ఇద్దరు బీటెక్ విద్యార్థుల దుర్మరణం.. ముగ్గురికి తీవ్రగాయాలు
వరంగల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
మేడ్చల్ జిల్లా: అతివేగంగా ప్రయాణిస్తున్న కారు వరంగల్ జాతీయ రహదారిపై అదుపుతప్పి పిల్లర్‌ను ఢీకొట్టిన దుర్ఘటనలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నిఖిల్ (23), సాయివరుణ్ (23), వెంకట్ (23), రాకేశ్, అభినవ్, యశ్వంత్‌రెడ్డి, సాత్విక్, హర్షవర్ధన్ బీటెక్ చదువుతున్నారు. వీరంతా వనపర్తి పట్టణానికి చెందిన వారే కాక ఒకే పాఠశాలలో చదువుకున్నారు.
మౌలాలిలోని తమ స్నేహితుడు అమెరికా నుంచి వచ్చిన సందర్భంగా అతన్ని కలిసేందుకు మంగళవారం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మహేంద్ర ఎక్స్‌యూవీ 700 కారులో బోడుప్పల్ వైపునుంచి పోచారం వెళ్తుండగా రాత్రి 2.15 నిమిషాల సమయంలో వరంగల్ జాతీయ రహదారిలో ముందున్న రెండు బైకులను తప్పించి సైడ్ తీసుకుంటున్న సమయంలో అతివేగంతో ఉన్న కారు అదుపుతప్పి ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ పిల్లర్ నంబర్ 97ను బలంగా ఢీకొట్టింది.
దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. ప్రమాదంలో కారును నడుపుతున్న నిఖిల్‌తో పాటు సాయివరుణ్ అక్కడికక్కడే మృతిచెందారు. వెంకట్, రాకేశ్‌లకు తీవ్రగాయాలు కాగా, అభినవ్, యశ్వంత్‌రెడ్డిలకు స్వల్ప గాయాలయ్యాయి. సాత్విక్, హర్షవర్ధన్ బయటపడ్డారు. మేడిపల్లి పోలీసులు క్షతగాత్రులను వెంటనే చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


