జగిత్యాల జిల్లా: కొత్త కోడలికి అత్తింటి వారు 25 రకాల బతుకమ్మలను వాయినంగా ఇచ్చిన సంఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లిలో చోటు చేసుకుంది. స్థానిక చైతన్యనగర్కు చెందిన వెలగందుల జలేందర్ దంపతుల కూతురు పల్లవిని ఐదు నెలల కిందట గొల్లపల్లి మండలం అగ్గిమల్లకు చెందిన చిట్టిమల్లే అరవింద్కు ఇచ్చి వివాహం చేశారు.
పెళ్లయ్యాక తొలి బతుకమ్మ పండుగ వస్తే కొత్త కోడలికి వాయినం ఇవ్వడం సంప్రదాయం. దాన్ని వినూత్నంగా ఇవ్వాలని భావించిన పల్లవి అత్తింటి వారు గాజులు, బిస్కెట్లు, చాక్లెట్లు, వెండినాణేలు, మెహందీ, ముత్యాలు, కాగితం, బత్తాయి తదితర 25 రకాల బతుకమ్మలను తయారు చేశారు. సోమవారం రాత్రి ఇరు కుటుంబాలు, బంధువుల సమక్షంలో మెట్పల్లిలో ప్రత్యేక వేడుక జరిపి వీటిని పల్లవికి అందించారు.


