మద్యం మత్తులో బీభత్సం
బ్యానెట్‌పై నుంచి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్న ఎస్‌ఐ
డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తుండగా ఘటన
మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
రంగారెడ్డి జిల్లా: ఓ ఎస్‌ఐ విధుల్లో భాగంగా డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నాడు.. అంతలో అతివేగంగా దూసుకొచ్చిన కారు ఆయనను ఢీకొట్టింది.. బ్యానెట్‌ను పట్టుకున్న ఎస్‌ఐ కిలోమీటర్ మేర వెళ్లిన తర్వాత కిందికి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు.. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా యాచారంలో చోటుచేసుకుంది. యాచారం మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం సీఐ నందీశ్వర్‌రెడ్డి, ఎస్‌ఐ మధు సిబ్బందితో సాగర్ హైవేపై డ్రంకెన్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మద్యం మత్తులో మాల్ నుంచి కారులో ఇబ్రహీంపట్నం వైపు ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు.
డ్రంకెన్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసుల నుంచి తప్పించుకునే యత్నంలో విధుల్లో ఉన్న ఎస్‌ఐ మధును బలంగా ఢీకొట్టారు. బ్యానెట్‌ను పట్టుకున్న ఎస్‌ఐ అలా ఉండగానే మరింత వేగంగా దూసుకెళ్లారు. అదే క్రమంలో యాచారం బస్టాండ్ నుంచి బైకుపై మొండిగౌరెల్లి గ్రామానికి వెళ్తున్న మొగిలి వెంకట్‌రెడ్డి, అతని కోడలు దివ్య, చిన్న బాలుడిని ఢీకొట్టి అలాగే దూసుకెళ్లారు. కారు బ్యానెట్‌పైనే ఉండి కిలోమీటర్ దూరం వెళ్లిన ఎస్‌ఐ కారుపై నుంచి దూకాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆయనకు మాల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు.

అతి వేగంగా వెళ్తున్న కారును వెంబడించిన పోలీస్ సిబ్బంది 15 కిలోమీటర్ల దూరం వెళ్లాక ఇబ్రహీంపట్నంలో పట్టుకున్నారు. కారులో (టీఎస్ 11ఏ–8519) ఉన్నది అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొహెడ్, హయత్‌నగర్‌కు చెందిన శ్రీకర్, నితిన్‌లుగా గుర్తించారు. బైకును ఢీకొట్టిన సమయంలో తీవ్రంగా గాయపడిన వారిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ దివ్య భర్త లండన్‌లో ఉండగా రెండుమూడు రోజుల్లో ఆమె కూడా భర్త వద్దకు లండన్ వెళ్లాల్సి ఉంది. ప్రమాదం సమయంలో కారును నడిపింది శ్రీకర్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా, ప్రమాదంపై ఫ్యూచర్‌సిటీ సీపీ సు«దీర్‌బాబు సీఐ నందీశ్వర్‌రెడ్డి, ఎస్‌ఐ మధుతో ఫోన్‌లో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు.


