సాక్షి ప్రతినిధి, వరంగల్/సాక్షి, హైదరాబాద్/ఎస్‌ఎస్ తాడ్వాయి: రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఓ మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో ఆదివారం సాయంత్రం 5 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. అక్కడి హరిత హోటల్ కేంద్రంగా కీలకాంశాలపై నిర్ణయం తీసుకోవడానికి సమాయత్తమైంది.
షెడ్యూల్ ప్రకారం సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం పాలేరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఖమ్మం పట్టణంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెప్పాయి. ఆ తర్వాత అక్కడే జరగనున్న సీపీఐ వందేళ్ల సభలో పాల్గొననున్నారు. ఆ తర్వాత పలువురు మంత్రులతో కలిసి హెలికాప్టర్‌లో బయలుదేరి సాయంత్రం 4 గంటలకల్లా మేడారానికి చేరుకోనున్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం మేడారంలోనే రాత్రి బస చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రులతో కలిసి సోమవారం ఉదయం 6:30 గంటలకు నూతనంగా నిర్మించిన సమ్మక్క–సారలమ్మ గద్దెలను ప్రారంభించనున్నారు. వనదేవతలకు చీర, సారె, బెల్లంతో మొక్కులు సమర్పించుకుని తిరిగి హైదరాబాద్ బయలుదేరనున్నారు.
భద్రత కట్టుదిట్టం..
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో మేడారంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఎం హెలిప్యాడ్ స్థలం, హరిత హోటల్, టెంట్ సిటీ, సాంస్కృతిక కార్యక్రమాల సభా ప్రాంగణం తదితర ప్రాంతాల వద్ద అదనపు బలగాలను మోహరించారు. డీజీపీ శివధర్‌రెడ్డి, ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించగా ములుగు ఎస్పీ సు«దీర్ రాంనాథ్ కేకన్ భద్రతా ఏర్పాట్లపై మేడారంలోని కమాండ్ కంట్రోల్ రూంలో సమీక్షించారు. బందోబస్తు విధుల కోసం 1,600 మంది పోలీసులను మోహరించినట్లు చెప్పారు.
మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్!
మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల్లో కో–ఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్‌జెండర్లను నియమించే అంశంపై మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం. అలాగే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ములుగు జిల్లాలోని రామప్ప చెరువుపై రూ. 103.22 కోట్ల అంచనా వ్యయంతో పొట్లాపూర్ ఎత్తిపోతల పథకం నిర్మించాలనే ప్రతిపాదనపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. కేబినెట్ భేటీలో సుమారు 15 అంశాలు చర్చకు రానున్నట్లు తెలిసింది. భూ కేటాయింపులు, మూడు యూనివర్సిటీల్లో కొత్తగా మూడు ప్రొఫెసర్ పోస్టుల మంజూరు, పురపాలక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అమలుపై స్టేటస్ నోట్లు కేబినెట్ ముందుకు రానున్నట్లు తెలియవచ్చింది. నీటిపారుదల శాఖ నుంచి చిన్న కాళేశ్వరం (ముక్తేశ్వర) ఎత్తిపోతల సవరించిన అంచనాల ఫైల్ కేబినెట్ ముందుకు రానుంది. సమ్మక్క–సారలమ్మ జాతరకు జాతీయ హోదా సాధన, నిర్వహణ కోసం నిధుల మంజూరు అంశాలపై మంత్రివర్గం చర్చించనున్నట్లు అలాగే రైతు భరోసా చెల్లింపులు, సీఎం దావోస్ పర్యటన, ఇతర సమకాలీన రాజకీయ అంశాలపై కేబినెట్‌లో చర్చకు రానున్నట్లు తెలిసింది.
గిరిజన సంప్రదాయ వంటకాలతో విందు: మంత్రి సీతక్క
మేడారంలో కేబినెట్ భేటీ కోసం వస్తున్న సీఎం, మంత్రులకు గిరిజన సంప్రదాయ వంటకాలతో విందు ఏర్పాటు చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఇప్పపువ్వు లడ్డూ, కరక్కాయ చాయ్, ఇప్పపువ్వు టీ, జావ, జొన్న రొట్టె, గోదావరి చేపలు, రొయ్యలు, బొంగు చికెన్ తదితర వంటకాలను వడ్డించనున్నట్లు చెప్పారు. జిల్లాలో లభించే పదార్థాలతోనే ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు వివరించారు.
ట్రాఫిక్ మళ్లింపులు..
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మేడారం వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయని ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ వెల్లడించారు. ఆదివారం మేడారం జాతరకు వన్‌వే అమలు చేస్తున్నట్టు తెలిపారు. వరంగల్ నుండి మేడారం వచ్చే భక్తులు. ములుగు పసర.. నార్లాపూర్ మీదుగా మాత్రమే మేడారం చేరుకోవాలి. తాడ్వాయి మీదుగా ప్రవేశం లేదు. ఆదివారం భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ట్రాఫిక్ నియంత్రణ చర్యలు పాటించి పోలీసులకు సహకరించాలన్నారు. తిరుగు ప్రయాణంలో భయక్కపేట భూపాలపల్లి.. పరకాల.. గూడెపాడు మీదుగా వరంగల్ చేరుకోవాలి. మేడారంలో సీఎం పర్యటన సందర్భంగా పోలీసుల అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాలు ఎగుర వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


