మున్సిపల్ ప్రచారం, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ‘ఉపాధి హామీ’నిరసనలు
ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారు
బహిరంగ సభలతో పాటు వీలున్న చోట్ల కార్నర్ మీటింగ్‌లు
ఈ నెల 16, 17, 18 తేదీల్లో తొలి విడత..ఫిబ్రవరి 3 నుంచి మలి విడత
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల పర్య టన ఈ దఫా త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగనుంది. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ప్రచారం, పలుచోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ఉపాధి పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడానికి నిరసనగా సభలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాల వారీగా రెండు దఫా ల పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది.
16 నుంచి షురూ
తొలి విడతలో ఈనెల 16, 17, 18 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలకు వెళ్తారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడంతోపాటు పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తారు. నిర్మల్, మహబూబ్‌నగర్‌లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు హాజరవుతారు. 19వ తేదీన మేడారం వెళ్తారు. అదే రోజు సింగపూర్, అమెరికా దేశాల పర్యటనకు వెళ్తారు. ఫిబ్రవరి 1న హైదరాబాద్ తిరిగి వస్తారు. మరుసటి రోజు వీలును బట్టి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

రెండో విడతలో ఆరు రోజులు
ఫిబ్రవరి 3 నుంచి మలి విడత జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడతారని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు ఖరారైన షెడ్యూల్ ప్రకారం ఆయన ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఆరు రోజుల పాటు ఆరు ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారు. వరుసగా నల్లగొండ, కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు వెళతారు. తొలి దఫా తరహాలోనే వీలును బట్టి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. కార్యకర్తలతో సమావేశాలు, కార్నర్ మీటింగ్‌ల ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఆయా ప్రాంతాల్లో బహిరంగ సభలకు హాజరవుతారు.
ఇక ఉపాధి హామీ పథకం విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభలను విజయవంతం చేసే బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఆయా జిల్లాల మంత్రులు, ఇన్‌చార్జి మంత్రులకు టీపీసీసీ అప్పగించనుంది. కాగా చివరి రోజు, రెండు రోజుల్లో సీఎం వెళ్లే మెదక్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన షెడ్యూల్ ఇంకా పూర్తి స్థాయిలో ఖరారు కావాల్సి ఉంది.


