
వ్యవసాయ వర్సిటీలో రుద్రాక్ష మొక్క నాటుతున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి సురేఖ
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చే బాధ్యత.. గెలిపించే పూచీ నాదే
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల్లోనూ 33% మహిళా రిజర్వేషన్లు
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్
మంత్రి కొండా సురేఖతో కలిసి వనమహోత్సవం ప్రారంభం
ఏజీ వర్సిటీ (హైదరాబాద్): త్వరలోనే నియోజకవర్గాల పునరి్వభజనతో అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 153 అసెంబ్లీ సీట్లకుగాను 50 సీట్లు అంటే 33 శాతం మంది ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు అవుతారని చెప్పారు. 33 శాతం సీట్లకు ఇంకో 10 సీట్లు కలిపి మొత్తం 60 సీట్లను ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు.
మంచిపనులు చేసి పేరు తెచ్చుకొనే మహిళలను గుర్తించి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడమే కాకుండా వారిని గెలిపించే పూచీ కూడా తనదేనన్నారు. సోమవారం హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రుద్రాక్ష మొక్కను నాటడం ద్వారా వనమహోత్సం–2025 కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఇంటింటా రెండేసి మొక్కలు..
తల్లి పేరుతో ఒక మొక్కను నాటాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని.. దీన్ని స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ కోవలోనే రాష్ట్రంలోని తల్లులంతా వారి పిల్లల పేరుతో ఇళ్ల ఆవరణలో రెండేసి మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. మొక్కలను పిల్లల్లాగే సంరక్షిస్తే తెలంగాణ రాష్ట్రమంతా పచ్చదనంతో నిండిపోతుందన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది అటవీ శాఖ ఆధ్వర్యంలో 18 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపడుతుందని.. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు.
ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసం..
ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో జీవించేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఒకప్పుడు సోలార్ పవర్ ప్రాజెక్టులను అదానీ, అంబానీలు మాత్రమే ఏర్పాటు చేసేవారని.. కానీ తాము మూడేసి మెగావాట్ల సౌరవిద్యుత్ ప్రాజెక్టులను మహిళా స్వయం సేవా సంఘాలకు అప్పగిస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను ఆడబిడ్డలకు అప్పగించామని.. ఆర్టిసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాకుండా ఆర్టిసీకి వెయ్యి బస్సులను అద్దెకు ఇచ్చేలా ప్రొత్సహించి వారిని బస్సులకు యజమానులను చేశామని సీఎం వివరించారు. హైటెక్ సిటీలో విప్రొ, మైక్రోసాప్ట్ లాంటి సంస్థలు ఉండేచోట 3.5 ఎకరాల స్థలాన్ని మహిళా స్వయం సేవా సంఘాలకు కేటాయించి వారు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించడానికి వీలు కల్పించామని చెప్పారు. ఈ ఏడాది మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రూ. 21 వేల కోట్ల మేర రుణాలు అందించామని తెలిపారు.
చెట్లు పెంచితేనే సకాలంలో వర్షాలు: మంత్రి కొండా సురేఖ
చెట్లను కాపాడితే అవి మనల్ని కాలుష్యం నుంచి కాపాడతాయని, జీవవైవిధ్యాన్ని రక్షించుకోవడంలో దోహదపడతాయని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. చెట్లను పెంచడం ద్వారానే వర్షాలు సకాలంలో కురుస్తాయని చెప్పారు. వనమహోత్సవం కార్యక్రమంలో 100 శాతం మొక్కలు నాటి వాటిని కాపాడేందుకు రాష్ట్రంలోని ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు.
ఈ సందర్భంగా అటవీశాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను అధికారులు, ప్రజాప్రతినిదులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి కొండా సురేఖ తిలకించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, కాలె యాదయ్య, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్, కమిషనర్ కర్ణన్, జిల్లా ఆదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, వీసీలు జానయ్య, రాజిరెడ్డి, ఉన్నతాదికారులు పాల్గొన్నారు.