
నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బడిబాట
ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచటమే లక్ష్యం
సర్కారీ స్కూళ్లపై విశ్వాసం పెంచేలా కార్యక్రమాలు
సర్కారు బడుల్లో ఏటా తగ్గుతున్న ప్రవేశాలు
దశాబ్దకాలంలో 24 లక్షల నుంచి 16 లక్షలకు తగ్గుదల
స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పడిపోవటమే కారణమనే విమర్శలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఈ నెల 19 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను అన్ని జిల్లాలకు పంపింది. అన్ని స్థాయిల అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని సూచించింది. ప్రభుత్వ టీచర్లలో బోధనా సామర్థ్యం పెంచేందుకు ఈసారి శిక్షణ కూడా ఇచ్చారు.
బడిబాట షెడ్యూల్ ఇదీ..
6వ తేదీ: స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులను భాగస్వా మ్యం చేస్తూ గ్రామసభలు నిర్వహించాలి.
7వ తేదీ: టీచర్లు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి బడి ఈడు పిల్లలను గుర్తించాలి.
8, 9, 10 తేదీల్లో: అంగన్‌వాడీ కేంద్రాల సందర్శన. డ్రాపౌట్ పిల్లలను గుర్తించి బడిలో చేర్పించడంతోపాటు ప్రత్యేక అవస రాలున్న పిల్లలను గుర్తించి, అందుబాటులో ఉన్న భవిత కేంద్రాల్లో చేర్పించాలి.
11వ తేదీ: అప్పటివరకు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష.
12వ తేదీ: అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టి న పనులను ప్రజాప్రతినిధులతో ప్రారంభించాలి. అదే రోజు వి ద్యార్థులకు పాఠ్య, నోటు పుస్తకాలు, యూనిఫామ్స్ అందించాలి.
13వ తేదీ: ప్రజాప్రతినిధులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, గ్రామస్తులను ఆహ్వానించి వారి సమక్షంలో సామూహిక అక్షరాభ్యాసం, బాలసభ నిర్వహించాలి.
16వ తేదీ: ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్), లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్ (లిప్) దినోత్సవం నిర్వహించాలి. అన్ని తరగతి గదుల్లో సబ్జెక్టులవారీగా అభ్యసన సామర్థ్యాలకు సంబంధించిన పోస్టర్లను ప్రదర్శించాలి. పిల్లలు రూపొందించిన వివిధ చార్టులతో గదులను అలంకరించాలి. చదవడం, గణిత అంశాలపై ఎఫ్‌ఎల్‌ఎన్ క్విజ్ పోటీలు నిర్వహించాలి. 17వ తేదీ: ఇంటిగ్రేటెడ్ విద్య. బాలిక విద్యా దినోత్సవం నిర్వహించాలి. బాల్య వివాహాలు, చిన్నారులపై వేధింపులకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించాలి.
18వ తేదీ: తల్లిదండ్రులను, గ్రామస్తులను ఆహ్వానించి తరగతి గదుల డిజిటలైజేషన్, ఇతర అధునిక సౌకర్యాలను చూపించాలి. మొక్కల పెంపకం ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరించాలి.
19వ తేదీ: బడిబాట ముగింపు సందర్భంగా విద్యార్థులకు క్రీడల పోటీలు నిర్వహించాలి.
తగ్గుతున్న ప్రవేశాలు
ప్రభుత్వ స్కూళ్లలో గత పదేళ్లలో విద్యార్థుల ప్రవేశాలు 32 శాతం తగ్గాయి. 2014–15లో 24.85 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్లలో చేరితే, 2024–25లో ఈ సంఖ్య 16.68 లక్షలకు తగ్గింది. అదే కాలంలో ప్రైవేటు స్కూళ్లలో ప్రవేశాలు 31.17 లక్షల నుంచి 36.73 లక్షలకు పెరిగింది.
ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పడిపోవడం కూడా ప్రవేశాలు తగ్గటానికి కారణంగా భావిస్తున్నారు. కాగా, బడిబాటపై చాలామంది టీచర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తూతూమంత్రంగానే పాల్గొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.