
సాక్షి, సూర్యాపేట జిల్లా: ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులు ఏబీసీకి చిక్కారు. సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసులో రూ. 25 లక్షల లంచం డిమాండ్ చేస్తూ డీఎస్పీ, సీఐ ఏబీసీకి దొరికిపోయారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతోన్న ఓ ఆస్పత్రిపై నమోదైన కేసులో భారీగా లంచం డిమాండ్ చేశారు.. కేసు వివరాలను.. ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ మీడియాకు వెల్లడించారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్ట్ చేయకుండా, వ్యాపారం సజావుగా సాగాలంటే రూ.25 లక్షలు ఇవ్వాలని సీఐ వీర రాఘవులు, డీఎస్పీ పార్థసారధి డిమాండ్ చేశారు. డీఎస్పీను కలిసి సెటిల్ చేసుకోమంటూ సీఐ వీర రాఘవులు ఆఫర్ ఇచ్చారు. డీఎస్పీని కలిసిన సదరు వ్యక్తి.. రూ. 25 లక్షలు ఇవ్వలేనని ప్రాధేయపడటంతో రూ. 16 లక్షలు తీసుకునేందుకు అంగీకరించారు. డబ్బులు వెంటనే ఇవ్వాలంటూ సీఐ, డీఎస్పీ ఆ వ్యక్తిపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించి పూర్తి స్థాయిలో విచారించామని . ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
గతంలో కూడా సీఐ వీరరాఘవులు, డీఎస్పీ పార్థసారధిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాం. రేపు నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తాం. డబ్బులు తీసుకుంటూ దొరకడమే కాదు. డిమాండ్ చేయడం కూడా నేరంలో భాగమే’’ అని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.