బతుకమ్మ ప్రత్యేకం.. బంతి, చామంతి, గునుగు, లిల్లీ, పట్టుకుచ్చులకు భలే గిరాకీ.

Bathukamma Festival: Different Flowers Cultivation In karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌: కొందరు రైతులు సీజనల్‌ పంటలతోపాటు పూల సాగు చేస్తుంటే మరికొందరు సాధారణ పంటలతో విసిగిపోయి, పూల తోటలపై దృష్టిసారించారు. పండుగలు, శుభకార్యాల నెలలకు అనుగుణంగా రకరకాల పూలతో సిరులు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. బతుకమ్మ, దసరా, దీపావళి, మల్లన్న పట్నాలు, శివరాత్రి తదితర పర్వదినాల్లో, పెళ్లిళ్లలో పూలకు డిమాండ్‌ ఉంటుంది. ఆయా పండుగలకు అనుగుణంగా రైతన్నలు బంతి, చామంతి, గడ్డి చామంతి, పట్టుకుచ్చులు, గల్లండ, లిల్లీపూలు సాగు చేస్తూ మంచి దిగుబడులు, ఆదాయం పొందుతున్నారు. తొమ్మిది రోజుల బతుకమ్మ సందడి ప్రారంభమైన నేపథ్యంలో పూలు విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్న కర్షకులపై ప్రత్యేక కథనం.

చింతల్‌పేట్‌లో బంతి, చామంతి పూలు
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలోని చింతల్‌పేట్‌కు చెందిన రైతు ఇప్ప గంగాధర్‌ ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం పరిసరాల నుంచి బంతి, చామంతి, గడ్డి చామంతి మొక్కలను రూ.3 నుంచి రూ.5 చొప్పున వెచ్చించి, తీసుకువస్తున్నాడు. వీటిని ఎకరం 10 గుంటల్లో నాటుతున్నాడు. నాటిన నెల రోజుల నుంచి పూతకు వస్తాయి. ఆ తర్వాత వారం, పది రోజుల్లోనే తెంపి విక్రయిస్తున్నాడు. చీడపీడల నివారణకు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు పురుగు మందులు ఖర్చవుతుందని, భూసారం పెంచడానికి ఎక్కువగా సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తున్నానని గంగాధర్‌ తెలిపాడు.
చదవండి: బతుకమ్మ పండుగ.. తొమ్మిది రోజులు ఎనిమిది నైవేద్యాలు!

సాధారణ సీజన్‌లో బంతి కిలో ధర రూ.50 నుంచి రూ.60, చామంతి, గడ్డి చామంతి కిలో ధర రూ.150 నుంచి రూ.170 వరకు ఉంటుంది. ఇక బతుకమ్మ, దసరా సీజన్లలో బంతికి కిలో రూ.100, చామంతి రూ.200 వరకు, గడ్డి చామంతి రూ.50 వరకు ఉంటుందని పేర్కొన్నాడు. ప్రస్తుత సీజన్‌లో పూలన్నీ విక్రయిస్తే రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తుందని చెప్పాడు. 

కండ్లపల్లిలో లిల్లీపూలు
జగిత్యాల మండలంలోని కండ్లపల్లికి చెందిన చందా సుధాకర్‌ లిల్లీపూలు సాగు చేస్తున్నాడు. వీటి గడ్డలు 20 కిలోలకు రూ.800 వెచ్చించి, నాగర్‌కర్నూల్‌ జిల్లా పాలెం నుంచి తీసుకువస్తున్నాడు. భూమిని నాలుగైదు సార్లు బాగా దున్ని, పొడి దుక్కి చేస్తాడు. తర్వాత పేడ, కోడి ఎరువు వేస్తాడు. అనంతరం లిల్లీపూల గడ్డలను పొలంలో నాటుతాడు. ఒక్కసారి నాటితే మూడేళ్ల వరకు పూలు పూస్తాయి. నాటిన 3 నెలలకు దిగుబడి వస్తుంది.
చదవండి: Bathukamma: పండగ వెనుక ఎన్ని కథలున్నా.. బతుకమ్మ ప్రత్యేకత ఇదే

ఫిబ్రవరి, మార్చి, జూన్, జూలై, ఆగస్టు నెలల్లో పూలు ఎక్కువగా వస్తాయి. వీటిని జగిత్యాల మార్కెట్‌కు తరలిస్తున్నాడు. ఏటా రెండుసార్లు తోటకు డీఏపీతోపాటు 3 నెలలకోసారి పొటాష్, యూరియా అందిస్తుంటాడు. ఈ పూలు మార్కెట్లో కిలోకు  రూ.100 పలుకుతున్నాయి. నిత్యం 8 నుంచి 10 కిలోలను మార్కెట్‌కు తరలిస్తున్నట్లు సుధాకర్‌ తెలిపాడు. ఏడాదికి పంటకు రూ.60 వేల వరకు ఖర్చు పెడితే, మార్కెట్లో డిమాండ్‌ను బట్టి రూ.1.75 లక్షల వరకు ఆదాయం వస్తుందని చెప్పాడు. 

నాగారం, తెనుగుపల్లెలో పట్టుకుచ్చులు
బతుకమ్మ పేర్చాలంటే తంగేడు పూలతోపాటు గుమ్మడి, కట్ల, గోరింట, పట్టుకుచ్చుల(సీతమ్మ జడ) పూలు ఉండాల్సిందే. ముఖ్యంగా పట్టుకుచ్చులు బతుకమ్మకు ప్రత్యేక ఆకర్షణ తీసుకువస్తాయి. ఈ పూలకు పెట్టింది పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌ మండలంలోని నాగారం, తెనుగుపల్లె గ్రామాలు. గ్రామస్తులు ఏటా బతుకమ్మ సందర్భంగా 10 గుంటల నుంచి ఎకరం వరకు పట్టుకుచ్చులు సాగు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. పూలను సమీపంలోని గోదావరిఖని, ఎన్టీపీసీ, రామగుండం తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు.

నాగారానికి చెందిన తాళ్ల శ్రీనివాస్‌ 20 ఏళ్లుగా ఎకరం భూమిలో పట్టుకుచ్చులు సాగు చేస్తున్నాడు. విత్తనం అలికిననాటి నుంచి పువ్వుకోసే వరకు వరి, పత్తి పంటల్లాగే అన్నిరకాల ఎరువులు వేస్తామని తెలిపాడు. ఈ ఏడాది కొత్త రకం సాగు చేశానని, ఇటీవల కురిసిన వర్షాలకు తోటలో కలుపు తీయలేకపోయామని చెప్పాడు. ఇప్పటివరకు రూ.50 వేలు పెట్టుబడి పెట్టానని, వర్షాల వల్ల ఆశించిన దిగుబడి రాలేదన్నాడు. పెట్టుబడి వస్తుందో, రాదోనని రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపాడు. గతేడాది ఇదే పెట్టుబడికి ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.50 వేల ఆదాయం పొందినట్లు పేర్కొన్నాడు. 

మామిడాలపల్లిలో బంతి, పట్టుకుచ్చులు
వరి పంటతో నష్టాలు చూసిన కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలంలోని మామిడాలపల్లి రైతు కొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి బంతి, పట్టుకుచ్చుల పూలు సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. గతేడాది 1.20 ఎకరాల్లో బంతి విత్తనాలు వేయగా పంట చేతికివచ్చే సమయంలో వర్షాలు కురిసి, పెట్టుబడి కూడా చేతికి రాలేదు. ఈ ఏడాది ఎకరన్నర భూమిలో బంతి, 20 గుంటల్లో పట్టుకుచ్చుల విత్తనాలు వేశాడు. మొక్కలు ఏపుగా పెరిగి, పూలు విపరీతంగా పూశాయి.

వారం రోజుల్లో సద్దుల బతుకమ్మ, దసరా పండుగలు ఉన్నాయి. ప్రస్తుతం కిలోకు రూ.100 నుంచి రూ.130 వరకు చేను వద్దే విక్రయిస్తున్నానని తెలిపాడు. ఇతర ప్రాంతాల నుంచి ఇప్పటికే ఆర్డర్లు వచ్చాయన్నాడు. పూల సాగుకు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టానని, రూ.2 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్పాడు. మొక్కలకు నీటి కోసం మల్చింగ్‌తోపాటు డ్రిప్‌ ఏర్పాటు చేశానని, దీనివల్ల నీటి తడులకు కూడా ఇబ్బంది కలగలేదని పేర్కొన్నాడు. వరి సాగు చేసే రైతులు ప్రత్యామ్నాయ పంటలు పండించాలని సూచిస్తున్నాడు.

మంగళ్లపల్లిలో బంతి, చామంతి, మల్లె పూలు
రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మంగళ్లపల్లిలో 190 కుటుంబాలున్నాయి. అందరికీ వ్యవసాయమే జీవనాధారం. సుమారు 50 కుటుంబాలు బంతి, చామంతి, మల్లె పూలతో ఉపాధి పొందుతున్నారు. సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా పూలు సాగు చేస్తామని రైతు బాదనవేణి బాలరాజు తెలిపాడు. వీటిని సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాలతోపాటు కరీంనగర్‌ మార్కెట్‌కు కూడా తరలిస్తామన్నాడు.

నిత్యం 2 నుంచి 3 క్వింటాళ్ల వరకు విక్రయిస్తామని, శుభకార్యాలు, పండుగల సమయాల్లో గిరాకీ ఎక్కువగా ఉంటుందని చెప్పాడు. సాధారణ రోజుల్లో కిలోకు రూ.50 నుంచి 70 వరకు, దసరా, బతుకమ్మ, దీపావళి తదితర ప్రత్యేక రోజుల్లో రూ.100 నుంచి రూ.150 వరకు విక్రయిస్తామని పేర్కొన్నాడు. పూల సాగుతో వచ్చిన ఆదాయాన్ని కుటుంబ పోషణకు, పత్తిసాగు పెట్టుబడికి వినియోగిస్తామని చెప్పాడు. పూల విత్తనాలను ప్రభుత్వం రాయితీపై ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాడు.

తిమ్మాపూర్‌లో బతుకమ్మ కోసమే..
తిమ్మాపూర్‌(మానకొండూర్‌): మండలంలో అనేక మంది రైతులు బతుకమ్మ పండుగ కోసమే సుమారు 50 ఎకరాల్లో సీతజడ(పట్టుకుచ్చులు), 50 ఎకరాల్లో బంతి తోటలు సాగు చేస్తున్నారు. ఇందుకు కావాల్సిన మొక్కలను నర్సరీల నుంచి తెచ్చుకుంటున్నారు. వ్యాపారులు ఆయా తోటల వద్దకే వెళ్లి, ముందస్తుగా డబ్బులు చెల్లించి, బుక్‌ చేసుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం వస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top