అన్నవరం దేవేందర్‌కు దాశరథి పురస్కారం | Annavaram devender receives dasharathi krishnamacharya award | Sakshi
Sakshi News home page

అన్నవరం దేవేందర్‌కు దాశరథి పురస్కారం

Jul 22 2025 1:55 AM | Updated on Jul 22 2025 1:55 AM

Annavaram devender receives dasharathi krishnamacharya award

నేడు రవీంద్రభారతిలో సీఎం రేవంత్‌ చేతుల మీదుగా ప్రదానం

సాక్షి, హైదరాబాద్‌/కరీంనగర్‌కల్చరల్‌: దాశరథి కృష్ణమాచార్య పురస్కారానికి కవి, కాలమిస్టు అన్నవరం దేవేందర్‌ పేరును ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం పోతారం గ్రామానికి చెందిన దేవేందర్‌ తెలంగాణ పదాలతో ఆకట్టుకునే రీతిలో రచనలు చేస్తారన్న గుర్తింపు ఉంది. పంచాయతీరాజ్‌ శాఖలో ఉద్యోగం చేస్తూనే రచనావ్యాసంగాన్ని కొనసాగించారు. తెలంగాణ సాహిత్యానికి ఆయన చేసిన సేవలకు గాను ప్రభుత్వం ఈ ఏడాది ప్రతిష్టాత్మక దాశరథి కృష్ణమాచార్య పురస్కారానికి ఎంపిక చేసింది. ఆయన్ను రూ.1,01,116 నగదు పురస్కారం, శాలువ, జ్ఞాపికతో సత్కరించనుంది. మంగళవారం రవీంద్రభారతిలో జరిగే కృష్ణమాచార్య జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని దేవేందర్‌కు అందచేస్తారు.  

నిఖార్సయిన తెలంగాణ కవి  
తెలంగాణ యాస..పల్లెభాషలో దేవేందర్‌ రచనలు ఉంటా యి. ఆయన కవిత సంపుటాలకు తెలంగాణ పదాలతోనే పేర్లు ఉంటాయి. కేదారమ్మ–దశరథం దంపతులకు అక్టోబర్‌ 17, 1962లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని హుస్నాబాద్‌ మండలం పోతారం(ఎస్‌)లో అన్నవరం దేవేందర్‌ జని్మంచారు. ఎంఏ సామాజిక శాస్త్రం చదివిన ఆయన.. జిల్లా పరిషత్‌లో పంచాయతీరాజ్‌శాఖ సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ 2020లో ఉద్యోగ విరమణ పొందారు. ‘తెలంగాణ యాస, భాషలో కవిత్వం రాస్తున్న నన్ను ప్రభుత్వం గుర్తించి దాశరథి అవార్డు ఇవ్వడం ఆనందంగా ఉంది’అని దేవేందర్‌ చెప్పారు.  

సాహిత్య ప్రస్థానం ఇలా... 
1988లో శ్రీశ్రీ, శివసాగర్, సినారె, ఎన్‌.గోపి, నందిని సిధారెడ్డిల రచనలు చదివే క్రమంలో ఆయనకు సాహిత్యంపై మక్కువ ఏర్పడింది. ఇప్పటి వరకు 16 పుస్తకాలు వెలువరించారు. ఇందులో 12 కవిత్వాలు, 2 ఆంగ్ల అనువాద కవిత్వం, 2 వ్యాసాల సంపుటిలు ఉన్నాయి. 2001లో ‘తొవ్వ’తో తన మొదటి కవితా సంపుటిని వెలువరించారు. 2003లో ‘నడక’ద్వితీయ పుస్తకంగా అచ్చయ్యింది. 2005లో మంకమ్మతోట లేబర్‌ అడ్డా పుస్తకాన్ని ఆవిష్కరించారు.

దీనిని డిగ్రీలో పాఠ్యాంశంగా చేర్చారు. ‘బుడ్డపర్కలు’నానీలు 2006లో, బొడ్డు మల్లెచెట్టు 2008లో, పొద్దుపొడుపు కవితా సంకలాన్ని 2011లో ఆవిష్కరించారు. 2014లో పొక్కిలి వాకిళ్లు పులకరింత, 2016లో ‘బువ్వ కుండ’దీర్ఘ కవితా సంపుటి, 2016లో ఇంటి దీపం, 2018లో వరిగొలుసులు, 2021లో గవాయి, 2022లో జీవన తాత్పర్యం పుస్తకాలను ఆవిష్కరించారు. 2022లో ‘మరో కోణం’వ్యాస సంపుటిని, ‘ఊరి దస్తూరి’వ్యాస సంపుటి, 2023లో సంచారయాత్ర వ్యాసాల సంకలనం, 2024లో అంతరంగం (వర్తమాన జీవిత చిత్రణ)ను పుస్తకాలను వెలువరించారు.

‘పొక్కిలి వాకిళ్ల పులకరింత’కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం లభించింది.‘ఊరి దస్తూరి’పుస్తకానికి తెలంగాణ సారస్వత పరిషత్‌ సాహిత్య పురస్కారం ప్రకటించారు. ఇంకా ఎన్నో పురస్కారాలు ఆయన్ను వరించాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement