లైసెన్స్ రెన్యువల్ చేసుకోకుండానే డాక్యుమెంటేషన్ చేస్తున్న వందలమంది నోటరీలు
క్రియాశీలంగా లేని వారి తొలగింపు..త్వరలోనే కొత్త నోటరీల నియామకం
ఏ జిల్లాకు ఎంత మంది అవసరమనే దానిపై రిజిస్ట్రార్ల నుంచి సమాచార సేకరణ
స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖలో వడివడిగా సాగుతున్న ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: నోటరీ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం నోటరీలుగా ఉన్న వారిలో కొందరిని తొలగించడంతోపాటు త్వరలోనే అర్హులైన మరికొందరిని నోటరీలుగా నియమించనుంది. ప్రజల దైనందిన జీవితాల్లో కీలక డాక్యుమెంట్లకు చట్టబద్ధత కల్పించే ఈ నోటరీ వ్యవస్థపై ఫిర్యాదులు పెరుగుతుండడంతో పారదర్శకతకు చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో నోటరీ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన స్టాంపుల శాఖ వడివడిగా ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళుతోంది.
కోవిడ్ సమయం నుంచే..
రాష్ట్రంలో ప్రస్తుతం 2,150 మందికి పైగా నోటరీలు ఉన్నారు. వీరంతా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, చిరునామా మార్పు, తప్పొప్పులను సరిచేయడం లాంటి వాటి కోసం అ«దీకృత ప్రమాణ పత్రాలు (అఫిడవిట్) ఇస్తుంటారు. కొన్ని సర్టిఫికెట్ల కోసం డిక్లరేషన్‌లు కూడా నోటరైజ్ చేస్తారు. వీటితోపాటు ఆస్తుల హక్కుల మారి్పడి పత్రాలను కూడా కొందరు నోటరైజ్ చేస్తున్నారు.
ఈ నోటరైజ్డ్ డాక్యుమెంట్ల ఆధారంగా స్థానిక సంస్థల నుంచి ఇంటి నంబర్లు తెచ్చుకొని చాలామంది నేరుగా రిజి్రస్టేషన్ చేసుకుంటున్నారు. దీంతో హక్కుల మార్పిడి ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. డిక్లరేషన్‌లు ఇచ్చే సందర్భంలో అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. కొందరయితే ఏకంగా తమ లైసెన్స్ కాలపరిమితి ముగిసిన తర్వాత మళ్లీ ప్రభుత్వం వద్ద రెన్యువల్ చేయించుకోకుండానే డాక్యుమెంట్లను నోటరైజ్ చేస్తున్నారు.
తద్వారా వారు చేసే డాక్యుమెంట్లకు ఎలాంటి చట్టబద్ధత ఉండకపోయినా ప్రజలు మోసపోతున్నారు. కరోనా సమయం నుంచి చాలామంది నోటరీలు క్రియాశీలంగా లేరని, ప్రస్తుతమున్న వారిలో 800 మంది వరకు సరిగా డాక్యుమెంట్లు చేయడం లేదని, మరికొందరైతే అసలు రెన్యువల్ కూడా చేసుకోవడం లేదని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో నోటరీ వ్యవస్థను చక్కదిద్దే చర్యలకు ప్రభుత్వం పూనుకుంది. అందులో భాగంగానే రాష్ట్రంలోని నోటరీలందరి వివరాలను ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తోంది.
ఏ జిల్లాలోని ఏ మండలం, ఏ గ్రామం, ఏ ప్రాంత పరిధిలో నోటరీగా ఎవరు పనిచేస్తున్నారు? వారి ఫోన్ నంబర్లతో సహా వివరాలను స్టాంపుల శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచే ప్రక్రియ జరుగుతోంది. దీనికి తోడు క్రియాశీలంగా లేని వారు, లైసెన్స్ రెన్యువల్ చేసుకోని వారిని గుర్తించి తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కొత్తగా నోటరీలుగా ఎంతమంది అవసరమవుతారనే అంచనాలను పంపాలని జిల్లా రిజి్రస్టార్ల ద్వారా సమాచారాన్ని తీసుకుంటోంది. వీలైనంత త్వరలో కొత్త నోటరీల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయనుంది.


