
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జలాల విషయంలో రాజీ పడమంటూ సీఎం రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారు. ప్రజాభవన్‌లో మంగళవారం.. గోదావరి-బనకచర్లపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నీటి హక్కుల కోసం పోరాడుతూనే ఉంటామన్నారు. కృష్ణాలో 68 శాతం పరీవాహకం తెలంగాణలో ఉంది. 68 శాతం తెలంగాణకు ఇచ్చి.. మిగిలిన నీళ్లే ఏపీకి ఇవ్వాలి. కానీ 299 టీఎంసీలే చాలని రెండుసార్లు కేసీఆర్ సంతకం పెట్టారు. 299 టీఎంసీలున్నా 220కి మించి ఎప్పుడూ వినియోగించలేదు’’ అని రేవంత్ చెప్పుకొచ్చారు.
‘‘ధన దాహం తీర్చుకోవడం కోసమే కాళేశ్వరం రీ డిజైన్. 38 వేల కోట్ల ప్రాజెక్టుకు ఇప్పటికే లక్ష కోట్లు ఖర్చు పెట్టారు. లక్ష కోట్లు ఖర్చు చేసి 50 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లిచ్చారు. మిగిలిన పనుల పూర్తికి మరో లక్ష కోట్లు కావాలి. వరద జలాలను తరలిస్తే ఇబ్బందేంటని ఏపీ వాదిస్తోంది. నికర జలాల్లో మా వాటాపై ఏపీ ఎందుకు అభ్యంతరం చెప్తోంది. మూడో పంట కోసం ఏపీ ప్రయత్నిస్తోంది. మాకు మొదటి పంటకే నీళ్లు లేవు. మా నీటివాటాలపై ఏపీ కూడా సహకరించాలి కదా?. ఇరు రాష్ట్రాల చర్చలకు కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలి’ అంటూ రేవంత్‌రెడ్డి కోరారు.