బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతల మధ్య ఘర్షణ

Bandi Sanjay Car Destroyed By TRS Activists - Sakshi

బండి సంజయ్‌ కారును అడ్డుకున్న టీఆర్‌ఎస్‌ 

ఖైరతాబాద్‌ అభ్యర్థి విజయారెడ్డి

ఖైరతాబాద్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కాన్వాయ్‌ను నెక్లెస్‌ రోడ్డులో ఖైరతాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయారెడ్డి, స్థానికులు సోమవారం రాత్రి అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ విషయంపై సెంట్రల్‌ జోన్‌ డీసీపీ విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ బీజేపీ నాయకులతో కలసి బండి సంజయ్‌ రాత్రి 8:50 గంటలకు నెక్లెస్‌ రోడ్డులో ఉన్నారనే సమాచారం రావడంతో రాంగోపాల్‌పేట్‌ ఇన్‌స్పెక్టర్‌ను అక్కడికి పంపించినట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి నాయకులు పబ్లిక్‌ ప్లేస్‌లో తిరగడం మంచిది కాదని పోలీసులు నచ్చజెప్పారు. దీంతో బండి సంజయ్, ఆయన అనుచరులు కారులో వెళ్తుండగా కొందరు యువకులు, టీఆర్‌ఎస్‌ ఖైరతాబాద్‌ అభ్యర్థి విజయారెడ్డి బండి సంజయ్‌ కారును అడ్డుకున్నారని డీసీపీ చెప్పారు. వాహనాన్ని ముందుకు పంపించడంతో వెనుక ఉన్న వాహనాన్ని అడ్డుకొని అద్దాన్ని పగలగొట్టారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదన్నారు.

ఇరు పార్టీల వారిని వెంటనే అక్కడి నుంచి పంపించామని డీసీపీ విశ్వప్రసాద్‌ వివరించారు. అయితే ఎన్నికల కోడ్‌ ఉన్నా కూడా బండి సంజయ్‌ మక్తాలో అనుచరులతో డబ్బులు పంపిణీ చేసేందుకు ప్రయత్నించడంతో అడ్డుకున్నట్లు విజయారెడ్డి తెలిపారు. మహిళ అని కూడా చూడకుండా తనను తోశారని, కానీ ఆయనపైనే దాడి జరిగినట్లు ఆరోపిస్తున్నారని విమర్శించారు. సంజయ్‌ కారును తనిఖీ చేయాలన్నా చేయకపోవడంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని విజయారెడ్డి తెలిపారు. కాగా, చంపాపేట డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ నేతలు డబ్బులు పంచుతున్నట్లు తెలుసుకున్న బీజేపీ నేతలు అక్కడకు వెళ్లి వారిని నిలదీయడం ఉద్రిక్తతకు దారితీసింది. విషయం తెలుసుకున్న ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హుటాహుటిన కాలనీకి చేరుకోవడంతో స్థానికంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీపీ మహేష్‌ భగత్‌ నేతలకు నచ్చజెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. 

ఓటమి భయంతోనే టీఆర్‌ఎస్‌ దాడులు: కిషన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ‘లా అండ్‌ ఆర్డర్‌ను కాపాడాల్సిన పోలీసులే టీఆర్‌ఎస్‌ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ డబ్బులు, మద్యంతో ఓటర్లను ప్రభావితం చేస్తుంటే అడ్డుకొని పట్టిస్తున్న బీజేపీ కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారు. కేసీఆర్, కేటీఆర్‌ ఓడిపోతామనే భయంతో ఎంతకైనా దిగజారడం మంచి పద్ధతి కాదు ’అని కిషన్‌రెడ్డి అన్నారు.  

కాగా, ‘టీఆర్‌ఎస్‌ ఏవిధంగానైనా గెలవాలననే దురుద్దేశంతో విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తోంది. అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తోంది’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తనపై దాడి చేశారని, ఇంకా అనేక చోట్ల బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని సంజయ్‌ ఆరోపించారు.  కాగా, టీఆర్‌ఎస్‌ దాడుల కు నిరసనగా నేడు(మంగళవారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు డాక్టర్‌ కె.లక్ష్మణ్, ఆ  డీకే అరుణ దీక్ష చేపట్టున్నట్లు ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top