అనుమానంతో హతమార్చిన భర్త
రహమత్‌నగర్(హైదరాబాద్): ఆనందంగా సాగే ఆ కుటుంబంలో అనుమానం చిచ్చు రగిల్చింది. దీంతో భర్త ఉన్మాదిగా మారాడు..కట్టుకున్న భార్యను హతమార్చాడు. బోరబండ పోలీసుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా చింతకుంటకు చెందిన రొడ్డె ఆంజనేయులుకు కొల్లాపూర్‌కు చెందిన సరస్వతితో 14 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి బాబు, పాప ఉన్నారు. కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం నగరానికి వచ్చి రహమత్‌నగర్ డివిజన్ పరిధిలోని రాజీవ్‌గాంధీనగర్‌లో ఓ భవనంలో అద్దెకు దిగాడు. ఆంజనేయులు కొంతమందితో కలిసి జూబ్లీహిల్స్‌లో కార్ల క్రయవిక్రయాల వ్యాపారం చేస్తున్నాడు.
సరస్వతి ఎమ్మెల్యే కాలనీలో హౌస్ కీపింగ్ పనిచేసేది. అయితే కొంతకాలంగా భార్య సరస్వతిపై అనుమానం పెంచుకున్న ఆంజనేయులు తరచూ ఆమెను వేధిస్తుండేవాడు. ఆమె ఫోన్ ఓపెన్ చేసి అన్నీ పరిశీలిస్తూ, ఆమె పనిచేసే ప్రాంతానికి వెళ్లి గమనించేవాడు. ఈ క్రమంలోనే దంపతుల మధ్య గొడవలు జరిగాయి. సరస్వతి తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఆంజనేయులు తన అత్తగారింటికి వెళ్లి, భార్య తరఫు పెద్ద మనుషులతో మాట్లాడి, గొడవలు పెట్టుకోనని నచ్చజెప్పి తన భార్యను రాజీవ్‌గాంధీనగర్‌కు తీసుకొచ్చాడు.
అయితే భార్యపై కక్ష మాత్రం తగ్గలేదు. సోమవారం అర్ధరాత్రి తన పిల్లలతో కలిసి గాఢనిద్రలో ఉన్న సరస్వతి తలపై రోకలితో బాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. హత్య అనంతరం ఆంజనేయులు అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆంజనేయులు హత్య చేసిన అనంతరం తన స్టేటస్‌లో ‘నా జీవిత భాగస్వామిని నేనే నా చేతులారా చంపుకున్న’అంటూ ఫొటో పెట్టాడు. నిందితుడి కోసం బోరబండ పోలీసులు గాలిస్తున్నారు.


