జర్నలిస్టు ఆత్మహత్యాయత్నం చుట్టూ రాజకీయ రంగు 

Chandrayangutta: Woman Journalist Tried To Kill Herself By Consuming Sleeping Pills - Sakshi

సాక్షి, చాంద్రాయణగుట్ట: చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ మహిళా జర్నలిస్టు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం....అందుకు కారణమైన వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన చుట్టూ రాజకీయ రంగు అలుముకుంది. వృద్ధుడిని పోలీసులు డబీర్‌పురాలో అరెస్టు చేసిన సమయంతో పాటు....పోలీస్‌స్టేషన్‌ నుంచి జైలుకు తరలిస్తున్న సమయంలో భారీ సంఖ్యలో మజ్లిస్‌ కార్యకర్తలు వెంబడిస్తూ అతనిపై దాడికి యత్నించడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.....డబీర్‌పురాకు చెందిన సయ్యద్‌ సలీం (66) గతంలో ఎంబీటీ, కాంగ్రెస్‌ పార్టీలో పని చేశాడు. ఆయన తరచుగా మజ్లిస్‌కు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో వ్యాఖ్యలు చేస్తుంటాడు. ఇదిలా ఉండగా చాంద్రాయణగుట్ట గుల్షన్‌ ఇక్బాల్‌ కాలనీలో నివాసముండే యూ ట్యూబ్‌ న్యూస్‌ చానెల్‌ ఎడిటర్‌గా కొనసాగుతున్న సయ్యదా నహీదా ఖాద్రీ (39) అనే మహిళా జర్నలిస్టుపై కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయసాగాడు.

ఈ విషయమై ఆమె గత నెల 25న  సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదైంది. అయినప్పటికీ సలీం తీరు మార్చుకోకుండా ఈ నెల 12న ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఆమె పట్ల ఇష్టానుసారంగా వ్యాఖ్యానించాడు. అప్పటికే 20 రోజుల నుంచి నిరాశ, నిస్పృహతో ఉన్న ఆమె ఈ ఘటనతో మరింతగా మనస్తాపానికి గురైంది. “నెల రోజులుగా మానసిక్ష క్షోభ అనుభవిస్తున్నానని...పెళ్లి కావాల్సిన ఆడ పిల్లలున్నారని....నాకు ఆత్మహత్యే శరణ్యమంటూ’ సెల్ఫీ వీడియో తీసి...అనంతరం నిద్ర మాత్రలు మింగింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఒవైసీ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై ఆమె కుమార్తె సయ్యదా నబిహా ఖాద్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. 

మజ్లిస్‌ హంగామాపై విమర్శలు.. 
సలీంను అరెస్టు చేసేందుకు డబీర్‌పురాకు వెళ్లిన పోలీసులను మజ్లిస్‌ కార్యకర్తలు భారీ సంఖ్యలో అనుసరిస్తూ వెళ్లారు. అతన్ని అదుపులోకి తీసుకున్న వెంటనే తీవ్ర పదజాలంతో దూషిస్తూ...దాడికి యత్నించారు. అక్కడి నుంచి వచ్చాక ఆదివారం రాత్రి 9.30 గంటలకు కూడా చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌ నుంచి జైలుకు తీసుకెళుతున్న సమయంలోనూ అదే విధంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ విషయమై సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. అటు జర్నలిస్టు ఆత్మహత్యాయత్నం కూడా నాటకమంటూ....మజ్లిస్‌ పార్టీ పథకంలో భాగంగానే ఈ అరెస్టు కొనసాగిందని మజ్లిసేతర పార్టీలతో పాటు నెటిజెన్లు పేర్కొంటున్నారు. సదరు జర్నలిస్టు సేవా కార్యక్రమాల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తుందని...మజ్లిస్‌ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుందంటున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో మజ్లిస్‌ నేతలు, కార్యకర్తలు భారీగా పోగైనా పోలీసులు పట్టించుకోరా..? అంటూ ప్రశ్నల వర్షం గుప్పిస్తున్నారు. 

చదవండి: కేసుల సత్వర విచారణ జరపాలి: హిమా కోహ్లి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top