త్వరలో క్రిస్టియన్‌ భవన్‌ నిర్మాణం పూర్తి 

Construction Of The Christian Building Will Be Completed Soon: KTR - Sakshi

క్రైస్తవుల సమస్యల పరిష్కారం కోసం సలహా సంఘం ఏర్పాటు

క్రిస్టియన్‌ మత పెద్దల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని క్రైస్తవుల సమస్యల పరిష్కారం కోసం సలహా సంఘం ఏర్పాటు చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. సీఎం కేసీఆర్‌ కేవలం మాటల సెక్యూలరిస్ట్‌ కాదని, ఆచరణలో గుండెల నిండా లౌకికవాదాన్ని నింపుకున్నారన్నారు. మంత్రుల నివాస ప్రాం గణంలోని క్లబ్‌హౌజ్‌లో శుక్రవారం జరిగిన క్రైస్తవ మత పెద్దల ఆత్మీయ సమ్మేళనంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలసి ఆయన పాల్గొన్నారు. దేశ, రాష్ట్రాభివృద్ధిలో మిషనరీల పాత్ర ఎవరూ కాదనలేరని, కరోనా పరిస్థితుల్లో మిషనరీ ఆసుపత్రుల సేవలు మరువలేనివని కేటీఆర్‌ ప్రశంసించారు. సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని, క్రైస్తవ భవన నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామని హామీనిచ్చారు. 

8 వేల మందికి విద్యాబోధన: కొప్పుల
రాష్ట్రంలో క్రైస్తవుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ వెల్లడించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న 204 రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 8 వేల మంది క్రైస్తవ విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. క్రైస్తవ శ్మశాన వాటికల కోసం స్థలాలు కేటాయించడంతో పాటు, వాటిని అభివృద్ధి కూడా చేస్తున్నామన్నారు. క్రైస్తవ సంస్థల ఆస్తులను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని ఆయన హామీనిచ్చారు. కోవిడ్‌ పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ అన్నారు. వంద దేశాల కంటే ఎక్కువ జనాభాను కలిగి ఉన్న హైదరాబాద్‌ శరవేగంగా విస్తరిస్తోందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్, సికింద్రాబాద్‌ బిషప్‌ తుమ్మ బాల తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top