రాష్ట్రవ్యాప్తంగా 14,236 పోస్టుల గుర్తింపు
టీచర్ ఖాళీలు 6,399.. హెల్పర్ పోస్టులు 7,837
వీటి నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి
కానీ రిజర్వేషన్ల చిక్కులతో పడని ముందడుగు
న్యాయపరమైన ఇబ్బందులు తొలగే వరకు ఆగాల్సిన పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: అంగన్‌వాడీ కొలువుల భర్తీలో జాప్యం తప్పేలా లేదు. అంగన్‌వాడీల్లో టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ మేరకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి ఫైలు పంపగా.. అక్కడా ఆమోదం లభించింది. దీంతో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రకటన జారీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు నోటిఫికేషన్ వెలువడలేదు.
రిజర్వేషన్లు ఖరారు కాకపోవడం ఇందుకు ఆటంకంగా నిలుస్తోంది. క్షేత్రస్థాయిలో నిర్దేశించిన ఖాళీలకు రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత జిల్లా కలెక్టర్లు ఆ మేరకు ప్రకటనలు విడుదల చేసి పోస్టులను భర్తీ చేస్తారు. కానీ రాష్ట్ర కార్యాలయం నుంచే రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో నియామకాల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీంతో ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఔత్సాహికులకు నిరాశే మిగులుతోంది.
14,236 ఖాళీలు
రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో 14,236 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఇందులో అంగన్‌వాడీ టీచర్ కేటగిరీలో 6,399 ఖాళీలు ఉండగా, హెల్పర్ కేటగిరీలో 7,837 ఖాళీలున్నాయి. ఈ పోస్టులు శాశ్వత ప్రాతిపదికన కానప్పటికీ..రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే భర్తీ చేస్తారు. ఈ నేపథ్యంలో వీటికి రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది.
అయితే ఇందుకు న్యాయపరమైన చిక్కులు ఎదురు కావడంతో ఈ ప్రక్రియ దాదాపు 8 నెలలుగా అటకెక్కింది. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో రిజర్వేషన్ల ఖరారు విషయంలో సమస్య తలెత్తింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, హెల్పర్ల పోస్టులను గిరిజనులు, ఆదివాసీలతో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించి.. ఈమేరకు చర్యలు చేపట్టింది.
కానీ ఈ ప్రక్రియలో రిజర్వేషన్ల సీలింగ్ 50 శాతం మించడంతో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఈ రిజర్వేషన్ల అమలును న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. ఫలితంగా నియామకాల ప్రక్రియ ఎక్కడికక్కడ పెండింగ్‌లో ఉండిపోయింది.
న్యాయపరమైన చిక్కులు ఎప్పుడు వీడేనో..!
న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో మంత్రి సీతక్క ఇటీవల ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ నియామకాలు, సర్వీసు నిబంధనల్లో నిపుణులతో సుదీర్ఘంగా చర్చించారు. మరోవైపు న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలోని సీనియర్ అధికారులతో ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
గిరిజన ప్రాంతాల్లో రిజర్వేషన్ల అమలు విషయంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాలను అధ్యయనం చేసి రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధనలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు ఆయా అధికారుల బృందం అధ్యయనం పూర్తి చేసి నివేదిక సైతం సమర్పించింది. కానీ కోర్టు ఉత్తర్వులు అమలులో ఉండడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది.
కోర్టులో సానుకూల నిర్ణయం వెలువడితేనే నియామకాల విషయంలో ముందడుగు పడేందుకు అవకాశం ఉంటుంది. దీనికి సమయం పడుతుందని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారంతా మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.


