
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎన్నికల కార్యాచరణపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. హ్యాట్రిక్ విజయం లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. రాష్ట్ర శాసనసభకు ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్‌లో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండటంతో ప్రభుత్వ పథకాల అమలులో వేగం పెంచుతున్నారు. కరోనా, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఇప్పటివరకు అమలు చేయని పలు పథకాలను యుద్ధ ప్రాతిపదికన ప్రజలకు అందజేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ స్థితిగతులపై నిశిత పరిశీలనతో ఖరారు చేసుకున్న వ్యూహాలను ఒకటొకటిగా అమలు చేస్తున్నారు. తద్వారా ప్రధాన విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఎత్తుగడలకు చెక్ పెట్టాలని, రాబోయే ఎన్నికల్లో పూర్తిస్థాయిలో లబ్ధి పొందాలనే ఆలోచనలో ఉన్నారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న అంశాలతో పాటు విపక్షాలు ఎన్నికల అస్త్రాలుగా ప్రయోగించేందుకు అవకాశమున్న సమస్యలపై వెంటనే స్పందిస్తూ కీలక ప్రకటనలు చేస్తున్నారు. వారిని పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు ప్రకటించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మార్చి నుంచే ఎలక్షన్ మోడ్
కేసీఆర్ ఈ ఏడాది మార్చి నుంచే పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికల దిశగా సన్నద్ధం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావుతో పాటు ఇతర మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ వంటి సుమారు డజను మంది కీలక నేతలకు ఐదారు అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున సమన్వయ బాధ్యతలు అప్పగించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అంచనా వేస్తూ, అనుసరించాల్సిన కార్యాచరణపై నిత్యం దిశా నిర్దేశం చేస్తున్నారు.
పెండింగ్ అంశాలపై స్పీడ్‌గా..
తాజాగా దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న అంశాలతో పాటు విపక్షాలు ఎన్నికల అస్త్రాలుగా ప్రయోగించేందుకు అవకాశమున్న సమస్యలపై సీఎం శరవేగంగా స్పందిస్తున్నారు. రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, హైదరాబాద్ నగర అభివృద్ధి లక్ష్యంగా కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రకటించిన రైతు రుణమాఫీని మాస్టర్ స్ట్రోక్‌గా బీఆర్‌ఎస్ నేతలు అభివర్ణిస్తున్నారు. సీఎం నిర్ణయంతో విపక్షాలకు గొంతు లేకుండా పోయిందని వారంటున్నారు.
ఇక వికలాంగుల పింఛను పెంపు, బీసీలు, మైనారిటీలకు రూ.లక్ష చొప్పున ఆర్దిక సాయం, గృహలక్ష్మి పథకంలో వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్, నోటరీ భూముల రిజిస్ట్రేషన్, నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇళ్లు లబ్దిదారులకు పంపిణీ వంటి మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా ఇటీవలి కాలంలోనే తీసుకున్నారు. వీఆర్‌ఏల సర్వీసు క్రమబద్ధీకరణ, ప్రభుత్వలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం వంటి నిర్ణయాలు సైతం తీసుకున్న కేసీఆర్.. త్వరలో ఉద్యోగుల వేతన సవరణ కమిషన్ ఏర్పాటు, మధ్యంతర భృతిపై సంచలన నిర్ణయం ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి.
త్వరలోనే సామాజిక పింఛన్ల పెంపు, హైదరాబాద్‌లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు అంశంపైనా స్పష్టత నివ్వడంపై కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో నిరుద్యోగ భృతి చెల్లింపు అంశం మినహా విపక్షాలకు ఏ ఒక్క ప్రచార అస్త్రం దొరక్కుండా చేయాలన్నదే కేసీఆర్ వ్యూహమని పార్టీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు ఈ ప్రకటనలను ప్రభుత్వానికి, అధికార పార్టీకి అనువుగా మలుచుకునేందుకు క్షేత్ర స్థాయిలో సంబురాలు నిర్వహించాలంటూ పార్టీ ఎమ్మెల్యేలు, కేడర్‌కు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
నిధుల సమీకరణపైనా స్పెషల్ నజర్
రుణమాఫీ, రైతుబంధు చెల్లింపుల్లాంటివి సెప్టెంబర్ మూడో వారంలోగా పూర్తి చేసేందుకు వీలుగా నిధుల సమీకరణపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. రుణాలు, గ్రాంట్ల ద్వారా నిధులు వచ్చే అవకాశం లేకపోవడంతో అంతర్గత ఆదాయాన్ని నిర్దేశిత గడువులోగా రాబట్టాలని ఆర్థిక శాఖకు లక్ష్యం నిర్దేశించారు. నిధుల సేకరణ సమన్వయ బాధ్యతను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సోమేశ్‌కుమార్‌కు అప్పగించినట్లు తెలిసింది.
ఇలా రెగ్యులర్‌గా వచ్చే ఆదాయంతో పాటు మూడు నెలల ముందుగానే మద్యం దుకాణాల వేలం, నోటరీ భూముల రిజిస్ట్రేషన్, హెచ్‌ఎండీఏ పరిధిలో భూముల వేలం వంటివి చేపట్టడం ద్వారా నిధులు సమీకరించేందుకు సిద్ధమయ్యారు. తద్వారా ఎన్నికల సమయంలో ప్రజల్లో వ్యతిరేకత, విపక్షాల విమర్శలు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
టికెట్లు, చేరికలపై కసరత్తు
సొంత సర్వేలు, ప్రభుత్వ నిఘా వర్గాల నివేదికల ఆధారంగా నియోజకవర్గాల వారీగా బీఆర్‌ఎస్‌తో పాటు ఇతర పార్టీల బలాలు, బలహీనతలపై కేసీఆర్ అంచనాకు వచ్చారు. సుమారు 15 శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించడం, గెలుపు గుర్రాల అన్వేషణ, ఇతర పార్టీల నుంచి కీలక నేతలను చేర్చుకోవడం వంటి అంశాలపై తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ఇప్పటికే సుమారు 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరోక్షంగా అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అసంతృప్త నేతలను ఖాళీగా ఉన్న పదవుల్లో సర్దుబాటు చేయడంపైనా కసరత్తు జరుగుతోంది. టికెట్ల రేసులో ఉన్న సుమారు అరడజను మంది ఎస్సీ సామాజికవర్గం నేతలతో త్వరలో ఎస్సీ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసే అవకాశమున్నట్టు చెబుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఓ నేతకు ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి దాదాపు ఖాయమైందని అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వరద నష్టం వంటి అంశాలపై జరిగే చర్చల్లో స్వయంగా సమాధానం ఇవ్వడం ద్వారా విపక్షాల విమర్శలకు చెక్ పెట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.