సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
డిసెంబర్ 9న ‘తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్–2047’విడుదల
దేశ ఎకానమీలో తెలంగాణ వాటా 10 శాతంగా చేయడమే మా లక్ష్యం
వచ్చే ఏడాది హైదరాబాద్‌లో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులకు ప్రణాళికలు
అర్బన్ డెవలప్‌మెంట్ రీజినల్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పట్టణాభివృద్ధి, మౌలిక వస తుల కల్పనలో తెలంగాణ.. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని నగరాలతో కాకుండా సింగపూర్, టోక్యో, న్యూయార్క్ వంటి నగరాలతో పోటీ పడుతుందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి నగరాలతో పోటీ పడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం సహకరించాలని కోరారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రుల ప్రాంతీయ సమావేశంలో సీఎం రేవంత్ మాట్లా డారు. కేంద్ర పట్టణాభివృద్ధి, భవనాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఐటీ మంత్రి డి.శ్రీధర్‌బాబు, ఏపీ నుంచి మంత్రి నారాయణ, గుజరాత్ మంత్రి కనుభాయ్ మోహన్‌లాల్ దేశాయ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
‘భారతదేశాన్ని ‘వికసిత్ భారత్ 2047’లక్ష్యానికి అనుగుణంగా 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశగా ప్రధాని నరేంద్రమోదీ పనిచేస్తున్నారు. అదే కోవలో హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికతో ముందుకు సాగుతున్న తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన అనుమతులు వేగంగా జారీ చేయాలి. మెట్రో రైలు మార్గ విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్‌కు గోదా వరి జలాల తరలింపు, మూసీ ప్రక్షాళనతోపాటు వివిధ అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలి’అని రేవంత్ విజ్ఞప్తి చేశారు.
3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా..: ‘ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 9న ‘తెలంగాణ రైజింగ్–2047’విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటా పది శాతం ఉండేలా మా ప్రయత్నాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నగర అభివృద్ధితోపాటు భారత్ ఫ్యూచర్ సిటీని కూడా మా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. రాష్ట్రంలో డ్రై పోర్టు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాం. వచ్చే ఏడాది హైదరాబాద్‌లో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశ పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’అని సీఎం రేవంత్ వెల్లడించారు.
పట్టణాలు వికసిత్ భారత్ ప్రతిబింబాలు : మనోహర్‌లాల్ ఖట్టర్
దేశంలోని పట్టణాలు వికసిత్ భారత్ ప్రతిబింబాలు అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ పేర్కొన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ (అర్బన్)లో అంతర్భాగమైన డంప్‌సైట్ రిమిడియేషన్ యాక్సిలేటర్ ప్రోగ్రామ్ (డీఆర్‌ఏపీ)లో 100 శాతం పారిశుధ్యాన్ని సాధించేలా మంత్రులు, ఉన్నతాధికారులు పనిచేయాలని సూచించారు. డీఆర్‌ఏపీ కింద చేపట్టిన 214 డంప్‌సైట్లను పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతర పర్యవేక్షణ జరగాలన్నారు.
అటల్ మిషన్ ఫర్ రీజ్యూవినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్) కింద నీటి సరఫరా, నీటి పునర్వినియోగం, వర్షపు నీటి సేకరణ వంటి అంశాలపై చర్చ జరగాలని మంత్రి ఖట్టర్ సూచించారు. అమృత్ 2.0 కింద గుజరాత్, తెలంగాణ, గోవా రాష్ట్రాల్లోని పట్టణాలలో వచ్చే మూడేళ్లలో తాగునీటి సరఫరా సాధించేలా చూస్తామని ప్రకటించాయి. మహారాష్ట్ర, డమన్‌లోని పట్టణాలు 90 శాతం పైగా నీటి సరఫరా లక్ష్యాన్ని సాధిస్తామని ప్రకటించాయి. నీటి పునర్వియోగం, నీటి శుద్ధికి సంబంధించిన అంశాలపైనా ఈ సమావేశం చర్చించింది.
అమృత్ రెండో దశ కింద మహారాష్ట్ర రోజుకు 3వేల మిలియన్ లీటర్లు శుద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 2030 నాటికి కనీసం 40 శాతం మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగం తేవాలనే లక్ష్యంగా పెట్టుకుంటున్నట్టు గుజరాత్ ప్రకటించింది. ఈ సమావేశంలో ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) కింద గృహ నిర్మాణ పురోగతిపై కూడా చర్చించారు. తెలంగాణ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఈ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వగా, రెండు సెషన్లుగా సమావేశం జరిగింది. మొదటి సెషన్‌లో ‘తెలంగాణ రైజింగ్ 2044’, రెండవ సెషన్‌లో కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి పథకాలు, వాటి అమల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పురోగతిపై సమీక్షించారు.


