జీతాలకు 20 శాతం | CAG audit on payments to government employees | Sakshi
Sakshi News home page

జీతాలకు 20 శాతం

Sep 25 2025 5:06 AM | Updated on Sep 25 2025 5:06 AM

CAG audit on payments to government employees

ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లింపులపై ‘కాగ్‌’లెక్క 

సామాజిక, ఆర్థిక రంగాల కోసం మొత్తం 62% ఖర్చు 

మెజారిటీ రాష్ట్రాల్లో విద్య, వెద్యం, వ్యవసాయం తదితరాలపైనే ఎక్కువ వ్యయం 

2022–23లో రాష్ట్ర ఉద్యోగుల జీతాల కోసం 13.38 శాతం ఖర్చు పెట్టిన తెలంగాణ 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వాలు చేసే మొత్తం ఖర్చులో 20 శాతానికి పైగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల జీతాల కోసం చెల్లించాల్సి వస్తోందని కం్రప్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) వెల్లడించింది. స్టేట్‌ ఫైనాన్సెస్‌–డెకేడల్‌ అనాలసిస్‌ పేరుతో 2013–14 నుంచి 2022–23 వరకు పదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ఖర్చును కాగ్‌ విశ్లేషించింది. ఈ విశ్లేషణ ప్రకారం.. దేశంలోని సగం రాష్ట్రాలు (16) ఉద్యోగుల జీతాల కోసం తమ మొత్తం ఖర్చులో 20 శాతం కంటే ఎక్కువ చెల్లిస్తున్నాయని తెలిపింది.  

తొమ్మిది రంగాల్లోనే ఎక్కువ ఖర్చు 
కాగ్‌ నివేదిక ప్రకారం.. మెజార్టీ రాష్ట్రాల్లో తొమ్మిది రంగాలపైనే ఎక్కువగా ఖర్చు జరుగుతోంది. విద్య– క్రీడలు, వైద్యం, వ్యవసాయం, ఇంధనం, గృహనిర్మాణం–పట్టణాభివృద్ధి, రవాణా, గ్రామీణాభివృద్ధి, పోలీస్, సాంఘిక సంక్షేమం–పోషణ రంగాలపైనే ఎక్కువగా రాష్ట్రాలు దృష్టి పెడుతున్నాయి. ఆయా రాష్ట్రాల మొత్తం రెవెన్యూ ఖర్చులో 61.64 శాతం ఈ రంగాల్లోనే జరుగుతోంది.  

రాష్ట్రాల ఖర్చులకు సంబంధించిన కీలకాంశాలివీ..  
» నాగాలాండ్, హిమాచల్‌ప్రదేశ్, సిక్కిం, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, అరుణాచల్‌ప్రదేశ్, రాజస్తాన్, కేరళ, అసోం, పంజాబ్, మేఘాలయ, హరియాణా, గోవా రాష్ట్రాలు..ఉద్యోగుల జీతాల కోసం 20% కంటే ఎక్కువగా వెచ్చించాయి. కేవలం 4 రాష్ట్రాలు (గుజరాత్, కర్ణాటక, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర) మాత్రం 10%కంటే తక్కువ ఖర్చు పెట్టాయి. ఈ రెండు జాబితాల్లోనూ తెలంగాణ లేదు. 2022–23లో రాష్ట్రం ఉద్యోగుల జీతాల కోసం 13.38% ఖర్చు పెట్టింది. పింఛన్ల కోసం ఈ ఏడాదిలో 5 రాష్ట్రాలు 15% అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టగా, 14 రాష్ట్రాలు 10–15% వెచ్చించాయి. తెలంగాణలో మాత్రం ఉద్యోగుల పింఛన్‌ కోసం 8.21% ఖర్చయింది.  

» అప్పులకు వడ్డీల కింద వెచ్చించడంలో తెలంగాణ దేశంలోనే 9వ స్థానంలో ఉంది. 2022–23లో జరిగిన మొత్తం ఖర్చులో 11.33% నిధులను వడ్డీల కింద రాష్ట్రం చెల్లించింది.  

» కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధులను తెలంగాణ ఎక్కువగా జీతాలు, ఇతర ఖర్చుల కోసం వినియోగిస్తోంది. 2022–23లో 36 శాతం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధులను స్థానిక సంస్థల ఉద్యోగులకు జీతాలు, ఇతర ఖర్చుల కోసం వినియోగించగా, ఆస్తుల కల్పన కోసం కేవలం 0.003 శాతం మాత్రమే వెచ్చించింది.  

» సబ్సిడీల రూపంలో అత్యధికంగా పంజాబ్‌ 16.93% ఖర్చు పెట్టగా, అరుణాచల్‌ ప్రదేశ్‌ ఒక్క రూపాయి కూడా సబ్సిడీల కోసం ఇవ్వలేదని కాగ్‌ గణాంకాలు చెబుతున్నాయి. సబ్సిడీల కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్న రాష్ట్రాల్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లు ఉన్నాయి. తెలంగాణ 2022–23లో సబ్సిడీల కోసం 5% నిధులను వెచ్చించింది.  

» ఏడాది మొత్తం పెట్టిన ఖర్చులో భారీ ప్రాజెక్టుల కోసం తెలంగాణ ఖర్చు పెట్టింది 7.31%మాత్రమే.

» షేర్లు, ఈక్విటీలు, సెక్యూరిటీలు, టర్మ్‌ డిపాజిట్లు, ఇతర పెట్టుబడుల కోసం ఆ ఏడాదిలో పెట్టిన మొత్తం ఖర్చులో తెలంగాణ కేవలం 0.09% మాత్రమే వెచ్చించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement