తరచూ వెలుగులోకి వస్తున్న ‘ఉగ్ర’ఘట్టాలు
మొయినుద్దీన్ ఉదంతంతో మూలాలూ రిపీట్
ప్రత్యేక విభాగం లేని హైదరాబాద్ కమిషనరేట్
నామ్‌కే వాస్తేగా సీసీఎస్ అదీనంలోని సిట్
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఎలాంటి ఉగ్ర చర్య జరిగినా దాని మూలాలు ఏదో రూపంలో హైదరాబాద్‌లో ఉంటున్నాయి. ఏ కుట్ర భగ్నమైనా నగరంతో లింకు ఉంటోంది. ఎక్కడ నిఘా హెచ్చరికలు వచ్చినా ఇక్కడ అప్రమత్తం కావాల్సిందే. తాజాగా అహ్మదాబాద్ ఏటీఎస్ అరెస్టు చేసిన ఇస్లామిక్ స్టేట్ ఖురాసన్ ప్రావెన్సీ మాడ్యూల్‌కు చెందిన ముగ్గురిలో యునానీ డాక్టర్ మొయినుద్దీన్ ఇక్కడి వాడే.
కేవలం ఇదే కాదు గత కొన్నేళ్లుగా ఉగ్రవాదుల కదలికలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి భాగ్యనగరానికి ప్రత్యేకంగా ఉగ్రవాదులకు సంబంధించి పని చేయడానికి ప్రత్యేక విభాగం లేకపోవడం గమనార్హం. ఉన్నతాధికారులు సైతం ఆ కోణంపై దృష్టి పెట్టడం లేదు.
ఇంటెలిజెన్స్‌లో సీఐ సెల్ ఉన్నప్పటికీ...
దక్షిణాదిలోనే భాగ్యనగరానికి సాఫ్ట్ టార్గెట్‌గా పేరుంది. 1992లో చోటు చేసుకున్న అదనపు ఎస్పీ కృష్ణప్రసాద్ హత్య మొదలు... 2013 నాటి దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల వరకు ఇక్కడ చోటు చేసుకున్న ఉదంతాలే ఈ పేరు తెచ్చిపెట్టాయి. పాక్ కేంద్రంగా పని చేసే దాదాపు ప్రతి ఉగ్రవాద సంస్థ మూలాలూ హైదరాబాద్‌లో కనిపిస్తాయి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఉన్న హైదరాబాద్ కమిషరేట్‌లో ఉగ్రవాదులకు చెక్ చెప్పేందుకు, వారికి సంబంధించిన వివరాలను సేకరించేందుకు ప్రత్యేక విభాగం లేదు.
ఈ కార్యకలాపాల కోసం రాష్ట్రస్థాయిలో ఇంటెలిజెన్స్ ఆధ్వర్యంలో కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐ) సెల్ పని చేస్తోంది. అయితే కనీసం దాంతో సమన్వయానికీ ప్రత్యేక విభాగమంటూ లేదు. స్థానికంగా ఉన్న అనుమానితులు, సానుభూతిపరులపై కన్నేసి ఉంచడంతోపాటు అత్యవసర సమయాల్లో క్షేత్రస్థాయి నుంచి సమాచారం సేకరించడానికి అవసరమైన యంత్రాంగం లేనే లేదు. చాన్నాళ్లు
ఆ పని చేసిన సిట్
1990ల్లో హైదరాబాద్ మతకలహాలతో అట్టుడుకుతున్నప్పుడు ఈ తరహా కేసులను దర్యాప్తు చేయడానికి సీసీఎస్ అదీనంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటైంది. అప్పట్లో ఏసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో 40 మంది సిబ్బందితో ఉండేది. కాలానుగుణంగా నగరంలో ఉగ్రవాదులూ, ఐఎస్‌ఐ ఏజెంట్ల ఉనికి పెరగడం ప్రారంభమైంది.
అప్పట్లో ఈ కేసులను దర్యాప్తు చేయడానికి ప్రత్యేక విభాగమంటూ లేకపోవడంతో సిట్‌కే ఆ బాధ్యతలను అప్పగించారు. 2007లో చోటు చేసుకున్న జంట పేలుళ్ల వరకు ఈ విభాగం అనేక కేసులు దర్యాప్తు చేసింది. ఎంతో మంది అనుమానితులు, సానుభూతి పరులను అరెస్టు చేసింది. రాష్ట్రం ఏర్పడే వరకు దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ ఉగ్రవాది పట్టుబడినా సిట్ బృందం వెళ్లి ప్రశ్నించి వచ్చేది. ఇటీవల కాలంలో ఈ ఊసే లేకుండా పోయింది.
ప్రస్తుతం ఉనికి కోల్పోయే స్థితిలో..
ఇప్పుడు సిట్ ఉగ్రవాద కోణంలో ఉనికి కోల్పోయే స్థితికి చేరింది. ఈ రంగంపై పట్టున్న సిబ్బంది లేమి, మౌలిక వసతుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది. ఈ విభాగం దర్యాప్తు చేస్తున్న సాధారణ వైట్ కాలర్ అఫెన్సెస్ కేసులూ ఎక్కువగానే ఉన్నాయి. ఉగ్రవాదుల కదలికలు గుర్తించడం, వారిపై నిఘా ఉంచడం మాట అటుంచితే... కనీసం ఓ ఉగ్రవాది చిక్కినప్పుడు అతడిని ఇంటరాగేషన్ చేసే సామర్థ్యం ఒక్కరికీ లేకుండా పోతోంది.
ప్రస్తుతం ఉగ్ర సంబంధ కేసుల దర్యాప్తు అంటే అనేక సౌకర్యాలు, మౌలిక వసతులతోపాటు భారీ సిబ్బంది అవసరం ఉంది. ఆ స్థాయిలో సిట్‌కు సరైన ఆర్థిక వనరులు, వాహనాలు సైతం లేవు. ఉగ్రవాద సంబంధ సమాచార సేకరణ, కేసును దర్యాప్తు చేయాలంటే మౌలిక వసతులు, సిబ్బందితోపాటు ఆ రంగంపై పట్టు, అనుభవం ఉన్న అధికారుల ఆవశ్యకత ఉంది.


