
రేవంత్‌రెడ్డి ‘క్వాంటం ఏఐ’ వెబ్‌సైట్‌ను ప్రమోట్ చేస్తున్నట్టుగా వీడియో సృష్టి
అది ఫేక్ వీడియో అని నిర్ధారించిన ఫ్యాక్ట్‌చెక్ తెలంగాణ
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
సాక్షి, హైదరాబాద్: రూ.21,000 పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు రూ.2 లక్షలు సంపాదిస్తారు. మీరు దీన్ని నమ్మి పెట్టుబడి పెట్టండి ’ అని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నట్టుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీలో ఒక న్యూస్ చానల్‌కు రేవంత్‌రెడ్డి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను వినియోగించి ఏఐతో ఒక డీప్‌ఫేక్ వీడియోను సృష్టించారు సైబర్ నేరగాళ్లు.
రేవంత్ రెడ్డి క్వాంటం ఏఐ అనే వెబ్‌సైట్‌ను ప్రమోట్ చేస్తున్నట్లుగా కనిపించే నకిలీ ఏఐ–జనరేటెడ్ వీడియోను నమ్మవద్దని సీఎం కార్యాలయ అధికారులు సూచించారు. ఈ మేరకు గురువారం ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు. ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ సైతం ఈ వీడియో డీప్‌ఫేక్ అని, దాని నమ్మి మోసపోవద్దని సూచించింది. రేవంత్ రెడ్డి ఎప్పుడూ అలాంటి ప్రకటన చేయలేదు. అసలు క్వాంటం ఏఐని భారత ప్రభుత్వం ప్రారంభించలేదని, ప్రముఖుల వీడియోలను నకిలీవి సృష్టించి మోసాలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. ఇలాంటి వీడియోల నుంచి సురక్షితంగా ఉండాలని సూచించారు.
ఇలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని ఊదరగొట్టే ప్రకటనలు నమ్మవద్దని, అటువంటి వెబ్‌సైట్‌లలో వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ సమాచారాన్ని ఎప్పుడూ షేర్ చేయవద్దని సూచించారు. ప్రభుత్వం పెట్టే ఏవైనా ఆర్థిక పథకాలను గురించి ధృవీకరించడానికి అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను మాత్రమే ఉపయోగించాలని పేర్కొన్నారు. ఇలాంటి మోసాలను గుర్తిస్తే వెంటనే http://cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.