సామూహిక నిమజ్జనం ఈసారికి లేదు | Sakshi
Sakshi News home page

సామూహిక నిమజ్జనం ఈసారికి లేదు

Published Mon, Jul 27 2020 1:18 PM

Bhagavantha Rao Said Government Should Celebrate Vinayaka Chavithi As Per Instructions - Sakshi

పంజగుట్ట(హైదరాబాద్‌): ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా ప్రభా వం గణేశ్‌ ఉత్సవాలపైనా పడింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఆడంబరాలకు వెళ్లకుండా వినాయక చవితి ఉత్సవాలను సాదాసీదాగా జరుపుకోవాలని భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి సూచించింది. సెప్టెంబర్‌ 1న సామూహిక నిమజ్జనం ఉండదని.. మండపాల నిర్వాహకులు సామాజిక దూరం పాటిస్తూ వారి దగ్గరలోని బావి, చెరువు, నదుల్లో నిమజ్జనం చేసుకోవాలని సమితి అధ్యక్షుడు రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి భగవతరావు పేర్కొన్నారు. వినాయక చవితి ఉత్సవాలు జాగ్రత్తగా జరుపుకొందాం అంటూ రూపొందించిన పోస్టర్‌ను సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భాగ్యనగరంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నందున విగ్రహాల ఎత్తులపై పోటీ పడకుండా సాధ్యమైనంతవరకు ఎలాంటి ఆడంబరాలు లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్యసూత్రాలు, నిబంధనలు పాటిస్తూ మండపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

తక్కువ మంది భక్తులతో సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు పెట్టుకుని పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నారు. రాజ్యాంగం ప్రకారం పూజలు చేసుకునేందుకు అనుమతులు అవసరం లేదని.. నిర్వాహకులు వారి సమీప పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇచ్చి మండపాలు ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. వినాయకుని పూజకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. విగ్రహ తయారీదార్లను, ఉత్సవాలపై ఆధారపడి జీవించే వివిధ వృత్తి కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. వచ్చే ఏడాదికి పరిస్థితులు సద్దుమణిగితే రెట్టింపు ఉత్సాహంతో ఉత్సవాలు జరుపుకొందామని పిలుపునిచ్చారు. సమావేశంలో సమితి ప్రతినిధులు కరోడీమాల్, రామరాజు, జోషి, మహేందర్, శశిధర్, బుచ్చిరెడ్డి, భాస్కర్, మురారి, శ్రీరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement