టెన్త్‌  పేపర్ లీక్‌పై మంత్రి సబిత సీరియస్.. ఉద్యోగాలు పోతాయ్ అని అధికారులకు వార్నింగ్..

10th Paper Leak Review Minister Sabitha Serious On Officials - Sakshi

సాక్షి, హైదరాబాద్:  పదో తరగతి పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడే  ఉద్యోగులను ఉద్యోగాల నుండి శాశ్వతంగా తొలగించనున్నట్టు  రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ  ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.  రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ కాలేదని, ఈ విషయంలో  పరీక్షలకు హాజరయ్యే విద్యార్థినీ విద్యార్థులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని  తెలిపారు.

పదో తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సబిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ దేవసేన, పోలీస్ రేంజ్ ఐ.జిలు షానవాజ్ కాసీం , చంద్రశేఖర్ రెడ్డి లు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.

ఈ సందర్బంగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో కట్టుదిట్టమైన చర్యలను చేపట్టిందని, ఈ పరీక్షల విషయంలో తమ స్వార్థ ప్రయోజనాలకై విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇంకా మిగిలిన నాలుగు పరీక్షల నిర్వహణ విషయంలో మరింత కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. ఈ పరీక్షల నిర్వహణలో దాదాపు 55 వేల మంది అధికారులు, సిబ్బంది ప్రత్యక్షంగా పాల్గొంటున్నారని,  ఎట్టిపరిస్థితుల్లోనూ సెల్ ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించవద్దని, పరీక్షల విధి నిర్వహణలో ఉన్న అధికారులు, సిబ్బందికి కూడా ఈ నిబంధన వర్తిస్తుందని  సబితా స్పష్టంచేశారు. 

పరీక్షల నిర్వహణ అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఈ విషయంలో ఏవిధమైన అపోహలకు, అనుమానాలకు తావు లేదని మంత్రి పేర్కొన్నారు. పరీక్షా పేపర్ల రవాణా విషయంలో మరింత భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీ లను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను పటిష్టంగా అమలు చేయడంతోపాటు జిరాక్స్ షాప్‌లను మూసివేయించాలని అన్నారు. ఇంటర్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించడంలో కృషిచేసిన అధికారులను మంత్రి అభినందించారు.
చదవండి: పేపర్‌ లీక్‌ కాదు.. పరీక్ష మధ్యలో బయటకు వచ్చిందంతే!: వరంగల్‌ సీపీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top