
రేవంత్ సర్కారు చేసింది కులాల సర్వే మాత్రమే
బీఆర్‌ఎస్ నేతలు ఒకరు రిటైర్, మరొకరు లీవ్, ఇంకొకరు రెస్టులో..
5న రాష్ట్రంలో రూ.5 వేల కోట్ల రోడ్ల పనులకు శ్రీకారం
ప్రారంభించనున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేయలేదని, కులాల సర్వే మాత్రమే చేసిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి విమర్శించారు. ఈ కులాల సర్వేతో ముస్లింలను బీసీ జాబితాలో చేర్చి.. బీసీలకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. శనివారం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కులగణన చట్టం ఆధారంగా జనాభా లెక్కలతోపాటు పక్కాగా కులగణనను చేపట్టనుందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నేతల విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ‘బీఆర్‌ఎస్ నేతల్లో ఒకరు రిటైర్మెంట్‌లో ఉన్నారు. ఒకరు లీవ్‌లో ఉన్నారు. ఒకరు నడుము విరగ్గొట్టుకొని రెస్ట్‌లో ఉన్నారు (కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌లను ఉద్దేశించి)’అని ఎద్దేవా చేశారు.
5న రూ.5 వేల కోట్ల పనులకు ప్రారంబోత్సవాలు
ఈ నెల 5న ఆదిలాబాద్, హైదరాబాద్‌లో రూ.5,416 కోట్లతో చేపట్టిన 26 ప్రాజెక్టుల పనులకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారం¿ోత్సవాలు, శంఖుస్థాపనలు చేస్తారని కిషన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేట ఫ్లైఓవర్‌ను ప్రారంభిస్తారని వెల్లడించారు. తెలంగాణతో ముడిపడి ఉన్న 5 కారిడార్ల నిర్మాణానికి కేంద్రం లక్ష కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు.
2014 వరకు తెలంగాణలో 2,500 కి.మీ జాతీయ రహదారులుంటే, ప్రస్తుతం 5,200 కి.మీలకు పెంచామని వెల్లడించారు. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిని ఆరు లేన్లుగా విస్తరించనున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా భూములను అప్పగిస్తే.. అంత వేగంగా రోడ్ల నిర్మాణం పూర్తిచేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 32 జిల్లా కేంద్రాల గుండా జాతీయ రహదారులు వెళ్తున్నాయని చెప్పారు.