పిల్లల అక్రమ రవాణా ముఠా అరెస్టు 

Child trafficking gang arrested - Sakshi

26 మంది పిల్లలను  కాపాడిన మహిళా భద్రత విభాగం 

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎనిమిది మందిని అరెస్టు చేసిన పోలీసులు 

సాక్షి, హైదరాబాద్‌: బాలకార్మికులుగా మార్చేందుకు తరలిస్తున్న పిల్లలను రాష్ట్ర మహిళా భద్రత విభాగం యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌ కాపాడింది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జీఆర్పీ (గవర్నమెంట్‌ రైల్వే పోలీస్‌), ఆర్‌పీఎఫ్, బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌ ఎన్జీఓతో కలసి చేపట్టిన ఈ ఆపరేషన్‌లో మొత్తం 26 మంది చిన్నారులను కాపాడినట్టు రాష్ట్ర మహిళా భద్రత విభాగం అదనపు డీజీ శిఖాగోయల్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌ రాష్ట్రాలకు చెందిన 13 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు పిల్లలను ఈస్ట్‌ కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ నుంచి సికింద్రాబాద్‌కు తరలిస్తున్నట్టు సమాచారం అందడంతో అధికారులు ఆ పిల్లలను రక్షించేందుకు ఆపరేషన్‌ చేపట్టారు. వీరందరినీ హైదరాబాద్‌లోని వివిధ కర్మాగారాల్లో పనిచేయించేందుకు తీసుకువస్తున్నట్టు అధికారులకు తెలిసింది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో మాటు వేసిన పోలీసులు మొత్తం ఎనిమిది మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు.

వీరిపై ఐపీసీ సెక్షన్‌ 374, 341ల కింద సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పట్టుబడిన నిందితులను పశ్చిమ బెంగాల్‌కు చెందిన రంజాన్‌ మోల్లా, షేక్‌ సైదులు, ప్రియారుల్‌షేక్, జాకీర్‌ అలీ, సురోజిత్‌ సంత్రా, జార్ఖండ్‌కు చెందిన పింటుదాస్, హైదరాబాద్‌ చార్మినార్‌కు చెందిన సుసేన్‌ తుడు, అబ్దుల్‌ అల్మాని మోండేల్‌గా గుర్తించారు. కాపాడిన 26 మంది పిల్లలను సైదాబాద్‌లోని ప్రభుత్వ హోమ్‌కు పంపినట్టు అధికారులు తెలిపారు. పిల్లల అక్రమ రవాణా ముఠా సభ్యులను పట్టుకున్న సిబ్బందిని అదనపు డీజీ శిఖాగోయల్‌ అభినందించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top