సాక్షి, హైదరాబాద్: ‘అమ్మా.. తల్లీ బోన మెత్తిన’ అంటూ డప్పు చప్పుళ్లు, పోతరాజుల నృత్యం, బంగారు బోనాల ఊరేగింపు. హైదరాబాద్ ఆత్మగా నిలిచిన బోనాలకు 200 ఏళ్ల చరిత్ర అని ఇన్నాళ్లూ అనుకున్నాం. కానీ ఏఎస్‌ఐ ఆధారాలు ఈ ఉత్సవం 500 ఏళ్లకు పైగా పురాతనమని తేల్చాయి. రాష్ట్ర పురావస్తు మ్యూజియంలోని 1516 మే 4 శాసనం బోనాల చరిత్రను 300 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లింది. విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాసిన ఈ శాసనంలో ‘బోనాలు’ అనే పదం స్పష్టంగా ఉంది. వాటిపై పన్ను మినహాయింపు ఇచి్చనట్లు పేర్కొన్నారు.
అప్పటి నుంచే ఇది రాజ్యాంగ పవిత్ర ఆచారం. నేటి హైదరాబాద్ బోనాలకు 1813 కీలకం. ఆ ఏడాది నగరంలో ప్లేగు, కలరాతో వేలాది మంది చనిపోయారు. సైనికులు ఉజ్జయినీ మహంకాళిని మొక్కుకున్నారు. మహమ్మారి తగ్గాక సికింద్రాబాద్ ఆలయంలో తొలిసారి బోనం సమరి్పంచారు. అక్కడి నుంచి గోల్కొండ, లాల్ దర్వాజాకు విస్తరించింది. నిజాం కాలంలో వెండి బోనం సంప్రదాయం వచ్చింది. 2014 తర్వాత బోనాలను ‘రాష్ట్ర పండుగ’గా ప్రకటించారు.
ఇప్పుడు ప్రభుత్వమే బంగారు బోనం సమర్పిస్తోంది. ఆషాఢ ఆదివారాల్లో మొదటిది గోల్కొండ, రెండోది సికింద్రాబాద్, మూడోది హైదరాబాద్, నాలుగోది లాల్ దర్వాజాలో భక్తి ప్రవాహం కనిపిస్తుంది. 1516 నుంచి 2026 వరకు అవిచి్ఛన్నంగా వెలుగుతున్న బోనాల జ్యోతి తెలంగాణ గుర్తింపుగా నిలిచింది.


