
ర్యాలీలో నినాదాలు చేస్తున్న ఎమ్మెల్సీ కవిత తదితరులు
యుద్ధ వాతావరణంలో అందాల పోటీలు తప్పుడు సంకేతం
ఎమ్మెల్సీ కవిత.. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ర్యాలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ సమయంలో అందాల పోటీలు నిర్వహించడం సరికాదని, ఐపీఎల్‌ను వాయిదా వేసినట్లుగానే మిస్ వరల్డ్ పోటీలను కూడా వాయిదా వేయాలని కోరారు. ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా, భారత సైన్యానికి సంఘీభావంగా శుక్రవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్కు నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వరకు జరిగిన ర్యాలీకి కవిత నాయకత్వం వహించారు.
సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో పాకిస్తాన్ చేసిన దాడుల్లో వీరమరణం పొందిన సైనికుడు మురళీనాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసిందని కవిత ప్రశంసించారు. పాకిస్తాన్ మన దేశంలోని ఎయిర్‌పోర్టులను టార్గెట్ చేసుకొని చేసిన దాడులను భారత సైన్యం గట్టిగా తిప్పికొట్టిందని, ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సీఎంకు రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం రాకపోతే పదవి నుంచి తప్పుకోవాలన్నారు. పరిపాలన చేతకాని సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
‘మిస్ వరల్డ్ అందాల పోటీలను రద్దు చేయాలి’
సాక్షి, హైదరాబాద్: మిస్ వరల్డ్ అందాల పోటీలను రద్దు చేయాలని ఏఐఎంఎస్‌ఎస్, ఏఐడీఎస్‌వో, ఏఐడీవైవో సంఘాలు డిమాండ్ చేశాయి. మహిళల ఆత్మగౌరవం, వ్యక్తిత్వాన్ని కించపరిచే, మహిళలను మార్కెట్‌లో ఒక వస్తువుగా దిగజార్చే అందాల పోటీలను వెంటనే ఆపాలని ఒక ప్రకటనలో కోరారు. ఈ మేరకు శుక్రవారం ప్రజావాణి ఇన్‌చార్జి చిన్నారెడ్డికి ఈ మూడు సంఘాల నేతలు హేమలత, జ్యోతి, నితీశ్, నాగరాజు, తేజ, దేవరాజులు వినతిపత్రం అందించారు.