సాక్షి, మేడారం: మేడారం మహాజాతరలో నేడు కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. సమక్క నేడు వనం నుండి జనం మధ్యకు రానుంది. తల్లి రాక సందర్భంగా నిర్వహించే పూజా కార్యక్రమాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. మరోవైపు.. మేడారానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కేంద్రమంత్రులు కూడా మేడారం జాతరలో పాల్గొన్నారు.

మేడారం మహా జాతరలో కేంద్ర మంత్రులు జుయల్ ఓరమ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సారలమ్మని దర్శించుకుని నిలువెత్తు బంగారం సమర్పించారు. మరోవైపు.. రాష్ట్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు పొంగులేటి, సీతక్క, లక్ష్మణ్ కూడా మేడారంలో అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్బంగా మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర మంత్రులు జుయల్ ఓరమ్, కిషన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు వినతిపత్రం సమర్పించారు.
ఇదిలాఉండగా.. మేడారం జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం ఈరోజు ఆవిష్కృతం కానుంది.. చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్టిస్తారు. ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం చిలకలగుట్టపై పూజలు నిర్వహించి అక్కడినుండి గద్దెల పైకి తీసుకొచ్చి ప్రతిష్టిస్తారు. సారలమ్మను కాక వంశీయుల చేతుల మీదుగా తీసుకురాగా.. సమ్మక్కను సిద్దబోయిన వంశీయుల చేతుల మీదుగా గద్దెల పైకి తీసుకొస్తారని తెలిసిందే. ఈ కార్యక్రమంలో చందా వంశీయులు, ఐదు వంశస్తులు, మేడారం గ్రామస్తులతో పాటు ఆదివాసీలు అంతా పాల్గొని డోలి వాయిద్యాలు, ఆదివాసి ఆచార సంప్రదాయాలతో సమ్మక్కను ఉత్సాహంగా, ఊరేగింపుగా తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు.

సమ్మక్క రాక సందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ 10 రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి అధికారిక లాంచనాలతో స్వాగతం పలకడం ఇక్కడ ఆనవాయితీ. జిల్లా కలెక్టర్ ఎదురెళ్లి సమ్మక్క పూజారులకు పట్టు వస్త్రాలు సమర్పించి వారికి స్వాగతం పలుకుతారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా డిప్యుటీ సీఎం భట్టి మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ పూజారులకు స్వాగతం పలుకుతారు. సమ్మక్క ఆగమనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. స్థానిక మంత్రి సీతక్క అన్నీ తానై జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.


