రైతును రాజును చేద్దాం: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Comments On Farmers | Sakshi
Sakshi News home page

రైతును రాజును చేద్దాం: సీఎం రేవంత్‌

Oct 20 2025 12:58 AM | Updated on Oct 20 2025 12:58 AM

CM Revanth Reddy Comments On Farmers

ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఓ సర్వేయర్‌కు లైసెన్స్‌ పత్రం అందిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

అన్నదాతకు అన్యాయం చేస్తే మీ కుటుంబానికి చేసినట్టే..

లైసెన్స్‌డ్‌ సర్వేయర్లతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

సర్వేయర్ల భుజస్కంధాలపై ప్రభుత్వ బాధ్యతలు

ప్రజలకు భూమి కన్నతల్లిలాంటిది.. 

మీరు తప్పులు చేస్తే ప్రజలు ప్రభుత్వంపై తిరగబడతారు 

భూమిపై ఆధిపత్యానికి ప్రయత్నించిన వారిని ఇంటికి పంపారు 

కొత్తగా ఎంపికైన సర్వేయర్లకు లైసెన్స్‌ పత్రాల అందజేత

సాక్షి, హైదరాబాద్‌: రైతుకు అన్యాయం చేస్తే సొంత కుటుంబానికి అన్యాయం చేసినట్టేనని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేసి భూమి సమస్యలను పరిష్కరించాలని, రైతాంగానికి అండగా నిలబడాలని సూచించారు. రాష్ట్రంలో కొత్తగా నియమితులైన లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు ఆదివారం శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో ఆయన లైసెన్స్‌ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగినా, జల్‌ జంగిల్‌ జమీన్‌ నినాదంతో కొమురం భీమ్‌ పోరాడినా, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భాగంగా నల్లగొండ, వరంగల్‌ జిల్లాల్లో ఎర్ర జెండా ఎగిరినా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసమే జరిగాయి. 

కన్నతల్లిపై ఎంత మమకారం ఉంటుందో, తెలంగాణలో భూమిపై కూడా అదే అనుబంధాన్ని చూపిస్తారు. భూమిపై ఆధిపత్యం చెలాయించాలని చూసినప్పుడు దళితులు, గిరిజనులు, ఆదివాసీలైనా, నిరుపేద నిరక్షరాస్యులైనా నిటారుగా నిలబడి కొట్లాడిన చరిత్ర తెలంగాణ గడ్డకు ఉంది. విసునూరు దొరలు చెరబట్టాలనుకున్న ఎకరం భూమి కోసం వీరనారిగా మారిన చాకలి ఐలమ్మ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారు. భూ యజమానుల హక్కులు, ఆ భూముల సరిహద్దులను నిర్ణయించే అధికారం సర్వేయర్ల చేతుల్లో ప్రభుత్వం పెట్టబోతోంది. ఈ క్రమంలో తప్పులకు తావిస్తే ప్రజలు సర్వేయర్లతోపాటు ప్రభుత్వంపై కూడా తిరగబడే అవకాశం ఉంది’అని తెలిపారు.  

బంగాళాఖాతంలో విసిరేశారు 
గత ప్రభుత్వ హయాంలో ధరణి అనే చట్టం కొద్ది మంది దొరలకు చుట్టంగా మారిందని సీఎం రేవంత్‌ ఆరోపించారు. ‘ఈ ధరణి దరిద్రంతోనే ఒక ఎమ్మార్వోను పెట్రోల్‌ పోసి తగలబెట్టే పరిస్థితులు వచ్చాయి. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో జంట హత్యలకు కారణమైంది కూడా ఈ చట్టమే. ధరణి చట్టాన్ని అడ్డుపెట్టుకుని భూమి మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్న దొరలకు ప్రజలు గత ఎన్నికల్లో గుణపాఠం చెప్పి బంగాళాఖాతంలో విసిరేశారు. ఆ భూ దోపిడీ నుంచి విముక్తి కోసమే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి అధికారం ఇచ్చారు. 

మేం అధికారంలోకి వచ్చాక భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం తీసుకొచ్చాం. ఇప్పుడు 1.60 కోట్ల ఎకరాల వ్యవసాయ యోగ్య భూమి తెలంగాణ రైతాంగం దగ్గర ఉంది. భూ సమస్యలను పరిష్కరించేందుకు, రైతుకు అండగా ఉండేందుకే లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల వ్యవస్థను తీసుకొచ్చాం’అని సీఎం తెలిపారు. త్వరలోనే గ్రూప్‌–3, 4 ఉద్యోగాలు భర్తీ చేస్తామని, 11 వేల మందికి నియామక పత్రాలు అందించబోతున్నామని వెల్లడించారు.  

మా సైన్యం మీరే.. 
తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన, ఆదర్శ రాష్ట్రంగా దేశంలో మొదటి స్థానంలో నిలబట్టేందుకు తమ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్‌ –2047 విజన్‌ డాక్యుమెంట్‌ను తీసుకొస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉండాలో అందరూ సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. తమ ప్రభుత్వం ఏ చట్టం చేసినా ప్రజలను భాగస్వాములను చేస్తుందని, సమస్యలను తెలిసిన వారిని పరిష్కారం అడగడం ద్వారా నిజమైన అభివృద్ధికి బాటలు వేస్తుందని చెప్పారు. ‘తెలంగాణ రాష్ట్రాన్ని 2034 నాటికి 1 ట్రిలియన్‌ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. 

ఆ లక్ష్యం నెరవేరడంలో మీ సహకారం కావాలి. రైతుల సమస్యలు పరిష్కారం కావాలి. వ్యవసాయం దండుగ కాదు పండుగ చేయాలి. రైతు రాజు కావాలంటే మీరు కష్టపడి పనిచేయాలి. మీ శ్రమకు ఫీజు తీసుకోండి. కానీ రైతులకు అన్యాయం చేయొద్దు. క్షలాది మంది రైతుల సమస్యలను పరిష్కరించే బాధ్యతలను తీసుకుని మీరు వెళుతున్నారు. మాకెవరూ ప్రతినిధులు లేరు. మాకు సైన్యం లేదు. మీరే మా ప్రతినిధులు, మా సైనికులు మీరే. ప్రభుత్వ ఆలోచనలు, బాధ్యతలను మీ భుజస్కందాలపై పెట్టి పంపుతున్నాం. తెలంగాణ పునర్‌నిర్మాణం చేసేది మీరే’అని సర్వేయర్లకు సీఎం రేవంత్‌ తెలిపారు. 

కార్యక్రమంలో కొత్త లైసెన్స్‌డ్‌ సర్వేయర్లతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. ధరణిని బంగాళాఖాతంలో వేసి, ప్రజలు మెచ్చే భూభారతి చట్టం తీసుకొచ్చామని తెలిపారు. తెలంగాణ రైతాంగానికి లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల రూపంలో ప్రభుత్వం దీపావళి కానుక అందించిందని చెప్పారు. 3,456 మందికి సర్వే లైసెన్స్‌లు మంజూరు చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మందుల సామేల్, టి. రామ్మోహన్‌రెడ్డి, కె.ఆర్‌. నాగరాజు, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మీ, టీజీఐఐసీ చైర్మన్‌ టి.నిర్మలా జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement