రవ్యాప్తంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఈఎస్‌ఐ, పీఎఫ్ చెల్లింపుల్లో చాలా సమస్యలున్నాయి. నెలవారీగా చేయాల్సిన చెల్లింపులు ఆర్నెల్ల కంటే ఎక్కువ జాప్యంతో జరుగుతున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. ప్రభుత్వం నెలవారీగా నిధులు విడుదల చేస్తున్నప్పటికీ... ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు మాత్రం ఇష్టానుసారంగా చెల్లింపులు చేస్తున్నాయి. పీఎఫ్ చెల్లింపుల్లో జాప్యం వల్ల ఉద్యోగులకు చేకూరాల్సిన ప్రయోజనాలు అందవు. ఈఎస్‌ఐ చెల్లింపులు ఆపితే ఉద్యోగికి వైద్య సదుపాయాలు నిలిచిపోతాయి. ఇది ఉద్యోగికి చాలా నష్టం కలిగిస్తుంది. దీనిపై ఫిర్యాదులు చేస్తున్నా అధికారుల నుంచి పెద్దగా స్పందన ఉండటం లేదు. ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో అధికారుల కమిటీని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా విచారణ చేపట్టాలి. ఏజెన్సీల అక్రమాలను వెలికితీయాలి. – పులి లక్ష్మయ్య, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం


