మా కల సాకారమయ్యేదెన్నడు? 

1998 DSC Candidates Demand Telangana Govt To Make Justice - Sakshi

1998 డీఎస్సీ బాధితుల మొర 

దశాబ్దాలుగా ఎదురుచూపులు 

ఉద్యమ సమయంలో కేసీఆర్‌ హామీ  

ఇప్పటికీ వీధిలోనే వారి జీవితాలు 

సాక్షి, హైదరాబాద్‌: రెండు దశాబ్దాలకుపైగా ఎదురుచూస్తున్న తమ కల సాకారం చేయాలని 1998 డీఎస్సీ అర్హులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 1500 మంది అభ్యర్థులు సీఎం కేసీఆర్‌ తీసుకునే నిర్ణయం కోసం కళ్లల్లో ఒత్తులేసుకుని నిరీక్షిస్తున్నారు. న్యాయం చేస్తామని ఉద్యమ సమయంలోనూ, సీఎం అయిన తర్వాత కేసీఆర్‌ హామీ ఇచ్చిన విషయాన్ని ‘1998 డీఎస్సీ సాధన సమితి’ రాష్ట్ర అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి అభ్యర్థులకు న్యాయం చేస్తూ ఇటీవలే ఉత్తర్వులు ఇచ్చిందని, దీంతో తమకూ కేసీఆర్‌ త్వరలోనే ఉద్యోగాలు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

వెంటాడుతున్న శాపం
1998లో చంద్రబాబు ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించింది. తొలుత జారీ చేసిన జీవో–221లో రాత పరీక్షకు కటాఫ్‌ మార్కులు ఓసీకి 50, బీసీకి 46, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు 40లను నిర్ణయించారు. ఇంటర్వ్యూలకు పిలిచేందుకు కొన్ని కేటగిరీల్లో సరిపోను అభ్యర్థులు లేరనే సాకుతో కటాఫ్‌ మార్కులను తగ్గిస్తూ జీవో 618 జారీచేశారు. ఈ జీవోలను ఆసరాగా చేసుకుని కొంతమంది అభ్యర్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బు దండుకున్నారు.

221 జీవో కింద అర్హత సాధించిన మెరిట్‌ అభ్యర్థులకు ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు వేశారనే ఫిర్యాదులొచ్చాయి. 618 జీవో కింద అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వడంతో మెరిట్‌ సాధించిన అభ్యర్థులు రోడ్డున పడ్డారు. బాధితులు 24 సంవత్సరాల పోరాడుతున్నారు.  

సూత్రప్రాయ అధికారిక ప్రకటన
ఉద్యమ సమయంలో కేసీఆర్‌ ఈ అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రం ఏర్పడ్డాక 2016లో తెలంగాణ భవన్‌లో అభ్యర్థులతో చర్చలు కూడా జరిపారు. వారికి పోస్టింగ్స్‌ ఇవ్వాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిందని అప్పట్లో విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి మీడియా సమావేశంలోను, అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రభుత్వం తరపున అధికారిక ప్రక­టన చేశారు. తరువాత ముందడుగు పడలేదు.

ఏపీ íసీఎం జగన్, ఆ రాష్ట్రానికి చెందిన డిఎస్సీ 98 క్వాలిఫైడ్స్‌కు ఉద్యోగాలు ఇచ్చా­రని, వయోపరిమితితో సంబంధం లేకుండా స్పెషల్‌ కేసుగా పరిగణించి న్యాయం చేస్తాన­న్న సీఎం కేసీఆర్‌ కూడా మాట నిలబెట్టుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు. సూపర్‌ న్యూమరరీ పోస్టులు సృష్టించైనా ఆదుకుంటానని కేసీఆర్‌ హామీ ఇచ్చారని, ఆ దిశగా   నిర్ణ­యం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top