ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం ఇవ్వడంతో సీఎంకు జ్ఞాపికను అందజేస్తున్న నిర్వాసిత మహిళలు, చిత్రంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి
ఆ తర్వాతే ఏపీ ప్రాజెక్టులపై ఆ రాష్ట్రంతో చర్చ.. లేకుంటే చర్చించే సమస్యే లేదు
పక్క రాష్ట్రంతో చర్చలు జరుగుతున్నాయి.. త్వరలో మంచి వార్త వినిపించబోతున్నా
ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టుల పరిశీలన సందర్భంగా విలేకరులతో సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘పక్క రాష్ట్రం (ఏపీ)తో చర్చలు జరుగుతున్నాయి. తొందర్లోనే వాటిని (జల వివాదాలను) పరిష్కరించుకుంటాం. మీకు తొందర్లోనే మంచి వార్త వినపించబోతున్నా. ముందు మాకు పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు నూటికి నూరు శాతం నికర జలాలను ఇస్తే సముద్రంలో పోయే నీళ్ల గురించి ఏపీతో మాట్లాడతాం. కృష్ణా జలాల పంపిణీ అంశం బచావత్ ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉంది. తెలంగాణకు 299 టీఎంసీల కృష్ణా జలాలు చాలు.. మీరు (ఏపీ) 512 టీఎంసీలు తీసుకెళ్లండని కేసీఆర్ సంతకాలు చేసి కృష్ణా పరీవాహక ప్రాంతానికి శాశ్వతంగా మరణశాసనం రాసిండు.
ఆ మరణశాసనాన్ని తిరగరాయడం చెప్పలేనంత సంక్లిష్టంగా ఉంది. అందుకే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీలు, డిండి ప్రాజెక్టుకు 20 టీఎంసీల నికర జలాల కేటాయింపులకు అంగీకరిస్తూ ఏపీ నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) ఇస్తేనే ఏపీ ప్రాజెక్టులపై చర్చిస్తాం. లేకపోతే చర్చించే సమస్యే లేదు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ శుక్రవారం కరివేన రిజర్వాయర్ వద్ద నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
నికర జలాల్లో ఒక చుక్కకూ రాజీపడం...
‘గోదావరిలో తెలంగాణకు ఉన్న 968 టీఎంసీల నికర జలాల్లో ఒక చుక్కకే రాజీపడం. వ్యూహాత్మక ఎత్తుగడలతో ప్రతి చుక్క నీటి హక్కునూ కాపాడే బాధ్యత నేను, మంత్రి ఉత్తమ్ తీసుకుంటాం. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్‌వోసీ ఇస్తేనే పోలవరం–బనకచర్ల/నల్లమల్లసాగర్ ప్రాజెక్టుపై మాట్లాడటానికి ఉంటుందని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శితో ఏపీకి చెప్పించాం. పాలమూరుకు 90 టీఎంసీల కేటాయింపులను సైతం తీసుకొస్తాం.
డిసెంబర్‌లోగా చర్చల ద్వారా జిల్లాకు సంబంధించి కృష్ణా జలాల విషయంలో మెజారిటీ సమస్యలు పరిష్కరిస్తాం. ప్రాజెక్టులు కట్టుకొని మనం 968 టీఎంసీలను వాడుకున్న తర్వాతే సముద్రంలో పోయే నీళ్ల లెక్క తేలుతుంది. 968 టీఎంసీలను మనం భద్రం చేసుకొని మిగిలిన దాని (వరద జలాలు) గురించి మళ్లీ చర్చ చేస్తాం. గోదావరిలో ఏపీకి ఉన్న 516 టీఎంసీలను వాళ్లు ఎక్కడ వాడుకుంటారో వారిష్టం. అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
కమీషన్ల కోసమే లిఫ్టులు, పంపులు...
‘కేసీఆర్ పదేళ్ల పాలనలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై రూ. 27 వేల కోట్ల ఖర్చు చేసిండు. అందులో అధిక భాగం పంపులు, లిఫ్టులకే ఇచ్చి రూ. వేల కోట్ల కమీషన్లు కొల్లగొట్టి ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వకుండా ఎక్కడికక్కడ వదిలేసిపోయిండు. వాళ్లలాగా కమీషన్లు, కాంట్రాక్టుల కోసం పనిచేసే వాడిని కాదు. 20 ఏళ్లలో జెడ్పీటీసీ సభ్యుడి నుంచి సీఎం వరకు జిల్లాలో రూ. వేల కోట్ల పనులు జరిగినా ఒక్క రోజైనా నాపై చిన్న ఆరోపణ అయినా వచ్చిందా?’ అని రేవంత్ ప్రశ్నించారు.
పంచె కట్టుకున్నోళ్లంతా రాజశేఖరరెడ్డి కాదు..
‘పాలమూరు’ ప్రాజెక్టును కొలిక్కి తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తుంటే రాజకీయ కార్యాచరణ తీసుకుంటాం అని వారు (బీఆర్‌ఎస్) బయలుదేరారు. ఒకాయన పంచె కట్టుకొని రాజశేఖరరెడ్డి అనుకుంటడు. పంచె కట్టుకున్నోళ్లంతా రాజ శేఖరరెడ్డి అయితే బానే ఉండే. ఇంటి పేరు మార్చుకున్నడు ఇంకొకాయన. ప్రజలు చీదరించుకుంటారనే సోయి కూడా లేకుండా మా గురించి మాట్లాడి జిల్లాకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు’ అని రేవంత్ విమర్శించారు.
జూన్‌కల్లా పాలమూరు రిజర్వాయర్లు, ట్రంక్ కాల్వలు..
‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైపోయింది. ప్రాజెక్టులకు అప్పులు తెచ్చుకోలేని పరిస్థితి ఉంది. తక్కువ భూసేకరణతో ఎక్కువ నిల్వ చేసుకునే అవకాశం ఉన్న పనులన్నీ పూర్తి చేసుకుంటాం. పాలమూరు రిజర్వాయర్లు, ట్రంక్ కాల్వలను జూన్ వరకు పూర్తి చేస్తాం. బ్రాంచి కాల్వలు, మిగతా పనులకు ఆ తర్వాత టెండర్లు. పంపులు, లిఫ్టులు, కాల్వలు, రిజర్వాయర్లను 2027 జూన్‌లోగా పూర్తి చేసి ఉదాండాపూర్ వరకు నీళ్లను తరలిస్తాం. లక్ష్మీదేవిపల్లికి నీళ్లు ఎలా తీసుకెళ్లాలి? డిస్ట్రిబ్యూటరీ కాల్వలను ఎలా చేయాలో 6 నెలల తర్వాత సమీక్షిస్తాం’ అని సీఎం తెలిపారు.
కర్ణాటక సరిహద్దులో బరాజ్‌లు
‘కృష్ణా, భీమా నదులపై కర్ణాటక చిన్న బ్రిడ్జీ కమ్ బరాజ్‌లు కట్టి దాదాపు 100 టీఎంసీలు నిల్వ చేసుకుంటోంది. తెలంగాణ–కర్ణాటక సరిహద్దులో బ్రిడ్జి కమ్ బరాజ్‌లు కట్టుకుంటే నిల్వతోపాటు భూగర్భ జలాలూ పెరుగుతాయి. కర్ణాటక కాంగ్రెస్ సీఎంతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని చెరి సగం ఖర్చు భరించేలా 60–70 శాతం నీళ్లు మనం వాడుకునేలా కార్యాచరణ తీసుకున్నం’ అని సీఎం రేవంత్ చెప్పారు.

మోదీనే దిగిపోమనండి..
‘ప్రధాని మోదీ 12 ఏళ్లలో ఏం వెలగబెట్టిండో అర్వింద్, బండి సంజయ్ చెప్పాలి? ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, ఒక్కో పేదోడి ఖాతాలో రూ. 15 లక్షలు వేశాడా? రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసిండా? అందుకే తక్షణమే మోదీని గద్దెదిగమనండి. రాహుల్ గాంధీని ఆ కుర్చీలో కూర్చోబెట్టి ఇవన్నీ నెరవేరేలా చేయిస్తా. పాలమూరు–రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటింప చేయిస్తా. రాష్ట్రంలో పండించిన ప్రతి గింజా కేంద్రంతో కొనిపిస్తా. ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలో చూపిస్తాం’ అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.
ఆర్నెల్లలో సమస్యలన్నీ పరిష్కారం: మంత్రి ఉత్తమ్
ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, పునరావాసం, పునర్నివాసం సమస్యలతోపాటు పర్యావరణ, అటవీ అనుమతులను వచ్చే 6 నెలల్లో పరిష్కరిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. సీఎం రేవంత్‌తో కలిసి కరివేన రిజర్వాయర్ వద్ద విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూరాల ఆయకట్టుకు ప్రత్యామ్నాయ నీటి సరఫరా కోసం గూడెందొడ్డి, భూత్‌పూర్ జలాశయాల సామర్థ్యం పెంచడంతోపాటు భీమా, కృష్ణా నదులపై కొత్తగా బ్రిడ్జి కమ్ బరాజ్‌లను నిర్మించనున్నట్లు చెప్పారు.
గత ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సోర్సును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. గత సర్కారు ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో రూ. 1.81 లక్షల కోట్ల అప్పులు చేసి ఎలాంటి సాగునీటి ప్రయోజనాలు కల్పించలేకపోయిందని ఉత్తమ్ విమర్శించారు. కృష్ణా జలాల్లో హక్కుల కోసం కృష్ణా ట్రిబ్యునల్, సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపిస్తున్నామని తెలిపారు. తమ పాలన పూర్తయ్యేలోగా లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సృష్టిస్తామన్నారు.


