హాజరుకానున్న ప్రధాని... ఆ ప్రాంతాలను హై సెక్యూరిటీ జోన్‌గా... | BJP National Working Group Meetings Declared High Security Zone | Sakshi
Sakshi News home page

హాజరుకానున్న ప్రధాని... ఆ ప్రాంతాలను హై సెక్యూరిటీ జోన్‌గా...

Jun 27 2022 8:45 AM | Updated on Jun 27 2022 8:45 AM

BJP National Working Group Meetings Declared High Security Zone - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/గచ్చిబౌలి: భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీ సహా దాని చుట్టుపక్కల ప్రాంతాలను హై సెక్యూరిటీ జోన్‌గా ప్రకటించాలని రాష్ట్ర పోలీసు విభాగం యోచిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సహా అనేక మంది అత్యంత ప్రముఖులు వస్తుండటంతోనే ఈ నిర్ణయం తీసుకుంది.

వీరితో పాటు దేశంలోని 18 రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు సైతం హాజరు కానుండటం, ఇక్కడే ఉండనుండటంతో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పాల్గొనడంతో పాటు ఆఖరి రోజు పరేడ్‌గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలోనూ పాల్గొననున్నారు. నగరంలోని రాజ్‌భవన్‌ లేదా సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని హోటళ్లు నోవాటెల్, వెస్టిన్‌ లేదా ఐటీసీ కోహినూర్‌ల్లో ఏదో ఒకచోట మోదీ బస చేస్తారని తెలుస్తోంది. ఆయన భద్రతను పర్యవేక్షించే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ అధికారులదే తుది నిర్ణయమని పోలీసులు చెబుతున్నారు. రాజ్‌భవన్‌తో పాటు ఆయా హోటళ్లలోనూ అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరిస్తున్నారు. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు.  

అక్కడ హోటళ్లలో నో రూమ్స్‌... 
అత్యంత ప్రముఖులతో పాటు ఇతరులు, వారి భద్రతా సిబ్బంది బస చేయడానికి బీజేపీ పార్టీ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. మాదాపూర్‌తో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న హోటళ్లను ఈ నెల 30 నుంచి వచ్చే నెల 3 వరకు బుక్‌ చేసేసింది. ప్రధాని సహా ప్రముఖులు దాదాపు 350 మంది రానున్నారని తెలుస్తోంది. వీరితో పాటు అనుచరులు, సహాయకులు సైతం పెద్ద సంఖ్యలోనే వస్తారు. దీంతో మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని స్టార్‌ హోటళ్లతో పాటు సాధారణ హోటళ్లలోని రూమ్‌లన్నీ బ్లాక్‌ చేసి ఉంచారు.  

గుజరాత్, రాజస్థాన్‌ రాష్ట్రాల నుంచి వచ్చే వారు ఐటీ కారిడార్‌లోని హోటళ్లను బుక్‌ చేసుకుని అడ్వాన్స్‌లు కూడా చెల్లించారు. ఆ మూడు రోజు లూ సాధారణ కస్టమర్లకు హోటళ్లలో గదులు దొరకని పరిస్థితి ఉంది. మరోపక్క నగరంలోనూ కొన్ని హోటళ్లలోని రూమ్స్‌ బీజేపీ బుక్‌  చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా అబిడ్స్, లక్డీకాపూల్‌లతో పాటు బేగంపేట్, అమీర్‌పేట్, సికింద్రాబాద్‌ల్లో ఉన్న హోటళ్లను బుక్‌ చేసి ఉంచారు.  

ప్రారంభమైన సెక్యూరిటీ వెట్టింగ్‌ ప్రక్రియ..
ప్రధాని, కేంద్ర మంత్రులు, సీఎంలు, బీజేపీ జాతీయ ముఖ్యనేతలు రానుండటంతో సైబరాబాద్‌ పోలీసులు బందోబస్తు, భద్రత ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. బందోబస్తు కోసం రాచకొండతో పాటు ఇతర జిల్లాల నుంచి అధికారులను రప్పించనున్నారు. భద్రత చర్యల్లో భాగంగా ఆయా హోటళ్లలో పని చేసే సిబ్బందికి సంబంధించి సెక్యూరిటీ వెట్టింగ్‌ చేపడుతున్నారు. వారి వివరాలు, ఆధార్‌ లేదా గుర్తింపుకార్డుల్ని సేకరిస్తున్నారు. వీటిని స్పెషల్‌ బ్రాంచ్, ఇంటెలిజెన్స్‌ పోలీసులు సాయంతో సరిచూస్తున్నారు. హెచ్‌ఐసీసీతో పాటు ఆయా హోటళ్ల పక్కన నిర్మాణంలో ఉన్న భవనాల పైనా పోలీసులు దృష్టి పెట్టారు. వాటిలో పని చేసే ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీల వివరాలు సేకరిస్తున్నారు.

వీరందరి పూర్వాపరాలు, గత చరిత్ర, నేరాలు సంబంధాలు తదితరాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ సెక్యూరిటీ వెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. ముఖ్య నేతలు బస చేసే హోటళ్ల వద్ద యాక్సెస్‌ కంట్రోల్‌ పాయింట్లు, చెక్‌ పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. అడుగడుగున వాహనాల తనిఖీలు చేపట్టనున్నారు. హోటల్‌ సిబ్బందితో పాటు బస చేస్తున్న వారికీ సరైన గుర్తింపు కార్డులు ఉంటేనే లోనికి అనుమతించనున్నారు. ఆయా హోటళ్లల్లో ఇప్పటికే ఉన్న వాటి పనితీరు పరిశీలించడంతో పాటు తోడు కొత్తగా పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. 

(చదవండి: బీజేపీ నేతల తీరు దుర్మార్గం: బాల్క సుమన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement