ఇందిరమ్మ ఇంటి పథకంలో గందరగోళం
గత ప్రభుత్వ దళితబంధు స్కీమ్‌తో జీవనోపాధికి క్యాబ్ కొన్న వేలాది మంది లబ్ధిదారులు
పేదలే అయినందున చాలామందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
తీరా బిల్లులు చెల్లించే వేళ, కారున్నందున అర్హులు కారంటూ నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుపేద ఎల్లయ్య దళితబంధు కింద కారు కొనుక్కుని క్యాబ్ డ్రైవర్‌గా జీవనోపాధి పొందుతున్నాడు. వారిది నిరుపేద కుటుంబమే. సొంతిల్లు లేకపోవటంతో ఇందిరమ్మ పథకం కింద ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ, కారు ఉందన్న కారణంతో ఆయనకు ఇందిరమ్మ ఇంటి ఆర్థిక సాయం పొందేందుకు అర్హత లేదనే అనుమానం కింద ప్రత్యేక జాబితాలో చేర్చారు. రోజువారీ ప్రయాణ అవసరాలకు కారు కొనుక్కోవటాన్ని, ఉపాధి రూపంలో క్యాబ్ నడుపుకోవటానికి కారు పొందటాన్ని ఒకేగాటిన కట్టడం ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పెద్దచర్చకు దారి తీస్తోంది.
పథకాన్ని ప్రారంభించేటప్పుడు అర్హతలు, అనర్హతల విషయంలో పేర్కొన్న అంశాల విషయంలో లోతుగా అధ్యయనం చేయకపోవటం గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఇందులో క్యాబ్ డ్రైవర్ల అంశం కీలకంగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో క్యాబ్ సేవలు విస్తృతమవుతున్నాయి. వేల మంది దీన్ని ఉపాధిగా మార్చుకున్నారు. ఉన్న ఊళ్లో పూట గడవటం కష్టంగా మారిన చాలామంది దీనివైపు మొగ్గుచూపుతున్నారు. గత ప్రభుత్వం దళిత బంధు ఆర్థిక సాయాన్ని అందజేసిన సమయంలో వేల మంది దళిత యువకులు దాన్ని క్యాబ్ కార్ల కొనుగోలుకు వినియోగించుకున్నారు. అప్పట్లో ఈ పథకానికి నిరుపేదలుగా అర్హత పొందిన వారు ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి వచ్చేసరికి ‘అనర్హులు’గా మారిపోయారు.
‘కారు’తోనే కిరికిరి...
ఇందిరమ్మ పథకం లబ్ధి పొందే అర్హత జాబితాలో సొంత కారు ఉండకూడదన్న నిబంధన ఉంది. కారు కొనే ఆర్థిక స్తోమత ఉంటే నిరుపేదలు కాదన్న మూలసూత్రం ఆధా రంగా దీన్ని చేర్చారు. జీవనోపాధి కోసం క్యాబ్ కారు ఉన్న వారిని కూడా ఇందులో చేర్చారు. లబ్ధిదారు కుటుంబ సభ్యుల పేరుతో కారు ఉండటంతో ఇలా పరిగణించారు. దీంతో ఇప్పుడు వేలాది మంది సొంత క్యాబ్ డ్రైవర్లు లబోదిబో మంటున్నారు.
అసలు గందరగోళం ఇలా...
సొంత కారైనా, క్యాబ్ కారైనా... కారు ఉంటే ఇందిరమ్మ ఇంటికి అర్హత రాదు అని ముందే స్పష్టం చేసి ఉంటే అయోమయం ఉండేది కాదు. ఈ విషయాన్ని ముందు చెప్పలేదు. దీంతో క్యాబ్ డ్రైవర్లుగా పనిచేస్తున్న వేల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేశారు. క్షేత్రస్థాయి పరిశీలనలో, క్యాబ్ డ్రైవర్ల పేదరికాన్ని పరిశీలించి సిబ్బంది వారిలో చాలామందిని అర్హులుగా తేల్చారు. దీంతో, వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించుకున్నారు.
వారికి ఇందిరమ్మ ఇంటి ఆర్థిక సాయం డబ్బులు చెల్లించేప్పుడు ఆధార్‌కార్డు ఆధారంగా వెరిఫికేషన్‌లో కారు అంశం తెరపైకి వచ్చింది. దీంతో వారికి బిల్లులు చెల్లించలేదు. అర్హత విషయంలో అనుమానాలున్న వారిని ప్రత్యేకంగా ఓ జాబితా రూపొందించి అందులో చేర్చారు. ఈ క్యాబ్‌తో ముడిపడిన వారి పేర్లను కూడా ఆ జాబితాలో చేర్చారు. ఒకసారి అర్హులుగా తేల్చి ఇళ్లను మంజూరు చేసి, బిల్లులు చెల్లించే సమయంలో అనర్హులుగా పేర్కొంటున్నారు. వీరు సంబంధిత ఎమ్మెల్యేలను ఆశ్రయించడంతో.. వారిని అర్హులుగా పరిగణించాలంటూ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు.
స్పష్టత ఇవ్వకపోవటంతో...
నిరుపేదగా ఒక ప్రభుత్వ పథకంలో లబ్ధి పొందిన వారు మరో ప్రభుత్వ పథకంలో లబ్ధికి అర్హులు కాదన్న అంశాన్ని స్పష్టంగా తేల్చి ఉంటే ఈ గందరగోళం ఏర్పడేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వం అమలు చేసిన దళితబంధు కింద లబ్ధి పొందినందున వారి ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉన్నందున, వారికి కాకుండా ఆమాత్రం కూడా ఆసరా లేని నిరుపేదలకే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని స్పష్టం చేసి ఉండాల్సిందని అంటున్నారు.


