ధూమపానంపై రైల్వే నిబంధనలు కఠినతరం చేసిన కేంద్రం
భారీ జరిమానాలు.. అవసరమైతే టికెట్ రద్దు.. జైలు శిక్షలు
జన్ విశ్వాస్ చట్టం (నిబంధనల సవరింపు) అమలు షురూ
గెజిట్ నోటిఫికేషన్ జారీ.. జూలై 1 నుంచి పకడ్బందీగా అమలు
రైళ్లలో ధూమపానానికి, బెర్తుల ఆక్రమణకు చెక్ పడే చాన్స్
రైళ్ల ద్వారాల వద్ద నిలబడో, వాష్‌రూమ్‌కు వెళ్లో ధూమపానం చేసేవారు ఇకపై జాగ్రత్త పడాల్సిందే. జేబులు చెక్ చేసుకున్న తర్వాత సిగరెట్ ముట్టించాల్సిందే. ఎందుకంటే ఇప్పటివరకు ప్రయాణికులు ఎవరైనా గట్టిగా ఫిర్యాదు చేస్తే రూ.100 పెనాల్టీ విధించి వదిలేసేవారు. కానీ ఇప్పుడు జరిమానా ఏకంగా రూ.2 వేలకు పెరిగింది. అంతేకాదు..అవసరమైతే టికెట్ రద్దు చేసి తదుపరి స్టేషన్‌లో దింపేస్తారు. జరిమానా చెల్లించని పక్షంలో రైల్వే కోర్టులో హాజరుపరుస్తారు, జైలు శిక్ష కూడా విధిస్తారు.
సాక్షి, హైదరాబాద్: రైలు ప్రయాణమనగానే కొంతమంది వెనుకంజ వేస్తుంటారు. తక్కు వ టికెట్ ధరలు ఉండటం, రైళ్లు, రైల్వేస్టేషన్లు, స్టేషన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం..వంటివి కొన్ని కారణాలైతే, సాధా రణ టికెట్లు కూడా లేనివారు రిజర్వ్‌డ్ బెర్తులను ఆక్రమించడం, ఈ క్రమంలో రిజర్వే షన్ ఉన్న ప్రయాణికులను బెదిరించడం వంటి ఘటనలూ ఇందుకు కారణమవుతున్నాయి. కొందరు సిగరెట్లు, బీడీలు నిరాటంకంగా కాల్చడం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తోంది. అనేక రైళ్లలో ఇలాంటి నిబంధనల ఉల్లంఘనలు పెచ్చుమీరి పోతున్నాయి.
ఇంకోవైపు కేంద్రం ఇప్పుడు..అమృత్ భారత్ పేరుతో స్టేషన్లను పూర్తిస్థాయిలో ఆధునీకరిస్తోంది. సరికొత్త ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఏర్పా టు చేస్తోంది. ఆధునిక వందేభారత్, అమృత్ భారత్ రైళ్లను ప్రవేశపెడుతోంది. కానీ ఇప్పటికీ రైళ్లలో, రైల్వే స్టేషన్‌లలో నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగుతోంది. దీనివల్ల రైళ్లు, రైల్వే స్టేషన్ పరిసరాలు అస్తవ్యస్తంగా, అపరిశుభ్రంగా మారుతున్నా యి.
ముఖ్యంగా నిబంధనలు ఉల్లంఘించేవారితో తోటి ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం ఏర్పడుతోంది. కొన్ని సందర్భాల్లో రైలు ప్రయాణమంటే ఆలోచించాల్సిన పరి స్థితీ ఉంటోంది. ఇది రైల్వే ఆదాయంపై ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. పరిస్థితిని మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయాణికులతో పాటు వస్తువుల విక్రయదారులు, రైల్వే స్టేషన్లు, రైళ్లను స్థావరంగా మార్చుకుంటున్న యాచకులకు కళ్లెం వేయాలని నిర్ణయించింది.

భారీగా పెరిగిన పెనాల్టీలు, శిక్షలు
నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినచర్యలు తీసుకునేలా చట్ట నిబంధనలు సవరించింది. ‘జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) చట్టం 2026’పేరిట రైల్వే చట్టం 1989లో కీలక మార్పులు చేసింది. రైల్వే నిబంధనలు ఉల్లంఘనకు సంబంధించిన పెనాల్టీలు, శిక్షలను భారీగా పెంచింది. అవసరమైతే జైలు శిక్షలు విధించేలా మార్చింది. దీనికి సంబంధించి ఈ నెల 19న గెజిట్ నోటిఫికేషన్ జారీ తో సవరణలు అమల్లోకి వచ్చాయి. జూలై 1 నుంచి రైల్వే అధికారులు పకడ్బందీగా నిబంధనలు అమలు చేయబోతున్నారు.
స్పాట్‌లోనే జరిమానాల వసూలు
కొత్త నిబంధనల ప్రకారం కనీస జరిమానాలను భారీగా పెంచడమే కాకుండా, సంఘటన స్థలంలోనే వసూలు చేసే అధికారం కల్పించారు. జరిమానా కట్టని వారిపై తక్షణమే కేసులు నమోదు చేసి జైలుకు పంపేందుకు కూడా వెసులుబాటు కల్పించారు.
ప్రయాణం ఇక సాఫీగా..
జరిమానాలు భారీగా ఉండటం వల్ల ప్రయాణికుల్లో క్రమశిక్షణ పెరుగుతుందని, పదేపదే తప్పులు చేస్తే కూడా క్రమశిక్షణ వైపు మళ్లుతారని, ముఖ్యంగా ప్రజల్లో రైళ్ల మీద సదభిప్రాయం పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది.
» తోటి ప్రయాణికులకు ఎదురయ్యే అసౌకర్యం తగ్గి ప్రయాణం సాఫీగా సాగడానికి అవకాశం ఉంటుంది.
» మహిళా ప్రయాణికులకు భరోసా లభిస్తుంది.
» టికెట్ లేని ప్రయాణాలతో రైల్వేకు కలుగుతున్న నష్టం భర్తీ అవుతుంది. అందరూ టికెట్లు కొనటం వల్ల ఆదాయం పెరుగుతుంది. (రైళ్లలో దాదాపు 25 శాతం మంది టికెట్ తీసుకోనివారుంటారని అంచనా)
» రైళ్లు, రైల్వే ప్రాంగణాలు కొంత శుభ్రంగా మారే అవకాశం ఉంది. జరిమానాలు, శిక్షల భయంతో వివాదాలు, ఘర్షణలు తగ్గుతాయి.
» అదీకృత వ్యక్తులు మాత్రమే తినుబండారాలు, వస్తువులు అమ్మడానికి వీలుండటం వల్ల ప్రయాణికుల ఆరోగ్యానికి కూడా కొంత రక్షణ లభిస్తుంది.


