
మిన్నంటిన బంధువుల రోదనలు
బాలిక హత్యతో కోరుట్లలో విషాదం
లెక్కలేని అనుమానాలు
జగిత్యాల జిల్లా: కళ్ల ఎదుట ఆడుకుంటున్న ఉన్న..అమ్మాయి అకస్మాతుగా కనిపించకుండా పోయింది. బాలిక ఆచూకీ కోసం వెతుకుతున్న క్రమంలో సమీపంలోని ఓ ఇంట్లో విగతజీవిగా కనిపించింది. బాత్‌రూంలో బాలిక హర్షిత మెడ కోసి దారుణంగా చంపిన వైనం ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించింది. కోరుట్లలోని ఆదర్శనగర్‌లో నివాసముండే ఆకుల రాము–నవీన దంపతుల కూతురు హర్షిత(6) హత్య స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.
పెద్దపులులు చూసి వచ్చి...
శనివారం సాయంత్రం 5 గంటలకు హర్షిత స్కూల్ నుంచి ఇంటికి వచ్చి సమీపంలో పెద్దపులుల ఆటలు సాగుతుండటంతో వాటిని చూసేందుకు చుట్టుపక్కల పిల్లలతో కలిసి వెళ్లింది. కొంత సేపటి తరువాత ఇంటికి వచ్చి నానమ్మతో కాలం గడిపినట్లు సమాచారం. ఆ తరువాత సాయంత్రం 7.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ తరువాత కనిపించకుండా పోయింది. సుమారు గంటన్నర పాటు వెతికిన తల్లిదండ్రులు రాము–నవీనలు తమ కూతురు కనిపించడం లేదని 8.30 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆ తర్వాత పోలీసులు చుట్టుపక్కల ఇండ్లలో బాలిక కోసం వెతుకుతున్న క్రమంలో సమీపంలోని ఓ ఇంట్లోని బాత్‌రూంలో బాలిక మెడకోసి చంపినట్లుగా గుర్తించారు. బాత్‌రూం మొత్తం బాలిక రక్తంతో నిండిఉండగా మృతదేహాన్ని అక్కడి నుంచి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
హత్యా..ప్రమాదమా?
బాలిక మృతదేహం దొరికిన ఇంటికి చెందిన వ్యక్తిని కొడిపెల్లి విజయ్‌గా పోలీసులు గుర్తించారు. విజయ్ భార్య దూరంగా ఉంటున్నట్లుగా సమాచారం. ఆ ఇంట్లో విజయ్‌తో పాటు అతని అన్న, తమ్ముల కుమారులు ఉన్నట్లుగా సమాచారం. అయితే విజయ్ ఎక్కడున్నాడని ఆరా తీసిన పోలీసులు సెల్‌ఫోన్ ద్వారా అతనితో మాట్లాడితే వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉన్నట్లుగా చెపుతున్నట్లుగా సమాచారం. విజయ్ నర్సంపేటలో ఉంటే బాలిక మృతదేహం అతని ఇంట్లోని బాత్‌రూంలోకి ఎలా వచ్చిందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా బాలిక పెద్దపులులకు భయపడి సమీపంలోని ఇంట్లోని బాత్‌రూంలోకి వెళ్లగా అక్కడ కాలు జారి నల్లాపై పడితే మెడకు గుచ్చి వదిలించుకునే ప్రయత్నంలో బాలిక మెడ కోసినట్లుగా మారిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద బాలిక మృతికి కారణాలు అంతుచిక్కడం లేదు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఎస్పీ అశోక్‌కుమార్ సంఘటన స్థలాన్ని సందర్శించారు.