అమీర్‌పేట అగ్నిప్రమాదం: భారీగా ట్రాఫిక్‌జామ్‌ | Ameerpet Mytrivanam Fire Accident news Updates | Sakshi
Sakshi News home page

అమీర్‌పేట అగ్నిప్రమాదం: భారీగా ట్రాఫిక్‌జామ్‌

Jun 4 2026 1:13 PM | Updated on Jun 4 2026 2:03 PM

Ameerpet Mytrivanam Fire Accident news Updates

సాక్షి, హైదరాబాద్‌: అమీర్‌పేటలో గురువారం మధ్యాహ్నాం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మైత్రివనం సిగ్నల్‌ సమీపంలోని ఓ షాపింగ్‌ మాల్‌ అగ్నికి ఆహుతైంది. అమీర్‌పేట మెట్రో జంక్షన్‌కు 100 అడుగుల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ప్రమాదంతో అమీర్‌పేట చుట్టుపక్కల ఏరియాల్లో భారీగా ట్రాఫిక్‌జామ్‌ అయ్యింది.

అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ వద్ద పిల్లర్‌ నెంబర్‌ 1043 వద్ద శ్రీనివాసనగర్ వెస్ట్ కమాన్‌ను ఆనుకుని ఉన్న కేఎస్సార్‌ షాపింగ్‌ మాల్‌ కాంప్లెక్స్‌ నుంచి మంటలు మొదలైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆపై మంటలు వేగంగా వ్యాపిస్తూ చుట్టుపక్కల దుకాణాలకు వ్యాపించడం మొదలుపెట్టాయి. ప్రమాదం ధాటికి షాపింగ్‌ మాల్‌ పూర్తిగా దగ్ధమైంది. రెండు, మూడు అంతస్థుల్లోని సుమారు 20 దుకాణాలు ఖాళీ బూడిదయ్యాయి. పక్కనే ఉన్న ఓ మెస్‌కు మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది.

 సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ప్రమాదంలో అమీర్‌పేట-మైత్రివనం ఏరియాలో దట్టమైన పొగ అలుముకుంది.  సహాయక చర్యల నేపథ్యంలో.. అమీర్‌పేట నుంచి ఎస్సార్‌ నగర్‌ వెళ్లే వైపు భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. సిటీ బస్సులు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి.  వాటర్‌ ట్యాంకర్లు, ఆరు ఫైరింజన్లు మంటల్ని అదుపు చేసే రెస్క్యూలో పాల్గొంటున్నాయి. ప్రాణ నష్టం తప్పినప్పటికీ.. భారీగా ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియ రావాల్సి ఉంది.

మెట్రో సేవలకు అంతరాయం!
మైత్రివనం దగ్గర అగ్నిప్రమాదంతో మెట్రో రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం అందుతోంది. ప్రమాదం జరిగిన ప్లేస్‌ మెట్రో ట్రాక్‌కు సమీపంలో ఉండడం, పిల్లర్‌కు సైతం మంటలు అంటుకోవడం.. ఫైరింజన్లతో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతుండడం మెట్రో రైళ్లలో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  

సజ్జనార్‌ ట్వీట్‌
మైత్రివనం సిగ్నల్‌ దగ్గరి అగ్నిప్రమాదంపై నగర కమిషనర్‌ సీవీ సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు. అమీర్‌పేటలోని శ్రీనివాసనగర్ వెస్ట్, మెట్రో పిల్లర్ నంబర్ A1043 సమీపంలో ఉన్న కెఎస్సార్ ఫ్యాషన్స్‌లో అగ్నిప్రమాదం సంభవించిందని.. అత్యవసర సహాయక చర్యల కారణంగా, అమీర్‌పేట నుండి ఎస్సార్ నగర్ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని.. దీనివల్ల ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యిందని.. వాహనదారులు ఈ మార్గంలో ప్రయాణించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్, అత్యవసర సిబ్బందికి సహకరించాలని కోరారాయన. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement