
సాక్షి,హైదరాబాద్: ప్రస్తుతం అంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఈ సోషల్ మీడియా యుగంలో చాలా మంది వివిధ రకాల వీడియోలు, యూట్యూబ్ షార్ట్ వీడియోలు, రీల్స్ చేస్తూ ఫేమస్ అవుతున్నారు. కానీ అదే రీల్స్ పిచ్చి.. యువతకు మాత్రమే కాదు.. పిల్లల ప్రాణాలకు సంకటంగా మారుతోంది. లైకుల కోసం ప్రమాదకర విన్యాసాలు చేస్తూ.. ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా, సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రీల్స్ చేస్తుండగా చిన్నారి మృతి చెందింది.
పోలీసుల వివరాల మేరకు.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం చిట్కులులో చోటు చేసుకుంది. చిట్కులుకు చెందిన సహస్ర నాలుగువ తరగతి చదువుతోంది.
ఈ క్రమంలో కరెంట్ లేని సమయంలో ఫ్యానుకు టవల్ వేలాడదీసి రీల్స్ చేసే ప్రయత్నం చేసింది. సరిగ్గా అదే సమయంలో కరెంట్ రావడంతో సహస్ర మెడకు టవల్ బిగుసుకుని అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి మృతిపై కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. బంగారు భవిష్యత్తున్న సహస్ర అర్ధాంతరంగా తనువు చాలించడంపై చూపురులను కంటతడి పెట్టిస్తోంది.