కన్నీటి పర్యంతమైన విద్యార్థి
మెదక్ జిల్లా (నర్సాపూర్): భుజానికి సద్దన్నం కట్టుకొని మేకలు మేపుతున్న ఈ ఫొటోలో కనిపిస్తున్న 15 ఏళ్ల బాలుడు మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని సంగాయిపేటకు చెందిన డాకె మధు. రంగంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం 7వ తరగతి చదువుతున్నాడు. అందరి పిల్లలలాగే పాఠశాలకు వెళ్తుండేవాడు. తండ్రి సాయిలు మేకలు మేపుతూ ఉండేవాడు. మద్యానికి బానిసైన సాయిలు మేకలు మేపడం మానేసి కొడుకును మేకల కాపరిగా మార్చాడు.
తాను మేకల వద్దకు వెళ్లనని.. బడికి వెళ్లి చదువుకుంటానంటూ ఎంత మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా బెదిరిస్తున్నాడు. బాలుడి తాత బీరప్ప మనవడిని పాఠశాలకు పంపించమని మొరపెట్టుకున్నా తండ్రి వినడం లేదు. ఈ క్రమంలో శనివారం అటుగా వెళ్లిన ‘సాక్షి’ప్రతినిధి మధుతో పాటు అతడి తాతను పలకరించగా ఈ విషయం తెలిసింది. బాలుడు ఉబికి వస్తున్న కన్నీళ్లతో పాఠశాలకు పంపించేలా చూడండి అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.


