
స్వయం సహాయక మహిళా సంఘాలకు డ్రస్ కోడ్ ఉండేలా ఒకే కలర్ చీరల పంపిణీకి సన్నాహాలు
ఒక్కో సభ్యురాలికి రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయం
నవంబర్ 19 ఇందిరాగాంధీ జయంతి రోజున ఒక చీర పంపిణీ
జిల్లాకు చేరిన లక్షా 20 వేల చీరలు
నల్లగొండ : బతుకమ్మ చీరలు ఈసారి కూడా లేనట్టే. స్వయం సహాయక సంఘాల సభ్యులకు మాత్రమే చీరలు పంపిణీ చేయనున్నారు. ఇందిరా మహిళా శక్తి సంఘాల పేరుతో ఒక్కో సభ్యురాలికి సంవత్సరానికి రెండు చొప్పున చీరలు ఇస్తారు. నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి రోజున చీరలు పంపిణీ చేయనున్నారు. సంఘం సమావేశాలకు సభ్యులంతా డ్రస్ కోడ్‌తో హాజరయ్యేలా.. ఒకే కలర్ చీరను ధరించి రావాలని భావించి అందరికీ బ్లూ కలర్ చీరలను పంపిణీ చేయనున్నారు.
ప్రస్తుతం ఒక చీర
గత ప్రభుత్వం మహిళలందరికీ ఏటా బతుకమ్మ చీరలను అందించింది. 18 సంవత్సరాలు నిండిన మహిళకు రేషన్‌షాపుల చీరలు పంపిణీ చేసింది. అయిత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇందిరా మహిళా శక్తి పథకం కింద సెర్ఫ్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల సభ్యులకు, మున్సిపాలిటీల్లో మెప్మా ఆధ్వర్యంలోని మహిళా సంఘాల సభ్యులకు ఏటా రెండు చీరలు అందించాలని నిర్ణయించింది. అందులో భాగంగా మొదటి విడతగా ఒక చీరను అందించనుంది.
బతుకమ్మ చీరలుగా ప్రచారం
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది బతుకమ్మ పండుగకు మహిళలకు చీరలు ఇవ్వలేకపోయింది. ఈసారి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఒక్కొక్కరికి రెండు చీరలు ఇవ్వాలనే ఉద్దేశంతో నేతన్నలకు పని కల్పిస్తున్నామని సీఎం సైతం అన్నారు. అయితే ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తామన్న చీరలు మహిళా సంఘాల సభ్యులకని, ఏడాదికి రెండు చీరలు ఇస్తున్నామని ప్రకటించారు. సంఘాల్లో లేని మహిళలకు చీరలు ఎందుకు ఇవ్వరన్న చర్చ మొదలైంది.
జిల్లాలో 3,66,955 మంది మహిళా సంఘాల సభ్యులు
జిల్లాలో మొత్తం 3,66,955 మంది మహిళా సంఘాల సభ్యులు ఉన్నారు. వారందరికీ చీరలు ఇవ్వాలని ఇవ్వనున్నారు. అయితే మొదటి విడతగా ఒక్కో చీర మాత్రమే ఇవ్వనున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే జిల్లాకు లక్షా 20 వేల చీరలు వచ్చాయి. వాటిని జిల్లాలోని చండూర్, చింతపల్లి, మిర్యాలగూడ మార్కెటింగ్ గోదాముల్లో భద్రపరిచారు. మిగతా చీరలు కూడా త్వరలోనే జిల్లాకు వస్తాయని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్‌రెడ్డి తెలిపారు.