ఎస్‌పీఎఫ్‌... డీజీపీ పరిధిలోకి వచ్చేనా? 

CM Appealed To Government To Bring SPF Under The Purview Of The DGP - Sakshi

జోన్లు, స్థానికత లేకుండా ఇబ్బంది పడుతున్న ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది

సీఎం హామీ ప్రకారం డీజీపీ పరిధిలోకి తమను తేవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: హోంశాఖ పరిధిలో పనిచేస్తున్నా ఆ విభాగం పోలీస్‌ శాఖకు దూరంగా ఉంటుంది. వాళ్లూ ఆయుధాలతో గస్తీ కాస్తున్నా రాష్ట్ర పోలీస్‌ శాఖ పరిధిలోకి రారు. అంతే కాదు... వాళ్లకు జోన్ల నియామకాలు, జిల్లాలవారీ బదిలీలు ఉండవు. కుటుంబాలకు దూరంగా రాష్ట్ర రాజధానితో పాటు దేవాలయాలు, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, రిజర్వ్‌ బ్యాంక్‌ తదితర కీలక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాలకు ఆయుధాలతో భద్రత కల్పిస్తారు. అయితే ఇప్పుడు ఆ విభాగాన్ని డీజీపీ పరిధిలోకి తేవాలని డిమాండ్‌ వ్యక్తమవుతోంది.  

స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌..  
స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఎస్‌పీఎఫ్‌) విభాగం పోలీస్‌ శాఖకు సంబంధం లేకుండా ఓ అదనపు డీజీపీ నేతృత్వంలో కార్యాలయాల భద్రతను పర్యవేక్షిస్తుంది. సుమారు 2 వేల మంది సిబ్బంది ఉన్న ఈ విభాగంలో నియామకాలు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ నుంచే జరిగినా అవి జిల్లా, రేంజ్‌లు కాకుండా స్టేట్‌ కేడర్‌ (రాష్ట్ర స్థాయి) పోస్టుగా పరిగణనలోకి వస్తుంది. దీంతో ఏ జిల్లా నుంచి సెలక్ట్‌ అయినా రాష్ట్ర స్థాయిలో ఎక్కడకు పోస్టింగ్‌ వేస్తే అక్కడికి వెళ్లాల్సిందే. 

డీజీపీ పరిధిలోకి తీసుకురావాలని... 
నూతన జిల్లాలు, రేంజ్‌లు, జోన్ల ఏర్పాటు జరిగినా ఈ విభాగానికి అవి వర్తించే అవకాశాలు కనిపించడంలేదు. అయితే సిబ్బంది మాత్రం 2014లో సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో డీజీపీ పరిధిలోకి తెచ్చేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. కొత్త జోన్ల నిబంధనలు ఎస్‌పీఎఫ్‌లో అమలుకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం (హోంశాఖ) చర్యలు చేపట్టలేదు. కొత్త జోన్ల అమలు వల్ల సిబ్బంది తమ సొంత జిల్లాల్లో విధులు నిర్వర్తించే అవకాశం లభిస్తుంది.

దానివల్ల మానసిక ఆందోళనలు తొలగడంతోపాటు వారి పిల్లల స్థానికత సమస్య కూడా తీరుతుందని భావించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఇకపై రాష్ట్ర స్థాయి నియామకాలు ఉండవని ఉత్తర్వుల్లో ఉన్నా తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ విషయంలో మాత్రం అధికారులు దీనిపై క్లారిటీ ఇవ్వడంలేదని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే డీజీపీ పరిధిలోకి ఈ విభాగాన్ని తేవడం వల్ల సిబ్బందితోపాటు వారి తల్లిదండ్రులకు మెరుగైన వైద్య సౌకర్యం అందేలా ఆరోగ్య భద్రత, లోన్లు కూడా అందే అవకాశం ఉంది.

అదేవిధంగా పోలీస్‌ శాఖ కోటాలో సిబ్బంది పిల్లలకు రిజర్వేషన్‌ వర్తిస్తుంది. ఇతర శాఖల్లో డెప్యుటేషన్‌పై పనిచేసే సౌలభ్యం దొరుకుతుంది. జోన్ల ప్రకారం కేడర్‌ విభజన జరిగితే సిబ్బంది పిల్లలు వారి సొంత స్థానికతను పొందిన వారవుతారని ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది వేడుకుంటున్నారు.  

మెడపై కత్తిలా కేంద్ర బలగాల డిప్యూటేషన్‌... 
ప్రాజెక్టులు, కీలకమైన కార్యాలయాలు, భవనాల భద్రతను పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బలగాలను ఎస్‌పీఎఫ్‌ పరిధిలోకి శాశ్వత డెప్యుటేషన్‌పై తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీనివల్ల ఆ విభాగంలోని సిబ్బంది పదోన్నతులతోపాటు నిరుద్యోగులకు సైతం తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర బలగాల నుంచి వచ్చే సిబ్బందిని వారివారి నియామక తేదీలను బట్టి సీనియారిటీ ఖరారు చేసి రాష్ట్ర కేడర్‌లోనే ప్రమోషన్లు కల్పించాల్సి ఉంటుంది. ఇది అధికారులతోపాటు సిబ్బంది మెడపై కత్తిలా వేలాడే ప్రమాదముంటుందనే చర్చ జరుగుతోంది. అందుకే రాష్ట్రస్థాయి నియామకాలైన పోలీస్‌ కమ్యూనికేషన్, జైళ్ల శాఖల్లాగానే తమకూ రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేసేలా చూడాలని సిబ్బంది ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top