
హైదరాబాద్: డ్రగ్స్ రహిత తెలంగాణనే లక్ష్యంగా సర్కారు చేపట్టిన చర్యల్లో భాగంగా ఈరోజు(శుక్రవారం, జూలై 18) పలువురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు చిక్కారు. నగరంలోని గచ్చిబౌలిలో ఈగల్ టీమ్ చేపట్డిన డకాయ్ ఆపరేషన్‌లో గంజాయిని కొనుగోలు చేస్తూ వీరు పట్టుబడ్డారు. ఇలా పట్టుబడిన వారిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లతో పాటు రియల్ ఎస్టెట్ వ్యాపారులు, డెంటల్ టెక్నీషియన్లు, విద్యార్థులు ఉన్నారు.
రెండు గంటల పాటు ఈగల్ టీమ్ నిర్వహించిన డకాయ ఆపరేషన్‌లో 86 మంది వరకూ పట్టుబడ్డారు. మార్కెటింగ్ ఉద్యోగులు, హెచ్‌ఆర్ మేనేజర్లు సైతం ఈగల్ టీమ్‌కు చిక్కిన వారిలో ఉన్నారు. బాయ్ బచ్చా ఆగయా అంటూ వాట్సాప్ గ్రూప్ ద్వారా గంజాయి అమ్మకాలు జరుపుతున్నట్లు ఈగల్ టీమ్ అధికారులు గుర్తించారు.
సరిహద్దుల నుంచి రాకుండా కట్టడి..
రాష్ట్ర పరిధిలో స్పెషల్ ఆపరేషన్లకే పరిమితం కాకుండా.. రాష్ట్రంలోకి డ్రగ్స్ సరఫరా అవుతున్న ప్రాంతాల్లోనూ డెకాయి ఆపరేషన్లు నిర్వహించడం, మాటు వేసి మత్తు ముఠాల గుట్టు కనిపెట్టడంలోనూ ఈగల్ బృందాలు విజయవంతమవుతున్నాయి. ఇటీవల ఇదే తరహాలో గోవా పబ్బుల్లో డీజేలుగా పనిచేస్తూ.. హైదరాబాద్‌కు కొకైన్ సప్లయ్ చేస్తున్న డీజే వనిష్ టక్కర్, సప్లయర్ బాలకృష్ణను ఇటీవల అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో నిందితులుగా ఉన్న డ్రగ్స్ సప్లయర్ల కాంటాక్ట్స్, కస్టమర్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా.. అధికారులు గోవాలో ఇటీవలే సోదాలు నిర్వహించడం తెలిసిందే.
గోవాలో దాదాపు 50 మంది నైజీరియన్లు పనిచేస్తున్నట్టు పక్కా సమాచారం సేకరించిన తర్వాత.. డ్రగ్స్ కింగ్‌పిన్‌గా భావిస్తున్న మ్యాక్స్ నెట్‌వర్క్‌లోని హవాలా వ్యాపారులు ఉత్తమ్ సింగ్, రాజు సింగ్, మహేందర్ ప్రజాపతిలను అరెస్ట్ చేసి ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. వీరి నుంచి రూ.49.65 లక్షలు సీజ్ చేశారు. ఈ క్రమంలోనే ఓ నైజీరియన్‌ను అరెస్ట్ చేసి రూ.1.64 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్ చేశారు. ఇలా అంతర్రాష్ట్ర ఆపరేషన్లలోనూ దూకుడుగా వెళ్తున్నారు.