breaking news
Krishnamacharya dasarathi
-
అన్నవరం దేవేందర్‌కు దాశరథి పురస్కారం
సాక్షి, హైదరాబాద్/కరీంనగర్‌కల్చరల్: దాశరథి కృష్ణమాచార్య పురస్కారానికి కవి, కాలమిస్టు అన్నవరం దేవేందర్ పేరును ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన దేవేందర్ తెలంగాణ పదాలతో ఆకట్టుకునే రీతిలో రచనలు చేస్తారన్న గుర్తింపు ఉంది. పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగం చేస్తూనే రచనావ్యాసంగాన్ని కొనసాగించారు. తెలంగాణ సాహిత్యానికి ఆయన చేసిన సేవలకు గాను ప్రభుత్వం ఈ ఏడాది ప్రతిష్టాత్మక దాశరథి కృష్ణమాచార్య పురస్కారానికి ఎంపిక చేసింది. ఆయన్ను రూ.1,01,116 నగదు పురస్కారం, శాలువ, జ్ఞాపికతో సత్కరించనుంది. మంగళవారం రవీంద్రభారతిలో జరిగే కృష్ణమాచార్య జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని దేవేందర్‌కు అందచేస్తారు. నిఖార్సయిన తెలంగాణ కవి తెలంగాణ యాస..పల్లెభాషలో దేవేందర్ రచనలు ఉంటా యి. ఆయన కవిత సంపుటాలకు తెలంగాణ పదాలతోనే పేర్లు ఉంటాయి. కేదారమ్మ–దశరథం దంపతులకు అక్టోబర్ 17, 1962లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్)లో అన్నవరం దేవేందర్ జని్మంచారు. ఎంఏ సామాజిక శాస్త్రం చదివిన ఆయన.. జిల్లా పరిషత్‌లో పంచాయతీరాజ్‌శాఖ సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ 2020లో ఉద్యోగ విరమణ పొందారు. ‘తెలంగాణ యాస, భాషలో కవిత్వం రాస్తున్న నన్ను ప్రభుత్వం గుర్తించి దాశరథి అవార్డు ఇవ్వడం ఆనందంగా ఉంది’అని దేవేందర్ చెప్పారు. సాహిత్య ప్రస్థానం ఇలా... 1988లో శ్రీశ్రీ, శివసాగర్, సినారె, ఎన్.గోపి, నందిని సిధారెడ్డిల రచనలు చదివే క్రమంలో ఆయనకు సాహిత్యంపై మక్కువ ఏర్పడింది. ఇప్పటి వరకు 16 పుస్తకాలు వెలువరించారు. ఇందులో 12 కవిత్వాలు, 2 ఆంగ్ల అనువాద కవిత్వం, 2 వ్యాసాల సంపుటిలు ఉన్నాయి. 2001లో ‘తొవ్వ’తో తన మొదటి కవితా సంపుటిని వెలువరించారు. 2003లో ‘నడక’ద్వితీయ పుస్తకంగా అచ్చయ్యింది. 2005లో మంకమ్మతోట లేబర్ అడ్డా పుస్తకాన్ని ఆవిష్కరించారు.దీనిని డిగ్రీలో పాఠ్యాంశంగా చేర్చారు. ‘బుడ్డపర్కలు’నానీలు 2006లో, బొడ్డు మల్లెచెట్టు 2008లో, పొద్దుపొడుపు కవితా సంకలాన్ని 2011లో ఆవిష్కరించారు. 2014లో పొక్కిలి వాకిళ్లు పులకరింత, 2016లో ‘బువ్వ కుండ’దీర్ఘ కవితా సంపుటి, 2016లో ఇంటి దీపం, 2018లో వరిగొలుసులు, 2021లో గవాయి, 2022లో జీవన తాత్పర్యం పుస్తకాలను ఆవిష్కరించారు. 2022లో ‘మరో కోణం’వ్యాస సంపుటిని, ‘ఊరి దస్తూరి’వ్యాస సంపుటి, 2023లో సంచారయాత్ర వ్యాసాల సంకలనం, 2024లో అంతరంగం (వర్తమాన జీవిత చిత్రణ)ను పుస్తకాలను వెలువరించారు.‘పొక్కిలి వాకిళ్ల పులకరింత’కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం లభించింది.‘ఊరి దస్తూరి’పుస్తకానికి తెలంగాణ సారస్వత పరిషత్ సాహిత్య పురస్కారం ప్రకటించారు. ఇంకా ఎన్నో పురస్కారాలు ఆయన్ను వరించాయి. -
దాశరథి పేరిట స్మారక పురస్కారం
కృష్ణమాచార్య జయంతి సభలో సీఎం కేసీఆర్ హైదరాబాద్: ప్రముఖ కవి, సాహితీవేత్త దివంగత దాశరథి కృష్ణమాచార్య పేరిట స్మారక పురస్కారాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించారు. ప్రతి సంవత్సరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన కవికి ఆ పురస్కారం రూపంలో రూ. లక్షా నూట పదహార్లు అందజేసి సత్కరిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఏదైనా విశ్వవిద్యాలయానికి లేదా ప్రముఖ విద్యాసంస్థకు ఆయన పేరు పెడతామని వెల్లడించారు. దాశరథి 89వ జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా మంగళవారమిక్కడి రవీంద్రభారతిలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇంతకాలం నిర్లక్ష్యానికి గురైన దాశరథి కృష్ణమాచార్య వంటి వారిని ఈ ప్రభుత్వం సమున్నతంగా గౌరవిస్తుందని చెప్పారు. నగరంలోని ముఖ్యమైన ప్రాంతంలో దాశరథి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్టు తెలిపారు. ఆయన కుమారుడికి ప్రభుత్వంలో మంచి ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. కాగా, రవీంద్రభారతిలో సరైన ఏర్పాట్లు లేవని, ఇకపై అలాంటి లోపాలు లేకుండా ప్రతి సంవత్సరం రూ.కోటి గ్రాంటును మంజూరు చేస్తామని సీఎం ప్రకటించారు. పనికిమాలిన విగ్రహాలెన్నో: సభావేదికపై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను కొన్ని మాటలు మాట్లాడితే లొల్లి అయితది’ అంటూనే ట్యాంక్‌బండ్‌పై ఉన్న విగ్రహాల గురించి వ్యాఖ్యలు చేశారు. దాశరథికి విగ్రహం లేదనే సందర్భంలో మాట్లాడుతూ.. ‘‘చూస్తున్నరుగదా ట్యాంక్‌బండ్ మీద, చౌరస్తాలల్లో ఎన్నో పనికిమాలిన విగ్రహాలున్నై. అవి మనకు సంబంధించినవారివి కాదు. ఆ నాటకాలాయనతో మనకేం సంబంధం? పుస్తకంలో పాఠం చూసి.. బళ్లారి రాఘవ గురించి నాకేం అవసరం అని ఓ చిన్నపాప ఇటీవల అడిగింది’’ అని తెలిపారు. తెలంగాణ సంస్కృతిని ఎవరైనా విమర్శిస్తే తగిన విధంగా సమాధానం చెబుతామని హెచ్చరించారు. విమర్శిస్తే మా వద్ద ‘రాళ్లబండి’ ఉంది (పక్కనే సాంస్కృతిక విభాగం సంచాలకులు రాళ్లబండి కవితాప్రసాద్ ఉన్నారు) అని చమత్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ప్రసాద రాజు, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి బి.పి.ఆచార్య, సాహితీవేత్తలు నందిని సిద్ధారెడ్డి, శ్రీనివాసాచార్య, దాశరథి కుమారుడు లక్ష్మణాచార్య పాల్గొన్నారు. గురుభక్తి చాటుకున్న కేసీఆర్: సీఎం సభావేదికపైకి వస్తుండగా ప్రముఖ సాహితీవేత్త తిరుమల శ్రీనివాసాచార్య కనిపించారు. వెంటనే కేసీఆర్ ఆయనకు పాదాభివందనం చేశారు. తాను దుబ్బాక పాఠశాలలో చదువుతున్నప్పుడు ఆయన తెలుగు బోధించేవారని తెలిపారు.