
కేటీఆర్‌కు పుష్పగుచ్ఛం ఇస్తున్న మాజీ మంత్రి ఈశ్వర్
సింగరేణి కార్మీక నేతల సమావేశంలో కేటీఆర్ వెల్లడి
బొగ్గు గనులపై కాంగ్రెస్, బీజేపీ కుట్రలు
కార్మికుల సమస్యలపై పోరాటానికి కార్యాచరణ
త్వరలో సింగరేణి కార్మీకులతో విస్తృత సమావేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బొగ్గుగని కార్మీక సంఘం (టీబీజీకేఎస్) కార్యకలాపాలను ఇకపై సంఘం వ్యవస్థాపక సభ్యుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పార్టీ పక్షాన ఇన్‌చార్జిగా పర్యవేక్షిస్తారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. సింగరేణి ప్రాంతానికి చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు, మాజీ మంత్రులతో సమన్వయం చేసుకుంటూ బొగ్గు గని కార్మిక సంఘం కార్యకలాపాలు నిర్వహించాలన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం టీబీజీకేఎస్ నేతలతో జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కొప్పుల ఆధ్వర్యంలో సంఘం కార్యకలాపాలను ముందుకు తీసుకుపోవడంతోపాటు కార్మీకుల సమస్యలపై పోరాటం చేయాలన్నారు.
సింగరేణి బొగ్గు గనులపై కాంగ్రెస్, బీజేపీ కలిసి చేస్తున్న కుట్రలపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. పార్టీకి అనుబంధంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ద్వారా సింగరేణి కార్మీకుల హక్కుల కోసం ఉద్యమించాలన్నారు. సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేంత వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఈ భేటీలో నిర్ణయించారు. కార్మీకులకు ప్రభుత్వం చేసే అన్యాయాలపై పోరాడేందుకు పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. బొగ్గు గని కార్మీక సంఘం ఆధ్వర్యంలో త్వరలో విస్తృతస్థాయి సమావేశం ఉంటుందని ప్రకటించారు.
‘టాక్ జర్నలిజం’ఈవెంట్‌కు కేటీఆర్
దేశంలోని ప్రముఖ జర్నలిస్టులు, మేధావులు, రాజకీయ నాయకులు ప్రతిష్టాత్మక ‘టాక్ జర్నలిజం 2025’కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కేటీఆర్‌కు ఆహ్వనం అందింది. ఈ నెల 19, 20 తేదీల్లో రాజస్తాన్‌లోని జైపూర్ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది. దక్షిణ భారత రాజకీయాల్లో ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని బలంగా వినిపిస్తున్న, విజన్ ఉన్న వినూత్న నాయకుడిగా పేరు తెచ్చుకున్న కేటీఆర్‌ను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు ఆహ్వన లేఖలో పేర్కొన్నారు.
మీడియా రంగంలోని మార్పులు, ధోరణులు, సవాళ్లపై చర్చించేందుకు దేశ విదేశాలకు చెందిన జర్నలిస్టులు కలుసుకునే వేదికగా ‘టాక్ జర్నలిజం’నిలుస్తోంది. గతంలో సచిన్ పైలట్, అసదుద్దీన్ ఒవైసీ, సుబ్రమణ్య స్వామి, జీవీఎల్ నరసింహారావు, రాఘవ్ చద్దా, డి.రాజా, ప్రియాంకా చతుర్వేది తదితరులు పాల్గొన్నారు. ఈసారి కేటీఆర్ తన ప్రసంగంలో ప్రాంతీయ అసమానతలు, సమాఖ్య విధానం, మారుతున్న భారత రాజకీయాల దిశ వంటి అంశాలను ప్రస్తావించనున్నారు.