రైలు బోగీలో ప్రసవం | Childbirth in a train at Basara railway station in Nirmal district | Sakshi
Sakshi News home page

రైలు బోగీలో ప్రసవం

Jun 13 2025 3:35 AM | Updated on Jun 13 2025 3:35 AM

Childbirth in a train at Basara railway station in Nirmal district

మగబిడ్డకు జన్మనిచ్చిన మహారాష్ట్ర మహిళ

నిర్మల్‌ జిల్లా బాసర రైల్వేస్టేషన్‌లో ఘటన 

బాసర: నిర్మల్‌ జిల్లా బాసర రైల్వేస్టేషన్‌లో గురువారం ఆగిన రైలులో ఒక గర్భిణి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. వివరాలివి. మహారాష్ట్రలోని ధర్మబాద్‌ మండలం కర్కెళ్లి గ్రామానికి చెందిన గర్భిణి నాగేశ్వరి వైద్య పరీక్షల నిమిత్తం నిజామాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. గురువారం తిరుగు ప్రయాణంలో నిజామాబాద్‌ నుంచి కాచిగూడ–నాగర్‌సోల్‌ రైలులో ధర్మబాద్‌ బయల్దేరింది. రైలు నిర్మల్‌ జిల్లా బాసర రైల్వేస్టేషన్‌ సమీపంలోకి రాగానే.. ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. 

తోటి ప్రయాణికులు, ఆమె కుటుంబ సభ్యులు అప్రమత్తమై రైల్వేస్టేషన్‌ మేనేజర్‌ రవీందర్‌కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. రైలు బాసర స్టేషన్‌లో ఆగగానే నాగేశ్వరికి నొప్పులు తీవ్రమయ్యాయి. తోటి ప్రయాణికులు సహకరించడంతో.. మగశిశువుకు జన్మనిచ్చింది. ఇంతలో 108 అంబులెన్స్‌ సిబ్బంది రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. తల్లీబిడ్డలను అంబులెన్స్‌లో భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement