breaking news
Mytrivanam
-
అమీర్‌పేట ప్రమాదం.. స్పాట్‌కు ‘హైడ్రా’ రంగనాథ్
హైదరాబాద్: అమీర్‌పేట మైత్రివనం సిగ్నల్ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇంత భారీ ప్రమాదం జరిగి 24 గంటలు గడుస్తున్నా.. ఎలా జరిగింది? అనేదానిపై పోలీసులు కచ్చితమైన ఓ అంచనాకు రాలేకపోయారు. ఈ క్రమంలో.. ఫోరెన్సిక్ టీం శుక్రవారం మరోసారి ఆధారాలు సేకరించే ప్రయత్నం చేసింది. మరోవైపు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ‘‘మంటల్లో బిల్డింగ్ దాదాపుగా కాలిపోయింది. కాంప్లెక్స్‌కు ఎంట్రీ, ఎగ్జిట్లు సరిగ్గా లేవు. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగలేదు. పక్కన మెస్ నుంచి మంటలు వ్యాపించాయని కొందరు అంటున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందని మరికొందరు అంటున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనేది దర్యాప్తు పూర్తైతేనే తెలుస్తుంది.. .. మెట్రో నిర్మాణం తర్వాతే ఈ కాంప్లెక్స్ కట్టారని అంటున్నారు. ఫుట్‌పాత్, నాలా ఆక్రమణలు జరిగాయా? అనే దానిపై దృష్టిసారించాం. అలాగే.. బిల్డింగ్ అనుమతలు, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించారా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. నాలా ఆక్రమణ ఉంటే కచ్చితంగా కూల్చేస్తామని అన్నారాయన. ఈ ప్రమాదం నేపథ్యంలో.. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని భవనాలపై హైడ్రా తరఫున ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారాయన. ఇదిలా ఉంటే.. మైత్రివనం చౌరస్తాలోని మెట్రో పిల్లర్ నెంబర్ 1043 వద్ద శ్రీనివాసనగర్ వెస్ట్ కమాన్‌ను ఆనుకుని ఉన్న కేఎస్సార్ మాల్ కాంప్లెక్స్‌లో గురువారం మధ్యాహ్నాం అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం ధాటికి 20కి పైగా దుకాణాలు ఖాళీ బూడిదయ్యాయి. సుమారు కోటిన్నర రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. అయితే రెండో అంతస్తులో షార్ట్‌సర్క్యూట్ జరిగి ఈ ఘోరం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. -
అమీర్‌పేట అగ్నిప్రమాదం: భారీగా ట్రాఫిక్‌జామ్
సాక్షి, హైదరాబాద్: అమీర్‌పేటలో గురువారం మధ్యాహ్నాం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మైత్రివనం సిగ్నల్ సమీపంలోని ఓ షాపింగ్ మాల్ అగ్నికి ఆహుతైంది. అమీర్‌పేట మెట్రో జంక్షన్‌కు 100 అడుగుల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ప్రమాదంతో అమీర్‌పేట చుట్టుపక్కల ఏరియాల్లో భారీగా ట్రాఫిక్‌జామ్ అయ్యింది.అమీర్‌పేట మెట్రో స్టేషన్ వద్ద పిల్లర్ నెంబర్ 1043 వద్ద శ్రీనివాసనగర్ వెస్ట్ కమాన్‌ను ఆనుకుని ఉన్న కేఎస్సార్ షాపింగ్ మాల్ కాంప్లెక్స్ నుంచి మంటలు మొదలైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆపై మంటలు వేగంగా వ్యాపిస్తూ చుట్టుపక్కల దుకాణాలకు వ్యాపించడం మొదలుపెట్టాయి. ప్రమాదం ధాటికి షాపింగ్ మాల్ పూర్తిగా దగ్ధమైంది. రెండు, మూడు అంతస్థుల్లోని సుమారు 20 దుకాణాలు ఖాళీ బూడిదయ్యాయి. పక్కనే ఉన్న ఓ మెస్‌కు మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ప్రమాదంలో అమీర్‌పేట-మైత్రివనం ఏరియాలో దట్టమైన పొగ అలుముకుంది. సహాయక చర్యల నేపథ్యంలో.. అమీర్‌పేట నుంచి ఎస్సార్ నగర్ వెళ్లే వైపు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సిటీ బస్సులు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. వాటర్ ట్యాంకర్లు, ఆరు ఫైరింజన్లు మంటల్ని అదుపు చేసే రెస్క్యూలో పాల్గొంటున్నాయి. ప్రాణ నష్టం తప్పినప్పటికీ.. భారీగా ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియ రావాల్సి ఉంది.మెట్రో సేవలకు అంతరాయం!మైత్రివనం దగ్గర అగ్నిప్రమాదంతో మెట్రో రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం అందుతోంది. ప్రమాదం జరిగిన ప్లేస్ మెట్రో ట్రాక్‌కు సమీపంలో ఉండడం, పిల్లర్‌కు సైతం మంటలు అంటుకోవడం.. ఫైరింజన్లతో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతుండడం మెట్రో రైళ్లలో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సజ్జనార్ ట్వీట్మైత్రివనం సిగ్నల్ దగ్గరి అగ్నిప్రమాదంపై నగర కమిషనర్ సీవీ సజ్జనార్ ట్వీట్ చేశారు. అమీర్‌పేటలోని శ్రీనివాసనగర్ వెస్ట్, మెట్రో పిల్లర్ నంబర్ A1043 సమీపంలో ఉన్న కెఎస్సార్ ఫ్యాషన్స్‌లో అగ్నిప్రమాదం సంభవించిందని.. అత్యవసర సహాయక చర్యల కారణంగా, అమీర్‌పేట నుండి ఎస్సార్ నగర్ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని.. దీనివల్ల ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యిందని.. వాహనదారులు ఈ మార్గంలో ప్రయాణించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్, అత్యవసర సిబ్బందికి సహకరించాలని కోరారాయన. ట్రాఫిక్ అలర్ట్!అమీర్‌పేటలోని శ్రీనివాసనగర్ వెస్ట్, మెట్రో పిల్లర్ నంబర్ A1043 సమీపంలో ఉన్న కెఎస్సార్ ఫ్యాషన్స్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. అత్యవసర సహాయక చర్యల కారణంగా, అమీర్‌పేట నుండి ఎస్సార్ నగర్ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది, దీనివల్ల ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్…— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) June 4, 2026 -
అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న విద్యార్థులు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. అమీర్‌పేటలోని మైత్రివనంలో నీలగిరి బ్లాక్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాదం కారణంగా భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. నీలగిరి బ్లాక్‌లో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు.భవనం నాలుగో అంతస్తులోని ఇనిస్టిట్యూట్‌లో విద్యార్థులు ఉండటంతో వారిని రక్షించేందుకు రెస్య్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మంటల్లో చిక్కుకున్న వారిని బాల్కనీ నుంచి కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
మెట్రో పిల్లర్ కాదు.. కిల్లర్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌వాసుల కలల మెట్రోస్టేషన్ ఓ మహిళ నిండు ప్రాణాన్ని బలిగొంది. కేపీహెచ్‌బీ కాలనీలోని ఎస్.ఆర్.హోమ్స్‌లో నివసించే హరికాంత్ రెడ్డి టీసీఎస్‌లో పనిచేస్తున్నారు. ఆయన భార్య మౌనిక కంతాల(24) గృహిణి. ఆమె తన సమీప బంధువు మున్నీకి అమీర్‌పేట్‌లో హాస్టల్ వసతి చూసేందుకు ఆదివారంమధ్యాహ్నం కేపీహెచ్‌బీ మెట్రోస్టేషన్లో రైలు ఎక్కి అమీర్‌పేట్‌లో దిగారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మౌనికతోపాటు ఆమె బంధువు మున్నీ సారథి స్టూడియో వైపు మెట్రో స్టేషన్ మెట్లు దిగారు. వర్షం పడుతుండటంతో మెట్రోస్టేషన్ మెట్ల మార్గం పిల్లర్ కింద నిరీక్షిస్తున్నారు. ఈ సమయంలో పిల్లర్‌పైన ఉన్న మెట్రో స్టేషన్ కాంక్రీటు అంచులు పెచ్చులూడి తొమ్మిది మీటర్ల ఎత్తు నుంచి మౌనిక తలపై పడ్డాయి. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే కుప్పకూలింది. రక్తపు మడుగులో ఉన్న ఆమెను స్థానికులు, మెట్రో సిబ్బంది సమీపంలోని ఆస్పత్రికి ఆటోలో తరలించారు. అయితే మార్గమధ్యలోనే మౌనిక మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఎస్ఆర్నగర్ పోలీసులకు సమాచారం అందడంతో మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలిది కరీంనగర్ జిల్లా అని, నూతనంగా వివాహమైందని పోలీసులు తెలిపారు. బాధితురాలి కుటుంబానికి నష్టపరిహారం అందించాలని ఎల్అండ్టీ మెట్రో అధికారులను ఆదేశించినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎనీ్వఎస్ రెడ్డి తెలిపారు. కాగా, ప్రమాద స్థలాన్ని నగర బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు సందర్శించారు. నిర్మాణ లోపాలే ప్రమాదానికి కారణం... స్టేషన్లను సైతం ప్రీకాస్ట్ విధానంలో నిర్మించారు. అంటే ముందుగా స్టేషన్‌కు అవసరమైన సెగ్మెంట్ల తయారీని ఉప్పల్, మియాపూర్ కాస్టింగ్ యార్డులో సిద్ధం చేసి ఆ తర్వాత స్టేషన్లు నిర్మించిన చోట అమర్చారు. పిల్లర్లు, వాటిపై ఏర్పాటు చేసిన వయాడక్ట్ సెగ్మెంట్ల మధ్య నున్న ఖాళీ ప్రదేశాన్ని కాంక్రీట్ మిశ్రమంతో మూసివేశారు. ఇక్కడే పొరపాట్లు జరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ పనులను హడావుడిగా చేపట్టడంతో మెట్రో రైలు వెళ్లే సమయంలో ప్రకంపనలకు కాంక్రీట్ పెచ్చులూడి తరచూ కింద పడుతుందని తేల్చారు. ఇది మెట్రో ప్రయాణికులు, రహదారి మార్గంలో వెళ్లే వాహనదారుల పాలిట శాపంగా మారుతోందని హెచ్చరిస్తున్నారు. ఆదివారం జరిగిన ఘటనకు సైతం ఇదే కారణమని అభిప్రాయపడుతున్నారు. కాగా, గ్రేటర్ సిటీలో మెట్రో ప్రాజెక్టు 2017 నవంబర్‌లో ప్రారంభమైంది. రెండేళ్ల వ్యవధిలోనే ఇలాంటి ఘటన జరగడం మెట్రో ప్రాజెక్టులోని డొల్లతనాన్ని బయటపెడుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మైత్రివనం కేంద్రంగా ట్రాఫిక్ మళ్లింపు
హైదరాబాద్ : మెట్రో రైల్ నిర్మాణ పనుల నేపథ్యంలో అమీర్‌పేటలోని మైత్రివనం కేంద్రంగా ట్రాఫిక్ మళ్ళింపులు విధించారు. ఇవి గురువారం నుంచి 45 రోజుల పాటు అమలులో ఉంటాయని, వాహనచోదకులు సహకరించాలని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి బుధవారం కోరారు. ►ఎర్రగడ్డ, అమీర్‌పేట వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్ళే వాహనాలను ఎస్సార్‌నగర్‌లోని ఉమేష్‌చంద్ర విగ్రహం చౌరస్తా నుంచి ఎస్సార్‌నగర్ ఠాణా, ఎస్సార్‌నగర్ టి జంక్షన్, సత్యం థియేటర్, దుర్గామాత టెంపుల్ మీదుగా పంపిస్తారు. ఈ మార్గం వన్‌వేగా ఉండే నేపథ్యంలో దీనికి వ్యతిరేక దిశలో వాహనాలు అనుమతించరు. ►ఫతేనగర్ నుంచి అమీర్‌పేట వైపు వచ్చే వాహనాలను సత్యం థియేటర్ వైపు అనుమతించరు. వీటిని బల్కంపేట ఆర్ అండ్ బీ ఆఫీస్, డీకే రోడ్, జీహెచ్ఎంసీ ప్లేగ్రౌండ్ మీదుగా పంపిస్తారు. ►ఎర్రగడ్డ వైపు నుంచి మధురానగర్, కళ్యాణ్‌నగర్ వైపు వెళ్ళే తేలికపాటి వాహనాలు, ఆటోలు, ద్విచక్ర వాహనాలను ఉమేష్ చంద్ర విగ్రహం చౌరస్తా నుంచి కుడి వైపునకు భారీ వాహనాలను ఎడమ వైపునకు మళ్లిస్తారు. ►జీహెచ్ఎంసీ ప్లేగ్రౌండ్, అమీర్‌పేట–సోనాబాయ్ టెంపుల్ మధ్య ఇరుకైన రోడ్డు కావడంతో దీన్ని వన్‌వేగా చేస్తున్నారు. సోనాబాయ్ టెంపుల్ వైపు ఎలాంటి వాహనాలను అనుమతించరు. ►బేగంపేట నుంచి ఎస్సార్‌గనర్, యూసుఫ్‌గూడ వైపు వెళ్ళే వాహనాలను సత్యం థియేటర్ వైపు అనుమతించరు. వీటిని దుర్గామాత దేవాలయం నుంచి మైత్రివనం వైపు మళ్ళిస్తారు. ►ఉమేష్‌చంద్ర విగ్రహం చౌరస్తా, ఎస్సార్‌నగర్ టి జంక్షన్ మధ్య ఉన్న బై లైన్ రోడ్స్‌లో కమ్యూనిటీ హాల్ రోడ్ మినహా మిగిలినవి మూసేస్తారు. ►అమీర్‌పేట జంక్షన్ నుంచి మైత్రివనం, ఎస్సార్‌నగర్ వైపు వెళ్ళే వాహనాలు యథావిధిగా ప్రయాణిస్తాయి. ►ట్రాఫిక్ మళ్లింపులను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు తగిన రూట్లు ఎంపిక చేసుకుంటే మంచిది.


